logo

శుభకార్యానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని నూజివీడు గ్రామీణ ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి తెలిపారు.

Published : 12 Jun 2024 04:35 IST

కారు, ద్విచక్రవాహనం ఢీ : ఇద్దరి మృతి

ప్రమాదానికి గురైన కారు, పక్కనే మృతదేహం  

నూజివీడు రూరల్, కపిలేశ్వరపురం (పమిడిముక్కల), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని నూజివీడు గ్రామీణ ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి తెలిపారు. జంగంగూడెం నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని మీర్జాపురం వద్ద నూజివీడు వైపు వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురానికి చెందిన కొండేటి ఆదిశేషు(63), మైనం అశోక్‌ (34) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. జంగంగూడెంలో జరిగిన అన్నప్రాసన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి శవ పరీక్ష కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కపిలేశ్వరపురంలో విషాదం: శుభకార్యానికి వెళ్లొస్తామంటూ వెళ్లిన తమ గ్రామస్థులిద్దరూ తిరుగు ప్రయాణంలో  రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన తెలిసి కపిలేశ్వరపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు కొండేటి ఆదిశేషు, మైనం అశోక్‌ సాయంత్రానికల్లా వచ్చేస్తామని చెప్పి మంగళవారం ఉదయం కపిలేశ్వరపురం నుంచి ద్విచక్రవాహనంపై ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వెళ్లారు. వారు తిరిగి వస్తుంటారని కుటుంబ సభ్యులు అనుకుంటున్న సమయంలో వారు ప్రమాదం బారిన పడి ఇద్దరూ మరణించారనే వార్త రెండు కుటుంబాలతోపాటు గ్రామస్థులకు పిడుగుపాటైంది. 

  • కొండేటి ఆదిశేషు వ్యవసాయం చేసుకొంటూ పెద్దమ్రేస్తీగా రైతులతో స్నేహంగా ఉండేవారు. అతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.  కుమారుల్లో ఒకరు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు వ్యవసాయ పనులు చేస్తుంటారు. కుమార్తె బూలా నాగమణి ప్రస్తుతం కపిలేశ్వరపురం సర్పంచిగా ఉన్నారని తెలిపారు. కొండేటి స్థానిక సహకార సంఘం త్రిసభ్య కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.
  • మైనం అశోక్‌ వ్యసాయం చేస్తూ కుటుంబ పెద్దగా ఉన్నారు. నెమ్మదస్తుడు, పరోపకారిగా స్థానికులు చెబుతున్నారు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. అశోక్‌ గేదె కొనేందుకు వెళ్తున్నట్లు చెప్పాడని అతని స్నేహితులు తెలిపారు. కుమారుడి మరణ వార్త తెలుసుకొని తండ్రి నాంచారయ్య పడే ఆవేదన తమను కలచివేసిందని.. భార్య, ముగ్గురు పిల్లలతో అన్యోన్యంగా ఉండే వారి కుటుంబంలో ఈ విషాదం తమను ఎంతో బాధిస్తోందని అశోక్‌ సన్నిహితులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని