logo

అభిమాన తరంగం!

రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేసరపల్లికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తెదేపా, జనసేన, భాజపాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చారు.

Published : 13 Jun 2024 04:02 IST

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పోటెత్తిన వైనం
ఆంక్షలను లెక్కచేయక సాగిన కూటమి శ్రేణులు

విజయవాడ రామవరప్పాడు కూడలి వద్ద రద్దీ

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ - అమరావతి, న్యూస్‌టుడే - బృందం: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేసరపల్లికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తెదేపా, జనసేన, భాజపాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన వారితో విజయవాడ నగరం ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడింది.. పాసులు ఉన్న వారితోపాటు లేని వారు కూడా గణనీయంగా రావడంతో ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిశాయి. సభా ప్రాంగణం నిండిపోయిందని పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో కార్యకర్తలు పలుచోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలు ప్రాంతాల్లో వాహనాలను ఇతర మార్గాల్లో దారిమళ్లించడంతో ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచే ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కూడా పలు జిల్లాల నుంచి కేసరపల్లికి తరలిరావడం కనిపించింది.

కాజా టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు ఆపిన పోలీసులు

తెల్లవారుజాము నుంచే ఉత్సాహంగా.. 

  • సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం తెదేపా కార్యకర్తలు ఉత్తరాంధ్ర, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. బస్సుల్లో, కార్లలో వస్తున్న వీరిని ఏలూరు జిల్లా సరిహద్దు బొమ్ములూరు నుంచి పలుచోట్ల ముందుకు రాకుండా పోలీసులు ఆపారు. వందల సంఖ్యలో వాహనాలు వస్తుండటం, సభా ప్రాంగణం కిక్కిరిసిపోతున్న క్రమంలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు, ఆంక్షలు విధించారు. బొమ్ములూరు టోల్‌ప్లాజా, రామిలేరు వంతెన, హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్, పొట్టిపాడు టోల్‌ప్లాజా, చిన్నఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ కూడలి, గన్నవరం కూడలి, గన్నవరం శివారు, విమానాశ్రయం వద్ద అడ్డుకున్నారు.
  • పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లేందుకు ఆస్కారం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అప్పటికే భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులతో కూడిన బస్సులను, కార్లను ముందుకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో ఉదయం 8.30 గంటల సమయానికే అక్కడ మూడు కి.మీకు పైగా ట్రాఫిక్‌ స్తంభించింది. 
  • గంటకు పైగా ఆందోళన చేసినా పోలీసులు ససేమిరా అనడంతో బస్సుల్లోంచి బయటకు దిగిన నాయకులు, కార్యకర్తలు కాలినడకన పొట్టిపాడు టోల్‌ప్లాజా నుంచి కేసరపల్లి సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో ముందుకు సాగిన వారిని చిన్నఆవుటపల్లి వద్ద పోలీసులు నిరోధించారు. కనీసం అంతర్గత రహదారుల మీదుగా కూడా వెళ్లే ఆస్కారం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాము స్థానికులమని, ఇళ్లకు వెళ్లాలని చెప్పినా, ఆధార్‌ కార్డు చూపాలని పేర్కొనడం గమనార్హం.
  • కనకదుర్గ వారధి వద్ద ఉదయమే పెద్దసంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బెంజి సర్కిల్‌ వద్ద పోలీసులు బ్యారికేడ్లతో మూసేశారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులను మాత్రమే వదిలారు. దీంతో పాసులు ఉన్న వారు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఎనికేపాడు వద్ద సభకు వెళ్తున్న వారిని పోలీసులు ఆపడంతో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ అనుమతించకపోవడంతో జాతీయరహదారిపై బైఠాయించారు. బ్యారికేడ్లను తోసుకుని ముందుకు సాగారు. రామవరప్పాడు వద్ద పోలీసులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పైకి మళ్లించడంతో వాహనాలు ముస్తాబాద వద్ద ఆగిపోయాయి. 

తమ వాహనాల కోసం కార్యకర్తల నిరీక్షణ 

ట్రాఫిక్‌లో చిక్కుకున్న గవర్నర్‌ వాహన శ్రేణి...

చంద్రబాబు, మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కాన్వాయ్‌.. కేసరపల్లి వద్ద చాలా సేపు ఆగిపోయింది. అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో చాలా సమయం రోడ్డుపైనే గవర్నర్‌ ఉండిపోవాల్సి వచ్చింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడంతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని