logo

కృష్ణా జిల్లాకు ఒకే ఒక్కరు..!

కృష్ణా జిల్లా నుంచి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక్కరు మంత్రిగా నియమితులయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఈసారి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పలువురు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలకు నిరుత్సాహాన్నే మిగిల్చారు.

Updated : 13 Jun 2024 05:12 IST

ప్రాతినిధ్యం లేని ఎన్టీఆర్‌ జిల్లా

రవీంద్రతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌. వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా నుంచి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక్కరు మంత్రిగా నియమితులయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఈసారి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పలువురు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలకు నిరుత్సాహాన్నే మిగిల్చారు. కార్యకర్తల అంచనాలకు తగినట్లుగా రెండు జిల్లాల నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి మండలిలో మరొకరికి మాత్రమే స్థానం కల్పించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం 25 మందిని (ముఖ్యమంత్రి కాకుండా) నియమించుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 24 మందినే నియమించి ప్రమాణస్వీకారం చేయించారు. ఆ ఒక్కరు అదృష్టవంతులు ఎవరో అన్న ఉత్కంఠ నెలకొంది. అది ఎన్టీఆర్‌ జిల్లాకు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 

క్లీన్‌స్వీప్‌ చేస్తే.. 

సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలో తెదేపా, జనసేన, భాజపా కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. అత్యధిక మెజార్టీలతో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 20వేలకు పైగానే మెజార్టీలు సాధించారు. జెయింట్‌ కిల్లర్లను ఓడించారు. గెలవలేని స్థానాలను సైతం చేజిక్కించుకున్నారు. అలాంటి రెండు జిల్లాలో కేవలం ఒక్కరికే మంత్రి వర్గంలో చోటు దక్కడం గమనార్హం. మొత్తం 14 స్థానాలకుగాను 12 నియోజకవర్గాల్లో తెదేపా, ఒక స్థానంలో జనసేన, ఒక స్థానంలో భాజపా విజయకేతనం ఎగురవేశాయి. కనీసం మూడు స్థానాలు తప్పనిసరిగా ఉంటాయని ఆశించారు. కానీ దీనికి భిన్నంగా పరిస్థితి ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి దాటే వరకు అధినేత చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్‌ వస్తుందని ఎదురుచూపులు చూశారు. జాబితా వెలువడిన తర్వాత పలువురు కొంత నిరుత్సాహపడ్డారు.

మిత్రపక్షాలకు..

రెండు జిల్లాల నుంచి మిత్రపక్షాలు జనసేన, భాజపాకు దక్కలేదు. భాజపా నుంచి విజయవాడ పశ్చిమలో గెలిచిన సుజనాచౌదరికి ఆఖరి నిమిషం వరకు మంత్రివర్గంలో బెర్తు ఖాయమని భావించారు. కానీ తొలిసారి ఎన్నికైన సత్యకుమార్‌కు దక్కింది. గతంలో కేంద్ర మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం సుజనాచౌదరికి ఉంది. ఎన్టీఆర్‌ జిల్లా భాజపా వర్గాలు కొంత నిరుత్సాహానికి గురయ్యాయి. కృష్ణా జిల్లా జనసేన నుంచి గెలుపొందిన మండలి బుద్ధప్రసాద్‌కు అవకాశం ఉంటుందని అంచనా వేశారు. కానీ ఎన్నికల ముందే ఆయన తెదేపా నుంచి జనసేనలో చేరడం అడ్డంకిగా మారి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

విధేయతకు రెండో సారి..

మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొల్లు రవీంద్రకు రెండోసారి మంత్రివర్గంలో స్థానం లభించింది. 2014లో గెలుపొందిన కొల్లు రవీంద్రకు.. ఎక్సైజ్, బీసీ సంక్షేమం శాఖలు అప్పగించారు. 2009లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి ఓటమి చెందారు. ప్రస్తుతం రెండోసారి గెలిచిన ఆయనకు.. మంత్రివర్గంలోనూ స్థానం లభించింది. ఏయే శాఖలు కట్టబెడతారనేది ఆసక్తికరం. బీసీ సాధికార కన్వీనర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాలను పార్టీకి చేరువ చేయడంలో ప్రత్యేక చొరవ చూపారు. గత వైకాపా ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారు. 54 రోజులు జైలులో మగ్గారు. హత్య కేసు మోపారు. పోలీసులు అకారణంగా అరెస్టు చేసి మానసికంగా, శారీరకంగా హింసించారు. ప్రధానంగా పార్టీకి విధేయుడిగా గుర్తింపు పొందారు. చంద్రబాబుకు ఆయనపై విశ్వాసం ఉంది. దీంతో రెండోసారి పదవి లభించింది. 

పార్టీ మారి.. పదవి దక్కి..!

వైకాపా నుంచి తెదేపాలో చేరిన కొలుసు పార్థసారథికి మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు నియోజకవర్గానికి (ప్రస్తుతం ఏలూరు జిల్లా) ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు.. చోటు దక్కడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్థసారథి తండ్రి కె.పి.రెడ్డయ్య 1991లో తెదేపా నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అనంతరం పార్టీ మారారు. ఆయన కుమారుడు పార్థసారథి.. కాంగ్రెస్‌లో చేరి ఉయ్యూరు నుంచి పోటీ చేసి 2004లో గెలుపొందారు. వై.ఎస్‌. మంత్రి వర్గంలో పశుసంవర్దక శాఖ మంత్రిగా చేశారు. తర్వాత 2009లో పెనమలూరు నుంచి గెలుపొంది విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో ఓడిపోయారు. 2019లో వైకాపా తరఫున గెలుపొందిన ఆయనకు.. తగిన గుర్తింపు లభించలేదు. ఇదే అంశాన్ని సభలో ప్రస్తావించినందుకు వై.ఎస్‌.జగన్‌ ఆయనపై వేటు వేశారు. దీంతో తెదేపాలో చేరిన ఆయనకు నూజివీడు కేటాయించారు. అక్కడ గెలుపొంది మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. తన సీనియార్టీకి తగిన గుర్తింపు తెదేపాలో లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. 

అంచనాలు తారుమారు..

  • గుడివాడ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాల నుంచి తెదేపా గెలుపొందడం లేదు. వైకాపా నుంచి కొడాలి నాని గెలిచారు. రెండుసార్లు సైకిల్‌ గుర్తుపై, మరో రెండు సార్లు ఫ్యాన్‌ గుర్తుపై గెలిచారు. గుడివాడ నియోజకవర్గాన్ని గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో తెదేపా నాయకత్వం పనిచేసింది. దీనికి ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రామును అభ్యర్థిగా ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. ఆయన భారీ ఆధిక్యంతో కొడాలి నానిని ఓడించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించినా రాలేదు. 
  • కృష్ణా జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా పదవి వస్తుందని ఆశించినా దక్కలేదు.
  • ఎన్టీఆర్‌ జిల్లాలో సీనియరు నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఈసారి తనకు తప్పక బెర్త్‌ ఉంటుందని ఆశించారు. ఆయన హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే అంతేకాదు.. గతంలో విజయవాడ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత తెదేపాలో చేరారు. కానీ సామాజిక సమీకరణాల్లో సర్దుబాటు కుదరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
  • ఎన్టీఆర్‌ జిల్లా నుంచే సామాజిక సమీకరణాల్లోనే పదవిని ఆశించిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమాకు నిరాశే ఎదురైంది. ఈసారి జనసేన నుంచి పోటీ ఎక్కువ ఉండడంతో ఆయనకు మంత్రివర్గంలో చోటుదక్కలేదు. 
  • వైశ్యుల కోటాలో తప్పక తనకు వస్తుందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అంచనా వేసినా కల సాకారం కాలేదు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని