logo

అభిమాన చంద్రమా.. అనురాగ సంద్రమా

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. గన్నవరం సమీపంలో కేసరపల్లి ఐటీపార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 13 Jun 2024 04:19 IST

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే బృందం: చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. గన్నవరం సమీపంలో కేసరపల్లి ఐటీపార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నడ్డా, నితిన్‌గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పూర్వ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్, మెగాస్టార్‌ చిరంజీవి తదితర హేమాహేమీలు హాజరైన కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించేందుకు కూటమి శ్రేణులు ఉత్సాహాన్ని చూపాయి. బస్సులు, వ్యక్తిగత వాహనాలు వేసుకుని తరలివచ్చారు. 

ఎనిమిది గంటలకే కిటకిట... సభా ప్రాంగణం 11.80 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అక్కడికి సుమారు లక్ష మందికిపైగా చేరుకున్నట్లు అంచనా. ఉదయం 8 గంటలకే సభా ప్రాంగణం నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. తెలంగాణ నుంచి తెదేపా అభిమానులు తరలి వచ్చారు. మరోవైపు జనసేన అభిమానులు కూడా భారీగా వచ్చారు. తమ అభిమాన హీరోలు వస్తున్నారనే సమాచారంతో చిరంజీవి, రజనీకాంత్‌ అభిమానులు వేలాదిగా పోటెత్తారు. ప్రమాణ స్వీకారం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.  ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పలు నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు తరలివచ్చారు. ద్విచక్ర వాహనాలతో జెండాలు చేతబూనిన తెదేపా, జనసేన కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. భారీ జెండాలతో హాజరయ్యారు. తమ నేతలకు ఆహ్వానం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

ప్రత్యక్ష ప్రసార వీక్షణ... విజయవాడ నగరంలో ఏజీఎం స్టేడియం బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరలపై ప్రమాణ స్వీకారాన్ని ప్రజలు భారీగా వీక్షించారు. కార్యకర్తలకు మంచినీటి సౌకర్యం, మజ్జిగప్యాకెట్లు, ఆహార పొట్లాలను ఏర్పాటు చేశారు. 

కళల విందు... ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో  పలు జిల్లాల నుంచి  వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీభాగవతుల వెంకటరామశర్మ బృందం ప్రదర్శించిన ‘మహాగణపతి’ కూచిపూడి నృత్యంతో ఆరంభించారు. ఇదే బృందం అమరావతి గొప్పదనాన్ని వివరిస్తూ ప్రదర్శించిన కూచిపూడి నృత్య గీతాలు ఆకట్టుకున్నాయి. ‘అజరామరమైనది అమరావతి’ నృత్య గీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబును కీర్తిస్తూ ఆలపించిన.. ‘చరితున్నోడు.. గొప్ప విజనున్నోడు’, ‘జయహో అమరావతి’ జాపనద గీతాలు ఉర్రూతలూగించాయి. ‘హీ ఈజ్‌ ఏ లెజెండ్‌’ పాటకు.. సభికులంతా లేచి నిలబడి.. పసుపు కండువాలను తిప్పుతూ ఆనందంతో నృత్యాలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని