logo

సర్వతోముఖాభివృద్ధే ప్రధాన ధ్యేయం: ఎంపీ

మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు.

Published : 14 Jun 2024 03:26 IST

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అత్యధిక శాతం ప్రాంతాల్లో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాలను సురక్షిత తాగునీరుగా ప్రజలకు చేరువచేస్తామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కూటమి అధినాయకులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో చర్చించినట్టు వివరించారు. కొల్లు రవీంద్రకు మంత్రి పదవి దక్కడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. ఎంపీగా పార్లమెంట్‌గా నిధులు, శాసనసభ్యుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పార్లమెంట్‌ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధి, మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ ఏర్పాటు వంటి పనుల పురోగతికి తగు చొరవ తీసుకుంటానని బాలశౌరి చెప్పారు. జిల్లా కేంద్ర ప్రాధాన్యత, పోరు ఏర్పాటు తదితరాలను దృష్టిలో ఉంచుకుని సీఎస్‌ఆర్, ప్రత్యేక  నిధులతో ఆర్‌అండ్‌బీ అతిధిగృహాన్ని సకల సౌకర్యాలతో  అభివృద్ధి పర్చాలన్న ఆకాంక్షను  వెలిబుచ్చారు.

కక్షపూరిత చర్యలు వద్దు : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా ప్రస్తుత ఎన్నికల్లో వైకాపాను నామరూపాలు లేకుండా చేయాలన్న కసితో ప్రజలు కూటమి అభ్యర్థులకు అఖండ మెజార్టీలతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన విషయం మర్చిపోకూడదని బాలశౌరి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కక్షపూరిత చర్యలు, దాడులకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. తాను ముందు నుంచి చెప్పిన విధంగానే మచిలీపట్నం అసెంబ్లీ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే మితిమీరిన అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులకు వ్యతిరేకంగా తనకు మంచి మెజార్టీ ఇచ్చారన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 వేల అత్యధిక మెజార్టీ పెనమలూరులో వచ్చినా అక్కడ 2.40 లక్షల మంది ఓటు చేశారన్నారు. మచిలీపట్నం అసెంబ్లీ పరిధిలో 1.60 లక్షల మంది  ఓటు హక్కు వినియోగించుకున్నా 52 వేలే మెజార్టీ ఇచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలిసి అభినందనలు తెలియచేయడంతో పాటు వివిధ సమస్యలను బాలశౌరి దృష్టికి తీసుకెళ్లారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని