logo

రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ మూసివేత

విజయవాడ-విశాఖ రైలు మార్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత కీలక రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన నూజివీడు(హనుమాన్‌జంక్షన్‌) స్టేషన్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌ మూసివేశారు.

Published : 14 Jun 2024 03:36 IST

నూజివీడు స్టేషన్‌లో సేవలు బంద్‌

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : విజయవాడ-విశాఖ రైలు మార్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత కీలక రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన నూజివీడు(హనుమాన్‌జంక్షన్‌) స్టేషన్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌ మూసివేశారు. గతేడాది అక్టోబరులోనే ఈ దిశగా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సమర్పించగా.. రైల్వే శాఖ ఆమోదంతో శుక్రవారం (నేటి) నుంచి మూసివేతను ఖరారు చేస్తూ రైల్వే వర్గాలు సూచిక ఏర్పాటు చేయడం గమనార్హం. వందల మంది ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఈ రిజర్వేషన్‌ కౌంటర్‌ను.. ప్రజాభిప్రాయంతో పని లేకుండా, ఖర్చు తగ్గించుకునే క్రమంలో మూసివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్‌ హయాంలో నిర్మితమైన ఈ స్టేషన్‌.. వాస్తవంగా హనుమాన్‌జంక్షన్‌ పరిధిలో ఉన్నప్పటికీ అప్పట్లో తాలుకా వ్యవస్థల్ని ప్రాతిపదికగా తీసుకుని, నూజివీడు తాలుకాలో ఉన్న ఈ రైల్వేస్టేషన్‌కు నూజివీడు స్టేషన్‌గా నామకరణం చేశారు. భౌగోళికంగా చూస్తే.. నూజివీడుకు 25 కి.మీ దూరంలో ఉంది. ఈ స్టేషన్‌ పేరు మార్చాలని, మరిన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టు  కల్పించాలని స్థానికులు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా.. రైల్వేశాఖ స్పందించలేదు. పైగా రిజర్వేషన్‌ కౌంటర్‌ని మూసివేయడంపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది ప్రయాణికులు చరవాణి, ఆన్‌లైన్‌ కేంద్రాల నుంచి టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్నందున, పెద్దగా ఆదరణ లేదంటూ దశల వారీగా స్టేషన్లలో కౌంటర్లను రైల్వేశాఖ మూసివేస్తూ వస్తోంది. 

రాకపోకలు అధికం  : చుట్టుపక్కల భారీగా పరిశ్రమలు ఉండడం, నూజివీడు ట్రిపుల్‌ ఐటీతో పాటు విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాలకు రోజూ వందల మంది రాకపోకలు సాగిస్తుంటారు. వీరితో పాటు దూర ప్రాంతాలకు వెళ్లేవారు రిజర్వేషన్‌ కౌంటర్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకుంటారు. తత్కాల్‌ టిక్కెట్లకు రోజూ బారులు తీరుతుంటారు. అధికారుల చర్యలతో ఇకపై ఏలూరు, విజయవాడ, గుడివాడ వెళితే తప్ప రిజర్వేషన్‌ టిక్కెట్లు, తత్కాల్‌ టిక్కెట్లు లభించని పరిస్థితి. నిరక్షరాస్యులు, వృద్ధులకు ఇది తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. రిజర్వేషన్‌ కౌంటర్‌ను ఎక్కడో 25 కి.మీ దూరంలో ఉన్న నూజివీడు తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేశామని అధికారులు చెబుతుండటం గమనార్హం. అక్కడి కౌంటరు కేవలం నూజివీడు పట్టణ ప్రజలకు మాత్రమే ఉపయుక్తంగా ఉంటుంది, కానీ రైల్వేస్టేషన్‌ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వపరంగా ఎలాంటి రిజర్వేషన్‌ కౌంటరు లేకుండా పోతుందన్న విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి కౌంటర్‌ యథాతథంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని