logo

భలే మంచి రోజు!

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. సమాజంలోని వివిధ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ఐదు అంశాలపై కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Updated : 14 Jun 2024 04:55 IST

5 సంతకాలతో ఉమ్మడి జిల్లాకు భారీగా లబ్ధి
ఈనాడు, అమరావతి

నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు చిగురించిన రోజు...
రైతులతోపాటు ఆస్తులున్నవారికి భరోసా ఇచ్చిన రోజు...
వృద్ధులు, వితంతు, దివ్యాంగుల జీవితాలు మురిసిన రోజు...
యువత నైపుణ్యానికి పదునుపెట్టి.. భవితకు బాటలేసిన రోజు...
నిరుపేదలు, సామాన్యుల ఆకలిమంటలను చల్లార్చిన రోజు...

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. సమాజంలోని వివిధ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ఐదు అంశాలపై కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులు, పేదలు, సామాన్యులు, రైతులు, యువత ఆకాంక్షలను నెరవేర్చే క్రతువులో భాగంగా సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేశారు. తద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపారు. ఆ ఐదు అంశాల ఆధారంగా ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనం కలగనుందో పరిశీలిద్దాం..

అన్నం పెట్టే కేంద్రాలు తెరుచుకోనున్నాయ్‌..

మ్మడి కృష్ణా జిల్లాలో ఐదేళ్ల కిందటి వరకూ 18 అన్న క్యాంటీన్లు ఉండేవి. కేవలం రూ. 5 చెల్లిస్తే చాలు కడుపు నిండా ఆహారం దొరికేది. మూడు పూటలకు కలిపి రూ. 15తో భోజనం చేసేవారు. ఈ క్యాంటీన్లను జగన్‌ ప్రభుత్వం కక్ష పూరితంగా మూసేసి.. నిరుపేదల కడుపుమీద కొట్టింది. ఇన్నాళ్లకు మళ్లీ అన్న క్యాంటీన్లు తెరుచుకోబోతున్నాయి. ఈ దస్త్రంపై చంద్రబాబు నాలుగో సంతకం చేశారు. విజయవాడ నగరంలో 11 ప్రాంతాల్లో, గుడివాడలో రెండు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, ఉయ్యూరు, మచిలీపట్నంలో ఒక్కోటి ఉండేవి. నిత్యం వేలాదిమంది ఆకలి తీర్చేవి. ప్రస్తుతం వీటితో పాటు కొత్తగా మరికొన్ని ప్రారంభించనున్నారు.


వెయ్యికి పైగానే ఉపాధ్యాయ ఖాళీలు..

మ్మడి కృష్ణా జిల్లాలో వెయ్యికిపైగానే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలున్నాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఖాళీల భర్తీకి 2023లో నాటి వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో కేవలం 180 ఖాళీలనే చూపించింది. వాస్తవంగా ఖాళీలెన్నో ప్రస్తుతం విద్యాశాఖ లెక్కలేస్తోంది. నిబంధనల ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది పిల్లలుంటే ఒకరు, 60 వరకు పిల్లలుంటే రెండో ఉపాధ్యాయుడు, 90 మంది విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి. ఈ ప్రకారం చూస్తే 300 వరకు ఖాళీలున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 2,636 పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1,709, ప్రాథమికోన్నత 396, ఉన్నతపాఠశాలలు 531 ఉన్నాయి. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు 40 వేలమందికిపైగానే ఉన్నారు. 


4.81 లక్షల పింఛనుదారులకు లబ్ధి..

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఉన్న సామాజిక పింఛనుదారుల సంఖ్య 4.81 లక్షలు. వీరికి నెలకు రూ. 3 వేల చొప్పున రూ. 142.98 కోట్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా పింఛను మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతూ చంద్రబాబునాయుడు రెండో సంతకం చేయడంతో రూ. 48.12 కోట్ల వరకు అదనంగా లబ్ధి కలగబోతోంది. ఏప్రిల్‌ నుంచే ఈ పింఛను అమలు చేస్తామని చంద్రబాబు చెప్పడంతో గత మూడు నెలలకు సంబంధించి అరియర్స్‌ రూ. 3 వేలు, జులైలో ఇచ్చే రూ. 4 వేలు కలిపి రూ. 7 వేలను లబ్ధిదారులు అందుకోబోతున్నారు. అంటే వచ్చే నెలలో 4.81 లక్షలమంది లబ్ధిదారులకు రూ. 7 వేల చొప్పున రూ. 336.70 కోట్ల లబ్ధి కలుగుతుంది. గతంలో జగన్‌ గద్దెనెక్కక ముందు చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 వేల వరకు పింఛను ఇచ్చేది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏటా రూ. 250 చొప్పున ఐదేళ్లకు రూ. వెయ్యి మాత్రమే పెంచారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఒకేసారి రూ. వెయ్యి పెంచడంతో పింఛనుదారుల కళ్లల్లో ఆనందం కనబడుతోంది. 


ప్రజల ఆస్తులకు భద్రత

పీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తూ చంద్రబాబు మూడో సంతకం పెట్టడంతో.. తమ భూములకు పెనుముప్పు తప్పిపోయిందని రెండు జిల్లాల్లోని నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. తమ పట్టాదారు పాసు పుస్తకాలు గతంలో మాదిరే ప్రభుత్వ అధికారిక చిహ్నంతో వస్తాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సహా పట్టణ ప్రాంతాల్లో స్థలాలున్న వారి గుండెల్లోని బాధ తొలగిపోయింది. 


నైపుణ్య గణనతో యువతకు మేలు..

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఏటా కనీసం లక్ష మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ సహా పలు వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసి బయటకొస్తున్నారు. వీరిలో కొంతమందికే కొలువులు దొరుకుతున్నాయి. మిగిలినవారు ఉపాధి కోసం ఇతర నగరాల బాట పడుతున్నారు. నైపుణ్య గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇలాంటి వారందరికీ లబ్ధి చేకూరబోతోంది. విద్యార్థుల్లో ఎలాంటి నైపుణ్యం ఉంది? వారికి ఏం కావాలనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగా తర్ఫీదును ప్రభుత్వమే ఇవ్వబోతోంది. దీంతో వారిలో నైపుణ్యాభివృద్ధి జరిగి.. ఉపాధి అవకాశాలను అందుకునేందుకు మార్గం సుగమం కాబోతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని