logo

ప్రగతి సారథీ సాహో.. అమరావతీ జయహో...

నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వెళుతున్న చంద్రబాబుకు అన్నదాతలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు.

Updated : 14 Jun 2024 06:50 IST

అభిమాన నేతకు దారి పొడవునా పుష్పాభిషేకం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు: నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వెళుతున్న చంద్రబాబుకు అన్నదాతలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. అమరావతి రూపకర్తగా తమ గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తున్న తమ అభిమాన నేత తమ కళ్లెదుటకు రాగానే రాజధాని రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురొచ్చి రెండు చేతులు జోడించి ప్రజలు ప్రణమిల్లారు. మహిళా రైతులు ఎదురేగి హారతులు ఇచ్చి దిష్టి తీసి స్వాగతం పలికారు.

రైతుల ఆత్మీయ స్వాగతానికి చంద్రబాబు ముగ్ధుడై వారికి   ముకుళిత హస్తాలతో అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. చంద్రబాబు మందడం గ్రామం మీదుగా వెళ్లే సమయంలో.. రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ కార్యక్రమం చేపట్టిన రథంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద నుంచి రాజధాని సీడ్‌యాక్సెస్‌ మీదుగా వెలగపూడిలోని సచివాలయం వరకు ఎటు చూసినా రహదారులను రంగు రంగుల పువ్వులతో నింపేసి పూలబాట పరిచారు. విజనరీ డైనమిక్‌ లీడర్‌ అంటూ అభినందిస్తూ వాహనాల్లో తీసుకొచ్చిన టన్నుల కొద్దీ పూలను అధినాయకుడి ముందు విరజిమ్ముతూ ఘన స్వాగతం పలికారు.  దివ్యాంగులు సైతం ఊతకర్రల సాయంతో నిలుచొని స్వాగతం పలికారు. ‘సకల దేవతల రాజధాని అమరావతి.. రాష్ట్ర సంపద కేంద్రం అమరావతి.. జయహో అమరావతి..’ అంటూ రైతులు, మహిళలు నినాదాలతో హోరెత్తించారు. 

ఇక శరవేగంగా అమరావతి నిర్మాణం

-పువ్వాడ సుధాకర్, అమరావతి సమన్వయ కమిటీ సభ్యుడు, తుళ్లూరు

అమరావతి రూపకర్త చంద్రబాబు సారథ్యంలో రాజధాని నిరాటంకంగా పూర్తవుతుంది. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి రాజధానిని శరవేగంగా నిర్మిస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగు వారి ఆత్మ గౌరవం నిలిచేలా అమరావతి విశ్వనగరంగా ఎదగాలి.


బహుజనుల జీవితాల్లో వెలుగు

-మేళం భాగ్యారావు, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కన్వీనర్, అమరావతి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో దళితుల జీవితాల్లో వెలుగు వస్తుందని ఆశిస్తున్నా. వైకాపా ఐదేళ్ల అరాచక పాలనలో దళితులు అన్ని విధాలా చితికిపోయారు. చంద్రన్న పాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమంతో పాటు రక్షణ కూడా ఉంటుంది.


రైతు ఉద్యమం వైకాపాను గద్దె దించింది

-కట్టా రాజేంద్రప్రసాద్, మందడం రైతుల సంక్షేమ సంఘం

అమరావతిని కాపాడుకోవటానికి రాజధాని రైతులు చేసిన ఉద్యమం వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అన్నదాతలు చేపట్టిన మహాపాదయాత్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. ప్రజలు అమరావతికి మద్దతు తెలిపి ఎన్డీయే ప్రభుత్వానికి పట్టం కట్టారు.


పరదాలు పోయి.. ప్రజా నాయకుడు వచ్చాడు

- వి.వెంకాయమ్మ, రాజధాని మహిళా రైతు, మందడం

ప్రజల్లోకి పరదాలు కట్టుకొని వచ్చే వైకాపా అధినేత జగన్‌ ప్రభుత్వం పతనమైంది.  ప్రజా నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. న్యాయం గెలిచింది. అన్యాయం పతనమైపోయింది. మాకు చాలా ఆనందంగా ఉంది. రాజధాని ఇక నిరాటంకంగా పూర్తవుతుంది. అమరావతి కలకాలం నిలిచిపోతుంది.


చంద్రబాబును రాజధాని దైవంగా కొలుస్తాం

-బత్తుల గంగా భవానీ, రాజధాని మహిళా రైతు, మందడం  

ఐదు కోట్ల కలల రాజధాని అమరావతిని సాకారం చేస్తున్న అమరావతి రూపకర్త చంద్రబాబును రాజధాని దైవంగా కొలుస్తాం. రాజధానిలోకి ఆయన రాకతో పూలబాట పరిచి బ్రహ్మరథం పడుతున్నాం. అమరావతిని సంపద కేంద్రంగా మలచి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని