logo

ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారు కూడా రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి నడుస్తుండడంతో..

Published : 17 Jun 2024 03:44 IST

మోదీ సర్కారు తెదేపా, జనసేనపై ఆధారపడింది
రాజ్యసభలో వైకాపా ఎంపీలు తీర్మానం చేయాలి
విజయవాడ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

ఈనాడు డిజిటల్, అమరావతి : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారు కూడా రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి నడుస్తుండడంతో.. హోదా, విభజన హామీలను సాధించుకునేందుకు ఇదే సరైన సమయమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు, సాధన సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. తెదేపా, జనసేన పార్టీలు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా మారాయని, వైకాపా ఎంపీలు రాజ్యసభలో అధికంగా ఉన్నారని.. వీరంతా కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ‘కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగడానికి ఇదే మంచి సమయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని.. విభజన హామీల సాధన కోసం రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి. గత ముఖ్యమంత్రి జగన్‌ తనకు 36 మంది ఎంపీలున్నా, తన కేసుల విషయంలో ప్రధాని మోదీకి భయపడి.. రాష్ట్రానికి అన్యాయం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలోనూ కనీసం ఓ వినతిపత్రం కూడా జగన్‌ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సరైన సమయం వచ్చింది. విశాఖ రైల్వేజోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయించాలి. కనీసం ఇప్పటికైనా మన ఎంపీలు ధైర్యంగా పార్లమెంట్‌లో మాట్లాడి మనకు న్యాయంగా రావాల్సిన వాటిని సాధించాలి.’ అని రామకృష్ణ అన్నారు.
్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదని, ఇది సజీవ సమస్య అని గుర్తించాలన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి రాష్ట్ర సమస్యలను తెలియజేస్తామన్నారు. వైకాపా ఎంపీలు రాజ్యసభలో హోదాపై తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చాలంటే కచ్చితంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించాలన్నారు. అప్పుడే రాష్ట్రానికి అధికంగా నిధులు వస్తాయన్నారు. హోదా వల్ల పరిశ్రమలు, యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని సైతం వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని