logo

కోడ్‌ ముగిసినా మా గోడు పట్టదా..!

పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించే ప్రక్రియ జిల్లాలో పూర్తిస్థాయి అమలుకు నోచుకోలేదు.

Updated : 17 Jun 2024 04:50 IST

పూర్తి అమలుకు నోచుకోని జీవో 11
ఆవేదన చెందుతున్న గ్రేడ్‌-5 కార్యదర్శులు
కలెక్టర్‌ గారూ పట్టించుకోండి
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించే ప్రక్రియ జిల్లాలో పూర్తిస్థాయి అమలుకు నోచుకోలేదు. ఎన్నికల కోడ్‌ సాకుతో అర్థంతరంగా ఆపేసిన అధికారులు కోడ్‌ ముగిసినా పట్టనట్టు వ్యవహరించడంతో దాదాపు 400 మందికి పైగా గ్రేడ్‌-5 కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. మరో పక్క పూర్తి స్థాయిలో నియామకాలు చేయకపోవడం వల్ల ఇన్‌ఛార్జి కార్యదర్శుల పాలనలో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. 

ఉమ్మడి జిల్లాలో దాదాపు 980కు పైగా గ్రామ పంచాయతీలు ఉండగా వాటికి సరిపడా కార్యదర్శులు లేరు. పంచాయతీల స్థాయిని బట్టి గ్రేడ్‌-1 నుంచి గ్రేడ్‌-4 హోదా ఉన్న వారినే కార్యదర్శులుగా నియమించాల్సి ఉంది. జిల్లాలో అర్హులైన కార్యదర్శులు 300 మంది వరకే ఉండడంతో ఒక్కో కార్యదర్శి మూడు నుంచి ఐదు గ్రామ పంచాయతీలకు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలకు అవసరమైన సమయంలో వారు అందుబాటులో ఉండక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు పరిపాటి అయ్యేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో సచివాలయాల్లో దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ఎటువంటి అధికారాలు లేక ఖాళీగా ఉంటున్న గ్రేడ్‌-5 కార్యదర్శులను పంచాయతీ  కార్యదర్శులుగా తక్షణం నియమించాలంటూ గడచిన మార్చిలో ప్రభుత్వం జీవోనెం.11 విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో జీవోను అమలు చేసినా కృష్ణాలో స్పందించకపోవడాన్ని ఎత్తిచూపుతూ ‘జీవో అమలుకూ చేయి తడపాల్సిందేనా..’ అన్న శీర్షికన ‘ఈనాడు’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. అర్హులైన గ్రేడ్‌- కార్యదర్శులు జిల్లాలో దాదాపు 600 మంది వరకూ ఉండగా కేవలం 120 మందినే పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మిగిలిన వారు బూత్‌స్థాయి అధికారుల బాధ్యతల్లో ఉన్నారన్న కారణం చెబుతూ వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఎన్నికల నిబంధన తమకు వర్తించదని, తమకు ఆర్డర్స్‌ ఇస్తే ఎన్నికల విధులు పూర్తయ్యాకే విధుల్లో చేరతామంటూ సంఘ నాయకులు చేసిన విన్నపాలను అధికారులు పట్టించుకోలేదు.


పేరుకుపోతున్న బకాయిలు

ఎన్నికల ముందు 120 మందికి కార్యదర్శులుగా ఆదేశాలిచ్చినా ఇన్‌ఛార్జి బాధ్యతలు వదులుకోవడానికి సిద్ధంగా లేని కొందరు కార్యదర్శులు వారికి నేటికీ బాధ్యతలు అప్పగించలేదు. మరోపక్క ఎన్నికల కోడ్‌ ముగిసి వారం గడుస్తున్నా మిగిలిన గ్రేడ్‌-5 కార్యదర్శులకు ఉ్తతర్వులు ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగా సీనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తమను రానీయకుండా అడ్డుకునేందుకు పైరవీలు చేస్తున్నారంటూ గ్రేడ్‌-5 కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో జీవోను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల క్యాడర్‌ స్ట్రెంత్‌ వివరాలు అందక రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు నియమితులైన కార్యదర్శులకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి తగు చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు