logo

దాత.. యాచకుడు యాదిరెడ్డి మృతి

యాచక వృత్తి చేసుకుంటూ.. లక్షలాది రూపాయిలను దేవాలయాలకు విరాళంగా ఇచ్చిన ముత్యాలంపాడుకు చెందిన యడ్ల యాదిరెడ్డి(85) ఆదివారం రాత్రి మృతిచెందారు.

Published : 17 Jun 2024 03:55 IST

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : యాచక వృత్తి చేసుకుంటూ.. లక్షలాది రూపాయిలను దేవాలయాలకు విరాళంగా ఇచ్చిన ముత్యాలంపాడుకు చెందిన యడ్ల యాదిరెడ్డి(85) ఆదివారం రాత్రి మృతిచెందారు. ముత్యాలంపాడులోని శిర్డీ సాయిబాబా మందిరం వద్ద దశాబ్దానికి పైగా యాచక వృత్తి చేస్తున్నారు. ఇలా యాచించిన నగదును.. శిర్డీ సాయిబాబా మందిరం, కోదండ రామాలయం, ఈశ్వరమ్మ ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు రూ.15 లక్షలు విరాళాల రూపంలో అందజేశారు. ఇందులో రూ.9 లక్షలు బాబా మందిరానికి ఇచ్చారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. బాబా మందిర గౌరవాధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి స్పందించి, సత్యనారాయణపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఈ నెల 14న డిశ్ఛార్జి చేశారు. యాదిరెడ్డికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో.. బాబా మందిరం నిర్వాహకులే సోమవారం (నేడు) అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని సత్యనారాయణపురంలోని అంతిమయాత్ర భవనంలో ఉంచారు. యాదిరెడ్డి మృతికి గౌతమ్‌రెడ్డితోపాటు ఆలయ కమిటీ సభ్యులు, కోదండ రామాలయ కమిటీ సభ్యులు సంతాపం తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని