logo

సుమధుర స్వరం.. అక్కాచెల్లెళ్ల గానం

వారిద్దరూ సోదరీమణులు. ఒకరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా.. ఒకరు బీటెక్‌ చదువుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుతో పాటు శాస్త్రీయ సంగీతం, కళలు, తదితర రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై సత్తాచాటుతున్నారు.

Updated : 17 Jun 2024 04:47 IST

ఈనాడు డిజిటల్, అమరావతి 

వారిద్దరూ సోదరీమణులు. ఒకరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా.. ఒకరు బీటెక్‌ చదువుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుతో పాటు శాస్త్రీయ సంగీతం, కళలు, తదితర రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా తమ సుమధుర స్వరంతో గీతాలు శ్రావ్యంగా ఆలపిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు. వారే రుగ్వేదం పద్మశ్రీ, కృష్ణశ్రీలు. 

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరుకు చెందిన రుగ్వేదం పద్మశ్రీ, కృష్ణశ్రీలు అక్కాచెల్లెళ్లు కాగా.. తండ్రి హరివెంకట కిషోర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా.. తల్లి కల్యాణి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి తెలుగు భాష, సంప్రదాయాలు, కళలపై ఉన్న మక్కువతో పిల్లల్లో ప్రతిభ గుర్తించి సంస్కృత పాఠాలు, పద్యాలు, వేదాలు నేర్పించారు. బడిలో అడుగుపెట్టక ముందే సమతి, వేమన, కృష్ణ శతకాలు నేర్పించారు. ఎక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత విభావరి ఉన్నా వారిని తీసుకువెళ్లి ప్రదర్శనలు చేయించేవారు. పదేళ్లకే ఈ సోదరీమణులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. శాస్త్రీయ, అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలు, సినీ గీతాలు చక్కగా అలపిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు. చిన్నతనంలోనే ఓ ప్రభుత్వ కార్యక్రమంలో వీరి ప్రదర్శనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు సంగీత దర్శకులు తిలకించి అభినందించారు. 2018లో సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ పాటల పోటీల్లో సత్తాచాటి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. 2019లో కళాదర్శిని నిర్వహించిన రాష్ట్ర స్థాయి గీతాల పోటీల్లో ద్వితీయ, శాస్త్రీయ సంగీతంలో ప్రథమ స్థానంలో నిలిచారు. 


హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో పద్మశ్రీకి చోటు 

ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో 116 మంది ప్రసిద్ధ తెలుగు గాయినీ మణులు పాడిన పాటలను 4 గంటల 40 నిమిషాల్లో ఏకధాటిగా ఆలపించిన పద్మశ్రీ.. హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, ఛాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పి 20 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందింది. 2023లో మ్యూజిక్‌ అండ్‌ ఆర్ట్‌ విభాగంలో అమెరికన్‌ మెరిట్‌ కౌన్సిల్‌ పద్మశ్రీని ధ్రువపత్రంతో సత్కరించింది. 


శాస్త్రీయ సంగీతం,  కళలపై ఉచిత శిక్షణ

కూచిపూడి, భరత నాట్యం, చిత్రలేఖనంలోనూ రాణిస్తున్నారు. ప్రకృతిని ప్రేమించాలని, వన్యప్రాణులను రక్షించాలనే సందేశంతో వీరు గీసిన చిత్రాలు ప్రశంసలందుకున్నాయి. సైకిల్‌ పోలో, హాకీ వంటి క్రీడల్లోనూ వీరు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సత్తాచాటుతున్నారు. ప్రస్తుతం వీరు కత్తి సాము నేర్చుకుంటున్నారు. తాము నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం, కళలపై మెలకువలను యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పలువురికి ఉచితంగా నేర్పిస్తున్నారు. అక్కడ పద్మశ్రీ బీటెక్‌ పూర్తి చేసి ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. చెల్లి కృష్ణశ్రీ బీటెక్‌లో చేరింది. చదువుతో పాటు సంగీతం, సంస్కృతి సంప్రదాయాలను రక్షించడమే తమ ధ్యేయమని వీరు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని