logo

ఒత్తిడికి ఓడిపోతున్నారు!

ప్రేమ విఫలమైందనో... కుటుంబ సమస్యలనో...ఆర్థిక ఇబ్బందులనో.. పరీక్షల్లో తప్పామనో... ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి.

Updated : 17 Jun 2024 05:06 IST

ఆందోళనకర స్థాయిలో ఆత్మహత్యలు
విజయవాడలోనే అత్యధిక ఘటనలు
ఈనాడు - అమరావతి

కోట్ల రూపాయలు వెచ్చించినా ఆసుపత్రి వినియోగంలోకి రాకపోవడం.. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో విజయవాడకు చెందిన ఎముకల వైద్య నిపుణుడు శ్రీనివాస్‌ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారు. ప్రాణాలు నిలపాల్సిన వృత్తిలో ఉండీ.. కన్నతల్లిని, కట్టుకున్న భార్యను, కుమారుడు, కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నారు. 


నెలసరి వాయిదా కట్టాల్సిన డబ్బును వాడుకున్నందుకు తండ్రి మందలించారని... నగరంలోని క్రీస్తురాజపురానికి చెందిన జీవన్‌ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ‘నాకు ఇదే చివరి రోజు కావచ్చు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 


తమ కుటుంబానికి వారసుడు కావాలంటూ భర్త, అత్తింటివారి వేధింపులు తాళలేక యనమలకుదురులో తన పుట్టింట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది అయిదు నెలల గర్భిణి. తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండోసారి ఐదు నెలల గర్భిణీగా ఉన్న ఆమెకు అత్తింటివారు స్కానింగ్‌ తీయించడంతో మళ్లీ ఆడపిల్ల అని తేలింది. గర్భస్రావం చేయించుకోవాలన్న ఒత్తిడిని తట్టుకోలేక ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. 

ప్రేమ విఫలమైందనో... కుటుంబ సమస్యలనో...ఆర్థిక ఇబ్బందులనో.. పరీక్షల్లో తప్పామనో... ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. జీవితంలో ముందుకెళ్లే దారి కనబడక.. తోడుగా నిలిచేవారు లేక.. ఎంతో విలువైన జీవితానికి విషాదకర ముగింపు పలుకుతున్నారు. కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉందన్న విషయాన్ని గుర్తించలేక.. ఒత్తిడి కూపంలోంచి బయటపడలేక.. కుంగుబాటుకు లోనై జీవితాలను చాలిస్తున్నారు. 

యుక్త వయస్కులే ఎక్కువ

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రోజుకు సగటున ఐదుగురు వివిధ కారణాలతో బలవన్మరణం చెందుతున్నారు. పోలీస్‌స్టేషన్లలో కొన్ని కేసులే నమోదవుతున్నాయి. రికార్డులకు ఎక్కనివి ఇంతకు రెండింతలు ఉంటున్నాయి. ఎక్కువ కేసుల్లో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. యువతలో జీవితం, సమస్యలను ఎదుర్కొనడంలో సరైన దృక్పథం లేక ఒత్తిడిని జయించలేకపోతున్నారు. సరైన నిర్ణయం తీసుకోలేక.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 

బలవంతంగా తనువు చాలిస్తున్నవారిలో 15 నుంచి 24 ఏళ్లలోపువారు 35 శాతంమంది ఉంటున్నట్టు అంచనా. 60 ఏళ్ల పైబడినవారిలో కూడా ఈ ధోరణి ఎక్కువగా ఉంటోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రేమ విఫలం కావడం, పరీక్షల్లో ఆశించిన ర్యాంకు రాలేదని, పరీక్షల్లో తప్పామని, చదువుల్లో వెనుకబడ్డామని.. ఇలాంటి కారణాలతోనే యువత తొందరపాటునిర్ణయం తీసుకుంటోంది. 

దేశంలోనే మొదటి స్థానం..

ఆత్మహత్యల విషయంలో దేశంలోనే విజయవాడ నగరం రికార్డు సృష్టిస్తోంది. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం.. 2022లో జనాభాతో పోలిస్తే ఆత్మహత్యల్లో 42.6 శాతంతో బెజవాడ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇది ఆందోళనకర పరిణామం.

నగరంలో 2022లో 634 ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021తో పోలిస్తే 64.7 శాతం పెరగడం గమనార్హం. ఈ కేసుల్లో ఎక్కువమంది అనారోగ్యం బారిన పడి, చావే శరణ్యమంటూ తనువు చాలించినవారే. తర్వాత స్థానంలో కుటుంబ సమస్యల కారణంగా ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్న కేసులు ఉన్నాయి. 


లక్షణాలు ముందే గుర్తిస్తే ఆపొచ్చు

- డా. మానస, సైకియాట్రిస్ట్, విజయవాడ

సమస్యలు ఎదురైనప్పుడు వ్యక్తిలోని క్షణికావేశం ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. ముఖ్యంగా యువతలో జీవితం, సమస్యలపై  సరైన దృక్పథం లేకపోవడమూ కారణమే. యువతలో ప్రేమ విఫలం కావడం, తమ పెళ్లికి ఆమోదం లభించలేదని తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు. వివాహానంతరం వివాహేతర సంబంధాలు కూడా కుటుంబాల్లో గొడవలకు కారణమవుతున్నాయి. వీటి వల్ల మనస్తాపానికి గురై ప్రాణం తీసుకుంటున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆత్మస్తైర్యం దెబ్బతిని విశ్లేషణ శక్తి కొరవడుతుంది. స్నేహితులు, పెద్దల నుంచి సరైన సలహాలు తీసుకోలేకపోవడం కూడా కారణమవుతోంది. ఒంటరిగా ఉండడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేకపోవడం, రాత్రి సమయాలలో ఆలోచనలో ఉండడం వంటి లక్షణాలు ఉన్న వారిని ప్రారంభంలోనే గుర్తించాలి. వారితో మంచిగా మాట్లాడితే సమస్య తెలుస్తుంది. వాటి పరిష్కారానికి మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని