logo

నారు పోయాలి.. నీరేదీ?

కృష్ణా డెల్టా కాలువలకు గతేడాది జూన్‌ మొదటివారంలోనే నీరు విడుదల చేశారు. ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నారు పోసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప పొలాలకు సాగు నీరందే పరిస్థితి లేదు.

Updated : 17 Jun 2024 04:47 IST

అడుగంటిన పులిచింతల, ప్రకాశం బ్యారేజీ
ఈనాడు - అమరావతి

కృష్ణా డెల్టా కాలువలకు గతేడాది జూన్‌ మొదటివారంలోనే నీరు విడుదల చేశారు. ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నారు పోసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప పొలాలకు సాగు నీరందే పరిస్థితి లేదు. తాగునీటికి సైతం జనం కటకటలాడాల్సి వచ్చింది. విజయవాడ నగరానికి సైతం తాగునీటిని అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటీపీఎస్‌ జలాశయానికి అవసరమయ్యే నీటినే అందించలేని అవస్థ. ఎగువన ఉన్న జలాశయాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ముందుచూపు లేకుండా గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దిగువ భాగాన వర్షాలు పడినా ప్రయోజనం లేకుండాపోయింది. ఎగువన వర్షాలు కురిస్తేనే పులిచింతల జలాశయానికి, ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది. 

సాగు ఎలా..?

కృష్ణా డెల్టా పరిధిలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. గతేడాది జూన్‌లోనే నారుమడుల కోసం అధికారులు నీటిని విడుదల చేశారు. అప్పట్లో ఎక్కువమంది రైతులు వెదజల్లే పద్ధతిలో విత్తనాలు చల్లగా జులైలో వర్షాలు ముంచెత్తాయి. డెల్టా పరిధిలో లక్ష ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లింది. నాడు వర్షపాతం తక్కువగానే నమోదైనా.. మురుగు కాలువల మరమ్మతుల్లో నిర్లక్ష్యం కారణంగా పెడన, అవనిగడ్డ, బందరు నియోజకవర్గాల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఎకరానికి దాదాపుగా రూ. 10 వేలకుపైగా నష్టపోయారు. తాజా ఖరీఫ్‌లో నారు పోసేందుకు సిద్ధమైనా.. నీరు లేదు. ఇటీవల కాలువలకు కొంతవరకు నీటిని విడుదల చేసినా.. తాగు అవసరాలకు మాత్రమే. నైరుతి రుతుపవనాలపై ఆశలు పెట్టుకున్నా.. ఇంతవరకు జిల్లాలో వాటి జాడ లేదు. ఖరీఫ్‌లో డెల్టా మొత్తానికి దాదాపు 150 టీఎంసీల నీరు అవసరం. ఒక్క కృష్ణా జిల్లాకే దాదాపు 50 టీఎంసీలకుపైగానే కావాలి. ఇప్పటివరకు పులిచింతల జలాశయంలో నీటిచుక్క లేదు. పట్టిసీమ ఎత్తిపోతలే ఆదుకోవాలి. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చినందున పట్టిసీమకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందంగా ఉన్నారు. 

ఈ ఏడాది నిర్వహణ లేనట్లేనా..?

సాగునీటి కాలువల నిర్వహణను నాటి వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ ఏడాది పనులకైతే ప్రతిపాదనలనే సిద్ధం చేయించలేదు. కాలువలు దారుణంగా ఉన్నాయి. వ్యవసాయ పనులు ఊపందుకునే వేళలో పనులను ఓకే చేసి మమ అనిపిస్తారన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది. కనీసం రూ. 100 కోట్లు కేటాయిస్తే.. కాలువలు బాగుపడే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వహయాంలో అయినవారికే పనులను కట్టబెట్టి నిధులను పక్కదారి పట్టించేశారు. కొత్త ప్రభుత్వ హయాంలో ఇలాంటి అపసవ్య విధానాలన్నీ మారతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. 


నగరానికి కలుషిత నీరే

విజయవాడ నగరవాసుల తాగు అవసరాలకు కలుషిత నీరే దిక్కవుతోంది. ఇటీవల అతిసారం విజృంభించి ప్రజల ప్రాణాలను బలిగొన్నా నగరపాలక సంస్థ తీరు మారలేదు. బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీరు లేక.. బురదతో నిండిపోయి.. ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉన్న నీటినే విడుదల చేస్తోంది. వీటీపీఎస్‌ నుంచి పెద్దమొత్తంలో వేడి నీటిని నదిలో వదులుతున్నారు. ఇందులో కర్బన రసాయనాల మూలకాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. మరోవైపు నైట్రేట్‌లు అధిక మోతాదులో ఉన్నాయి. ఈ నీటిని వినియోగించడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తమ పరీక్షల్లో నీరంతా సవ్యంగా ఉన్నట్టు నగర పాలక సంస్థ చెబుతూ.. పరీక్షల నివేదికలను దాచిపెడుతోంది. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన పాలక సభ్యులు, మేయరు కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని