logo

కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఏపీ రైతు సంఘం కమిటీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడ దాసరి భవన్‌లో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.

Published : 18 Jun 2024 03:35 IST

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఏపీ రైతు సంఘం కమిటీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడ దాసరి భవన్‌లో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. కార్డుల విషయమై ఈ నెల 27న తహసీల్దార్ల కార్యాలయాల్లో అర్జీలు సమర్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన పంట సాగుదారుల హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభల్లోనే కౌలు రైతుల గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కౌలుదారుల నుంచి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుని.. పచ్చిరొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90శాతం రాయితీపై అందించాలని కోరారు. పంట రుణాల మంజూరుకు ప్రత్యేక రుణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని, సాగు చేస్తున్న భూమి దామాషాను బట్టి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంచి.. సున్నా వడ్డీకే పంట రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, ఏపీ కౌలు రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు సి.హెచ్‌.కేశవశెట్టి, కౌలు రైతుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు జి.పంపన్‌ గౌడ్, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుడ్డి రమేష్, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని