logo

ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు

విజయవాడ పాయకాపురం, శాంతినగర్‌లో వైకాపా నాయకుడు నందెపు జగదీష్‌ శిరోముండనం చేయించుకుని, అర్ధనగ్న ప్రదర్శనతో సోమవారం హడావుడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది.

Published : 18 Jun 2024 03:39 IST

నోటీసులిచ్చి కూల్చేసిన అధికారులు
కక్షతోనే చేస్తున్నారని వైకాపా నేత గగ్గోలు

ఈనాడు, అమరావతి - మధురానగర్, న్యూస్‌టుడే : విజయవాడ పాయకాపురం, శాంతినగర్‌లో వైకాపా నాయకుడు నందెపు జగదీష్‌ శిరోముండనం చేయించుకుని, అర్ధనగ్న ప్రదర్శనతో సోమవారం హడావుడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. తనకు సంబంధించిన ఓ షెడ్డును అన్యాయంగా నగరపాలక సంస్థ అధికారులు కూల్చేశారంటూ వైకాపా కోఆప్షన్‌ సభ్యుడిగా ఉన్న జగదీష్‌ గగ్గోలు పెట్టారు. శాంతినగర్‌లో ప్రధాన రహదారిని ఆనుకుని నగరపాలక సంస్థకు చెందిన స్థలంలో ఆయన నిర్మించిన షెడ్డును అధికారులు రెండు రోజుల కిందట కూల్చేశారు. కక్షతో.. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచనలతో కూలగొట్టారంటూ జగదీష్‌ రహదారి పైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన.. షెడ్డు కూల్చేసినచోట కూర్చుని గుండు కొట్టించుకుని, అర్ధ నగ్న ప్రదర్శనకు దిగారు. వైకాపా నేతలు హడావుడి చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు అందరినీ పంపించేశారు. నందెపు జగదీష్‌ మరింత ఆగ్రహం వ్యక్తం చేసి.. తనకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తన భార్యకు కూడా శిరోముండనం చేయించి నిరసన చేపడతామంటూ హెచ్చరించడంతో పోలీసులు వారించారు.

నగరపాలక సంస్థ స్థలంలో నిర్మాణం.. : శాంతినగర్‌లోని నూజివీడు ప్రధాన రహదారిని ఆనుకుని నగరపాలక సంస్థకు చెందిన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు పది రోజుల కిందట ఫిర్యాదు అందింది. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల ఆధ్వర్యంలో సర్వేయర్‌ను ఏర్పాటు చేసి కొలతలు చేపట్టారు. 120 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రహదారికి సంబంధించిన 32 గజాల స్థలాన్ని నందెపు జగదీష్‌ ఆక్రమించినట్టు గుర్తించారు. దానిలో 18 గజాల్లో షెడ్డు వేసి, ఓ గ్యాస్‌ కంపెనీకి అద్దెకు ఇచ్చారు. మిగతా స్థలంలోనూ నిర్మాణాలున్నాయి. తొలుత గత శుక్రవారం అతనికి నోటీసులు ఇచ్చారు. శనివారం ఉదయం అధికారులు వచ్చి షెడ్డును కూల్చేశారు. పక్కనే ఉన్న భవనం మెట్లు కూడా ఆక్రమించిన స్థలంలోనే ఉన్నాయంటూ వాటిని కూల్చేందుకు ప్రయత్నించారు. కూల్చొద్దంటూ కోర్టు నుంచి స్టే ఉందంటూ నందెపు జగదీష్‌ చూపించడంతో.. తాత్కాలికంగా నిలిపేశారు. నిబంధనల ప్రకారం నగరపాలక సంస్థ స్థలాన్ని ఆక్రమించడం వల్లే తాము కూల్చివేతలు చేపట్టినట్టు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పేర్కొంటున్నారు.

కేశినేని నాని, వెలంపల్లి పారిపోయారు..: తన షెడ్డుని కూల్చేస్తున్నారంటూ వైకాపా ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి ఫోన్‌ చేస్తే ఆయన ఎత్తడం లేదని, వెలంపల్లి శ్రీనివాస్‌కు చెబితే సెంట్రల్‌ నియోజకవర్గంలో కార్యాలయం మూసేశారంటూ చెబుతున్నారని నందెపు జగదీష్‌ మండిపడ్డారు. తనకు అన్యాయం జరుగుతోందని చెబుదామన్నా.. పత్తా లేకుండా వైకాపా నేతలంతా పారిపోయారన్నారు. తాను గతంలో తెదేపాలో బొండా ఉమాతోనే ఉండేవాడినని, ఇప్పుడు వైకాపాలో ఉన్నాననే కక్షతోనే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేస్తానని, న్యాయం జరిగే వరకూ పోరాడతానన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని