logo

స్వయంభూ.. సర్దుకోవడమే

విజయవాడలో ఉత్పత్తి అవుతున్న చెత్త తరలించేందుకు కార్పొరేషన్‌ అడక్కపోయినా.. ప్రభుత్వం అంటగట్టిన సీఎన్‌జీ వాహనాలకు త్వరలో బ్రేక్‌ పడనుంది.

Updated : 18 Jun 2024 04:12 IST

క్లాప్‌ వాహనాలకు బ్రేక్‌!]
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

విజయవాడలో ఉత్పత్తి అవుతున్న చెత్త తరలించేందుకు కార్పొరేషన్‌ అడక్కపోయినా.. ప్రభుత్వం అంటగట్టిన సీఎన్‌జీ వాహనాలకు త్వరలో బ్రేక్‌ పడనుంది. చెత్త పన్ను వసూలు నిలిపేయాలని కొత్త ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇవ్వగా, పన్ను వసూళ్లపైనే ఆధారపడిన వాహనాల గుత్తేదారు సంస్థ తట్టాబుట్టా సర్థుకొని వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సైతం చెత్త పన్ను వసూలు త్వరలో నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో గుత్తేదారు సంస్థ గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇప్పటివరకు వాహనాల అద్దె పేరిట ప్రతి నెలా రూ.కోట్లు దండుకున్న ఆ సంస్థ ఆశలపై కొత్త ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఒకపై తాము కొనసాగుతామో లేదోనన్న అనుమానంతో క్లాప్‌ వాహనాల డ్రైవర్ల మద్దతు కూడగట్టేందుకు వారితో అత్యవసర సమావేశం నిర్వహించి విధుల్లోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. 

చెత్త పన్ను వేసి.. : నగరపాలక సంస్థకు పెద్ద ఎత్తున డంపర్‌ ప్లేసర్లు, లోడర్లు, లారీలు, 10 టైర్‌ వాహనాలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, ఆటోలు ఉండగా, తెదేపా హయాంలో కాంపెక్టు వాహనాలు అనేకం సమకూరాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.కోట్ల విలువైన వాహనాలను మెల్లగా మూలకు నెట్టేసింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట మరో కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. తమకు అనుకూలమైన గుత్తేదార్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి సీఎన్‌జీ చెత్త వాహనాలను స్థానిక సంస్థకు అద్దెప్రాతిపాదికన అంటగట్టింది. ఫలితంగానే నగరపాలక సంస్థ డిపోలోకి 225 సీఎన్‌జీ వాహనాలు వచ్చి చేరాయి. కొత్త సంస్కరణలంటూ ప్రభుత్వం నగరవాసుల నెత్తిన చెత్త పన్ను భారానికి తెరలేపింది. మందుగా ఇళ్ల యజమానులు, తదుపరి వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి చెత్త పన్ను వసూలు మొదలు పెట్టింది. చెత్త పన్ను భారంపై తెదేపా, విపక్షాలు కౌన్సిల్లో ఆందోళన చేసినా పాలకులు కనికరం చూపలేదు.


ప్రభుత్వం మారడంతో..

ప్రస్తుతం ప్రభుత్వం మారింది. చెత్త పన్ను రద్దుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా లిఖిత పూర్వక ఆదేశాలు అందకపోయినప్పటికీ జూన్‌ మొదటి వారం నుంచి అధికారులు చెత్త పన్ను వసూళ్లను దాదాపు నిలిపేశారు. వాస్తవానికి ఎన్నికల ముందు నుంచే చెత్త పన్ను వసూలు నిలిపేసినా, కొంతమంది స్వచ్ఛందంగా చెల్లించారు. వ్యాపారుల నుంచి మాత్రమే యథావిధిగా వసూలు చేయగా, ఈ నెలలో ఇప్పటివరకు వ్యాపారుల నుంచి చెత్త పన్ను వసూలు చేసే సాహసం అధికారులు చేయలేదు. చెత్త పన్ను రద్దు కానున్న నేపథ్యంలో ఇకపై ఆ భారం నగరపాలక సంస్థ ఖజానాపై పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని భావిస్తున్న గుత్తేదారు సంస్థ అయిన స్వయంభూ మెల్లగా సర్థుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.


రూ.కోట్లు వసూలు

గరంలో నిత్యం 550-610 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. వ్యర్థాలు తరలించేందుకు నగరపాలక సంస్థకు వాహనాలు, 25 సీఎన్‌జీ వాహనాలు ఉండగా, వాటినే ఉపయోగించేవారు. ఫలితంగా చెత్త తరలింపు భారం స్వల్పంగా ఉండేది. అనేక వాహనాలకు అధికారులు తాజాగా మరమ్మతులు చేశారు. దాదాపు 40 పెద్ద, చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్థితిలో గత ప్రభుత్వం అంటగట్టిన 225 సీఎన్‌జీ వాహనాలను కొనసాగించే పక్షంలో అద్దె కింద ఏడాదికి రూ.13.92 కోట్లు చెల్లించాలి. ఇప్పటికే 2022లో రూ.12.66 కోట్లు, 2023లో రూ.11.25 కోట్లు చెల్లించగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. అదనపు ఆర్థిక భారాన్ని మోసేందుకు అధికారులు కూడా విముఖత చూపడంతోనే గుత్తేదారు సంస్థ వెనక్కు వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని