logo

తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు అని ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ అన్నారు.

Published : 18 Jun 2024 03:47 IST

పెదపారుపూడి సంతాప సభలో వక్తలు

పెదపారుపూడి(పామర్రు గ్రామీణం), న్యూస్‌టుడే: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు అని ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ అన్నారు. రామోజీరావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సోమవారం ఏర్పాటు చేసిన సంతాప సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె.. గ్రామపెద్దలతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నీరజ మాట్లాడుతూ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. మహాశక్తి అని అన్నారు. సమాజ అభ్యున్నతికి సమాజంలో జరిగే చెడుపై ఎంతో పోరాటం చేశారని, ఆయన అభివృద్ధి చెందడమే కాకుండా ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలనే మానవతా దృక్పథం కలిగిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. పెదపారుపూడిలో గ్రామంలో జన్మించిన రామోజీరావు అంచలంచెలుగా ఎదిగి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచారని, ఆయన చేసే ప్రతి పని ఒక నిబద్ధతతో చేసి రోల్‌మోడల్‌గా నిలిచారన్నారు. తాను పుట్టిన పెరిగిన గ్రామాన్ని మర్చిపోకుండా పెదపారుపూడిని దత్తత తీసుకుని సొంత నిధులు వెచ్చించి ఇక్కడి ప్రజలకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడం ముదావహమన్నారు. ఆయన సేవలకు ప్రతీకగా గ్రామస్థులంతా ముఖద్వారం ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలో రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ సహకరించాలన్నారు. రామోజీరావు బాల్య స్నేహితుడు పాలడుగు చంద్రశేఖరరావు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు పునుకొల్లు శివప్రసాద్‌లు మాట్లాడుతూ రూ.25 కోట్లతో గ్రామంలో అంతర్గత రోడ్లు, పాఠశాల భవనాలు తదితర సౌకర్యాలు కల్పించారని, మరికొన్ని చేపట్టాల్సి ఉందని, వాటిని రామోజీరావు కుటుంబీకులు పూర్తి చేస్తారన్నారు. ఆయన మృతి తీరని లోటని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి చప్పిడి సమీర, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ డైరెక్టర్‌ పునుకొల్లు రత్నప్రసాద్‌(నాని), చప్పిడి కిషోర్‌ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని