logo

కిలేడీ.. కొలువులు పేరుతో బురిడీ

నిరుద్యోగులే ఆమె లక్ష్యం. తీయని మాటలు చెప్పి విదేశాలకు పంపిస్తానంటూ డబ్బులు గుంజుకుని మోసం చేయడం ఆమె వృత్తి. మోసపోయామని తెలుసుకొని తిరిగి డబ్బులు అడిగిన బాధితులను బెదిరించడం ఆమె నైజం.

Published : 18 Jun 2024 07:15 IST

పటమట, న్యూస్‌టుడే: నిరుద్యోగులే ఆమె లక్ష్యం. తీయని మాటలు చెప్పి విదేశాలకు పంపిస్తానంటూ డబ్బులు గుంజుకుని మోసం చేయడం ఆమె వృత్తి. మోసపోయామని తెలుసుకొని తిరిగి డబ్బులు అడిగిన బాధితులను బెదిరించడం ఆమె నైజం. అలా ఆమె చేతిలో ఎంతోమంది మోసపోగా.. అందులో కొందరు సోమవారం విజయవాడ సీపీ రామకృష్ణను ఆశ్రయించారు. న్యాయం చేయాలని కోరారు.

రూ.లక్షల్లో వసూలు.. సౌజన్య అనే మహిళ మరో వ్యక్తితో కలిసి గతంలో ఆటోనగర్‌లో ఓ కన్సల్టెన్సీ ద్వారా కొంతమంది యువకులను విజిటింగ్‌ వీసా ద్వారా కెనడా పంపించారు. వారిని చూసి మరికొంతమంది కెనడా వెళ్లేందుకు కన్సల్టెన్సీని ఆశ్రయించారు. అక్కడ విభేదాలు రావడంతో సౌజన్య ఏలూరు రోడ్డులో సొంతంగా కన్సల్టెన్సీ పెట్టి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు యువతి, యువకుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకు తీసుకుంది. గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాలకు చెందిన సుమారు 40 మంది వరకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించినా ఉద్యోగం చూపించకుండా నెలలు గడిచిపోవడంతో ఆ మహిళను బాధితులు గట్టిగా నిలదీశారు. ‘మీరే నకిలీ ధ్రువపత్రాలు స్పష్టించారు.. అందుకే వీసా రాలేదు. మీపైనే కేసు పెడతా’ అంటూ బాధితులనే బెదిరించింది. చేసేది లేక వారు సోమవారం సీపీ రామకృష్ణను ఆశ్రయించారు. ఆయన స్పందించి కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు. మాచవరం సీఐ గుణరాము బాధితులతో పాటు, కన్సెల్టెన్సీ నిర్వాహకురాలిని పిలిచి విచారణ చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని