logo

నీతులు వల్లించి.. నిధులు మళ్లించి!

విజయవాడ నగరంలో చినుకు పడితే చాలు రహదారులన్నీ చెరువులైపోతున్నాయ్‌. ఓ మోస్తరు వాన పడితే.. కాలనీలు సైతం నీట మునుగుతున్నాయి. ఓ గంట గట్టిగా కుండపోత వర్షం కురిస్తే.. నగరమే అతలాకుతలం అయిపోతోంది.

Updated : 18 Jun 2024 04:11 IST

వాననీటి మళ్లింపు కాలువలను గాలికొదిలిన దారుణం
వైకాపా ప్రభుత్వ పాపం.. నగరవాసులకు శాపం
చిన్న వర్షం పడితే.. విజయవాడ మునుగుతోంది
తెదేపా హయాంలోనే 60 శాతం పూర్తయిన పనులు
ఈనాడు - అమరావతి

విజయవాడ నగరంలో చినుకు పడితే చాలు రహదారులన్నీ చెరువులైపోతున్నాయ్‌. ఓ మోస్తరు వాన పడితే.. కాలనీలు సైతం నీట మునుగుతున్నాయి. ఓ గంట గట్టిగా కుండపోత వర్షం కురిస్తే.. నగరమే అతలాకుతలం అయిపోతోంది. దీనికి ప్రధాన కారణం.. వాన నీటిని మళ్లించే కాలువలు సక్రమంగా లేకపోవడమే. రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి.. ఏకంగా నగరంలో జనజీవనమే స్తంభించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది.. చెట్ల కొమ్మలు విరిగిపోయాయ్‌.. రహదారులన్నీ ఏరులై పారాయి.. జనం బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో రహదారులపైకి వచ్చే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎక్కడ గుంతలున్నాయో.. మ్యాన్‌హోల్స్‌ తెరుచుకుని మృత్యువును ఆహ్వానిస్తున్నాయో.. తెలియని దారుణమైన పరిస్థితి. వర్షాకాలం ఆరంభంలో కురుస్తున్న చిన్నపాటి వానలకే ఈ పరిస్థితి అయితే.. ఇంక మున్ముందు ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత ఐదేళ్ల వైకాపా పాలన ఫలితమే ఈ దుస్థితికి కారణం. 2017లో చంద్రబాబు ప్రభుత్వంలో ఆరంభించిన వాన నీటి కాలువల పనులను 60 శాతం పూర్తిచేశారు. జగన్‌ పాలన ఆరంభమైన తర్వాత.. ఆ కాలువలను అలాగే సగంలో వదిలేశారు. ఆ పాపమే.. ఇప్పుడు నగరవాసులకు శాపంగా మారుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.461 కోట్ల నిధులతో 2017 ఏప్రిల్‌లో విజయవాడలో వాన నీటి కాలువ పనులు ఆరంభించారు. 2019 ఆగస్టు నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో జోరుగా పనులు చేపట్టారు. 60 శాతం పనులు పూర్తయిన సమయంలో వైకాపా సర్కారు గద్దెనెక్కింది. అంతే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వదిలేశారు. నగరంలో 443.75 కి.మీ మేర కాలువలను నిర్మించాల్సి ఉండగా.. 252 కి.మీ. మేర తెదేపా హయాంలోనే పూర్తిచేశారు. కానీ.. ఆ తర్వాత మిగతా పనులను పూర్తిచేయకపోగా.. గుత్తేదారు సంస్థను పారిపోయేలా చేసి, ఆ నిధులను సైతం మళ్లించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కింది. నగరంలోని అన్ని డివిజన్లలోనూ పనులను తెదేపా హయాంలో చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక.. కాలువలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మారడంతో.. 500 ప్రాంతాల్లో కాలువలను ఒకదానితో ఒకటి అనుసంధానించకుండా దేని దారి దానిదే అన్నట్టు ఐదేళ్లు అలాగే వదిలేశారు. చాలా ప్రాంతాల్లో అవి పిచ్చి మొక్కలు, చెత్తకు ఆవాసాలుగా మారిపోయాయి. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే.. అసలు ఈ అసంపూర్తి కాలువలను దేనికోసం కట్టారో.. అని అన్ని ప్రాంతాల్లో జనం అనుకునే దయనీయ స్థితికి తీసుకొచ్చారు.


అనుసంధానిస్తే కొంతైనా వరద తగ్గుతుంది...

గరంలో అసంపూర్తిగా వదిలేసిన వాన నీటి మేజర్, మైనర్‌ కాలువలను అనుసంధానిస్తే కనీసం కొంతైనా వరద ముంపును తగ్గించొచ్చు. ఇలా 500 ప్రాంతాల్లోని కాలువలనూ అనుసంధానిస్తే.. నీటిని ఎక్కడా రహదారులపై నిలిచిపోకుండా బయటకు పంపేయొచ్చు. వర్షం పడినప్పుడు ఒక్కసారిగా రహదారులపైకి వరద వచ్చి చేరుతోంది. పలుచోట్ల కల్వర్టుల పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే కాలువలు ధ్వంసమై ఉన్నాయి. నగరంలో నిత్యం పోగయ్యే వ్యర్థాలు, చెత్త తెచ్చి ఏళ్లుగా వీటిలో పోసేస్తున్నారు. రోడ్లపై ఉండే చెత్తను కూడా నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది చాలాచోట్ల ఈ అసంపూర్తి కాలువల్లోకి నెట్టేస్తున్నారు. వీటిని తొలగించి.. ఈ కాలువలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. 


పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో..

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీని తప్పించేసి.. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే పనులు చేపడతామన్నారు. గుత్తేదారు సంస్థ వైదొలగిపోయింది. కానీ.. ఆ తర్వాత నగరపాలక సంస్థ చేతులెత్తేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం ప్రజారోగ్యశాఖకు బదిలీ చేశారు. ఆ నిధులు ఏమయ్యాయో? అసలు ఎందుకు పనులు చేపట్టకుండా వదిలేశారో.. అధికారులకే తెలియాలి. వైకాపా ప్రభుత్వం కూడా విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేయడంతో.. వాన నీటి కాలువల గురించి పట్టించుకునే వాళ్లే లేకుండాపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని