logo

గుల్ల చేసినోళ్లు.. గుట్టు తేల్చాల్సిందే!

జగనన్న కాలనీల పేరు చెప్పి.. కొండలు కొల్లగొట్టారు.. అటవీ భూములు తవ్వారు.. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు తవ్వారు.. పోలవరం కట్టలను కరిగించేశారు.. ఆఖరికి చెరువులనూ ఊడ్చేశారు.. ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లలో జరిగిన మట్టి దందా ఇది.

Published : 18 Jun 2024 03:58 IST

మట్టి మాఫియా లెక్కలు తీసేందుకు చర్యలు...
గనుల శాఖ అధికారులకు మంత్రి కొల్లు ఆదేశాలు
ఈనాడు - అమరావతి

జగనన్న కాలనీల పేరు చెప్పి.. కొండలు కొల్లగొట్టారు.. అటవీ భూములు తవ్వారు.. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు తవ్వారు.. పోలవరం కట్టలను కరిగించేశారు.. ఆఖరికి చెరువులనూ ఊడ్చేశారు.. ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లలో జరిగిన మట్టి దందా ఇది. కొన్ని లక్షల కోట్ల ఘనపు మీటర్ల మట్టి మెక్కేశారు. ఇంత మట్టితో ఏ జగనన్న కాలనీ మెరక చేశారు.? ఏ జాతీయ ప్రాజెక్టుకు తరలించారు.? ఎక్కడ రాష్ట్ర రోడ్లు వేశారు? చిన్న వర్షం పడితే.. జగనన్న కాలనీలన్నీ చెరువులనే తలపిస్తున్నాయి. కాలనీల్లో ఒక్క రోడ్డు వేయలేదు. మరి ఈ మట్టి ఎక్కడికి తరలింది. అసలు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఎంత..? తవ్విందెంత? ఖజానాకు వచ్చిన ఆదాయం ఎంత..? ఇది కదా... అసలు  లెక్క.

ప్పుడిదే పనిలో రెండు జిల్లాల గనుల శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాగా.. పునర్విభజన తర్వాత ఎక్కడ అనుమతులు ఇచ్చారు..? ఎంత తవ్వారు? వాటి ఆదాయ తీరు తెన్నులపై దస్త్రాలు తిరగేస్తున్నారు. మరోవైపు విజిలెన్సు నిఘా విభాగం రంగంలోకి దిగింది. క్షేత్రంలో వాస్తవాలు వెలికి తీసే పనిలో పడింది. మట్టిమాఫియా సూత్రధారులను కలుగులోంచి వెలికి తీసే యత్నాలు జరుగుతున్నాయి. మంత్రి కొల్లు రవీంద్రకు ఎక్సైజ్‌.. గనులు, భూగర్భ గనుల శాఖను అప్పగించగా.. తొలుత జిల్లాలో అక్రమాలపై దృష్టి పెట్టి.. ‘‘ఘనుల’’ లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించారు.’’

గనుల శాఖ లెక్కల ప్రకారం ఒక ఎకరంలో ఒక మీటరు లోతున తవ్వితే.. 4 వేల ఘనపు మీటర్ల ఖనిజం (గ్రావెల్‌) వెలువడుతుంది. పది టైర్ల టిప్పర్‌లో నిండుగా నింపితే.. 10 క్యూబిక్‌ మీటర్ల మట్టి పడుతుంది. అంటే 400 టిప్పర్లు గ్రావెల్‌ వస్తుంది. విజయవాడ శివారులో ఒక టిప్పరు గ్రావెల్‌ రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. ఒక ఎకరం తవ్వితే ఆదాయం రూ.32 లక్షలు. టిప్పర్ల బాడుగ, ఇతర ఖర్చులు సగానికి సగం తీసినా.. రూ.16 లక్షలు మిగులు. అనుమతులు తీసుకుని తవ్వితే.. ఘనపు మీటరుకు రూ.109 చొప్పున గనుల శాఖకు చెల్లించాలి. ఎకరానికి రూ.4.36 లక్షల రాయల్టీ గనుల శాఖకు చెల్లించాలి. లీజు, పర్యావరణ అనుమతి తప్పనిసరి. 

పోలవరం కట్టలు..!

తెంపల్లి, గొల్లనపల్లి, బల్లిపర్రు, రంగన్నగూడెం, గోపవరపు గూడెం, పాతపాడు, అప్పారావుపేట, అంబాపురం పరిధిలో పోలవరం కట్టలను ఇరువైపులా దాదాపు 100 మీటర్ల చొప్పున రీచ్‌లు ఏర్పాటు చేసుకుని గండికొట్టినట్లు తవ్వారు. కొంత భాగం విడిచి మళ్లీ 100 మీటర్లు చొప్పున తవ్వేశారు. దాదాపు 10 మీటర్ల ఎత్తున ఉండే ఈ కట్టల నుంచి వచ్చిన మట్టికి లెక్కలు లేవు. పోలవరం ప్రాజెక్టు అధికారులు తాము అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల గనుల శాఖ విజిలెన్సు విభాగం అధికారులు పరిశీలించారు.

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు..

కొత్తూరు తాడేపల్లిలో గ్రావెల్‌ తవ్వకాలపై ఎన్జీటీకి ఫిర్యాదు, హైకోర్టులో పిల్‌ దాఖలు జరిగాయి. ఎన్జీటీ ఆదేశాల మేరకు రెండుసార్లు కమిటీ పర్యటించింది. కమిటీ పర్యటనకు మట్టి మాఫియా అడ్డంకులు సృష్టించింది. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, పాతపాడు, నైనవరం, జక్కంపూడిల్లో భారీగా తవ్వారు. ఎన్జీటీ బృందం పర్యటించాక కూడా విజయవాడ గ్రామీణ రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ భూముల్లో అనుమతులు ఇవ్వడం విశేషం. కొత్తూరు.. సర్వేనెంబరు 39-10, 39-12, 40-12, 39-9లో ఎన్వోసీ జారీ చేశారు. అటవీ భూముల్లో తవ్వకాలపై చర్యలకు సిఫార్సు చేశారు. 


రూ.కోట్లలో దోపిడీ..! 

మ్మడి జిల్లాలో విచ్చలవిడిగా గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి. అయిదేళ్లలో వందల ఎకరాల్లో తవ్వేశారు. రూ.వందల కోట్లలో ప్రభుత్వానికి రాయల్టీ ఎగవేశారు. అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత అనేలా చేయగా, జగనన్న కాలనీల పేరుతో అసలు రాయల్టీ లేకుండా తవ్వించారు. కొండలు, గుట్టలు, పోలవరం కాలువగట్లు, అటవీ బంజరులు, మేత పోరంబోకు తదితర ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. ఎక్కువగా విజయవాడ పరిసరాల్లో, గన్నవరంలో తవ్వకాలు జరిగాయి. గన్నవరం పరిధిలో ఏ కొండ చూసినా.. మట్టి తవ్విన ఆనవాళ్లే. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు మండలాల్లో ప్రభుత్వ బంజరులు, అటవీ, రెవెన్యూ భూమి, చెరువులు, పోలవరం కుడి కాలువ కొల్లగొట్టారు.


పిండుకో.. దండుకో..

2019లో వైకాపా గద్దెనెక్కాక గన్నవరంలో విచ్చలవిడిగా తవ్వకాలకు అనుమతిచ్చారు. 50 వేల క్యూబిక్‌ మీటర్ల మేర 20 వరకు లీజులు మంజూరు చేశారు. ఆరు నెలల్లోనే వాటి తవ్వకాలు పూర్తి చేశారు. తర్వాత అనుమతులు ఇవ్వలేదు. అంతకు ముందు నాటి మంత్రి, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఓ అధికారి అనుమతి ఇచ్చారు. ఏ పరిశీలన లేకుండా గ్రామ కంఠాలు, మేత పోరంబోకు భూముల్లో తవ్వారు. తాజాగా అనుమతులు లేవని గనుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గొల్లనపల్లిలో 20 ఎకరాల ప్రభుత్వ బంజరులో తవ్వుతున్నారు. దాదాపు పది మీటర్ల లోతున తవ్వడం గమనార్హం. కొండపావులూరు, వెదురుపావులూరు గుట్టలను కొల్లగొట్టారు. కొండ పావులూరు-10, బిక్కవరం నక్కలతిప్ప-5, రంగన్నగూడెం-10, మల్లవల్లి-10, విజయవాడ గ్రామీణం పాతపాడు-10 ఎకరాల చొప్పున, గుబ్బలగుట్టను ఆసాంతం తవ్వేశారు.


బెదిరించు.. బరితెగించు.. 

భారీగా తవ్వకాల వెనుక నాటి వైకాపా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఓ మంత్రి జిల్లాఅధికారిపై ఒత్తిడి తెచ్చి గన్నవరంలో మేతపోరంబోకు బంజరు తవ్వకానికి అనుమతి తీసుకుని అనుచరులకు కేటాయించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. పోలవరం కట్టల తవ్వకాలపై ఓ మంత్రి ఒత్తిడి తెచ్చి అనుమతి ఇప్పించారు. అనుమతులు ఇవ్వని, తవ్వకాలను అడ్డుకున్న ఏఈలను బదిలీ చేశారు. కొత్తూరు తాడేపల్లిలో నాటి గుంటూరు ప్రజాప్రతినిధి తవ్వకాలు జరిపించారు. తాము ఎంపీ మనుషులమని బెదిరించారు. ప్రస్తుతం ఈ తవ్వకాల లెక్కలు తీస్తున్నారు. కక్ష సాధింపులా కాకుండా ప్రభుత్వ వనరులను దోచిన వారి నుంచి రాయల్టీ కట్టించాలనేదే లక్ష్యమని తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని