logo

నిరంతర పోరాట యోధుడు రామోజీరావు

సమాజ సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన యోధుడు రామోజీరావు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంతాప సభ మంగళవారం రాత్రి విజయవాడ

Published : 19 Jun 2024 04:45 IST

రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, హరికృష్ణ, నారాయణరావు, ఆంజనేయరాజు తదితరులు

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే : సమాజ సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన యోధుడు రామోజీరావు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంతాప సభ మంగళవారం రాత్రి విజయవాడ నగరంలోని కౌతా కళా వేదికపై నిర్వహించారు. తెలుగు కళావాహిని, జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి, రాగలహరి, కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత వక్తలంతా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. వ్యవస్థలో మంచి మార్పు కోసం విశేష కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. సమాజంలో అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేస్తూ.. అక్షరమే ఆయుధంగా ప్రజల పక్షాన నిలబడ్డారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని తెలిపారు. నిబద్ధత, విలువలతో ప్రజాపక్షాన పోరాడిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. బహుళ ప్రజాదరణ గల ‘ఈటీవీ’ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా అనేక మందిని చిత్రరంగానికి పరిచయం చేశారని తెలిపారు. ‘చతుర’, ‘విపుల’ ‘తెలుగు వెలుగు’, ‘ఈనాడు’  పత్రికల ద్వారా తెలుగు భాషకు అమూల్యమైన సేవలు అందించారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. తన సంస్థల్లో వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నేటితరం నాయకులు, యువత.. రామోజీరావును స్ఫూర్తిగా తీసుకోవాలని పలు కళా సంస్థల నిర్వాహకులు కోరారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. గోళ్ల నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. చింతకాయల చిట్టిబాబు, బి.ఆంజనేయరాజు, పొల్లూరి హరికృష్ణ, కొల్లి మురళీకృష్ణ, డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని