logo

సహకార సంఘాల ప్రక్షాళన

నూతన ప్రభుత్వ ఆదేశాలతో సహకార సంఘాల్లోని తిసభ్య కమిటీలు అన్నీ రద్దు చేశారు. కమిటీ సభ్యుల నుంచి అధికారులు రాజీనామాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించిన అంశం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Published : 19 Jun 2024 04:52 IST

త్రిసభ్య కమిటీల రద్దు
ప్రత్యేక అధికారుల నియామకానికి కొత్త ప్రభుత్వం చర్యలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: నూతన ప్రభుత్వ ఆదేశాలతో సహకార సంఘాల్లోని తిసభ్య కమిటీలు అన్నీ రద్దు చేశారు. కమిటీ సభ్యుల నుంచి అధికారులు రాజీనామాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించిన అంశం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సహకార సంఘాల ఎన్నికలు జరిగి ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతాయని రైతులు భావిస్తున్నా.. గత వైకాపా ప్రభుత్వం వాయిదా వేయడమే తప్ప.. ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. సరికదా వీటిని తమ పార్టీ నాయకులకు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టే సంస్థలుగా మార్చేసింది. తెదేపా ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

సహకార సంఘాలకు ఎన్నికలు జరిగి పదేళ్లు కావస్తోంది. 2013 జనవరిలో ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకున్నారు. వీటి గడువు 2018 జనవరితో ముగియడంతో వాటినే తిరిగి కొనసాగించేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇవి 2019 జులై వరకు అంటే ఏడాదిన్నర పాటు అదనంగా కొనసాగాయి. ఆ తరువాత ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించారు. దీనిలో భాగంగా సంఘాల్లో ఉన్న సభ్యులు, ఓటర్ల వివరాలు కూడా సేకరించి తగు ఏర్పాట్లు చేశారు. కానీ  ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. త్రిసభ్య కమిటీ పేరుతో ఒకరిని ఛైర్మన్‌గా, ఇద్దరిని సభ్యులుగా నియమించి పాలన సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరు నెలలకోసారి ఈ కమిటీలను పొడిగించుకుంటూ వస్తూ కాలం వెళ్లదీశారే కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించడంలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 425 సహకార సంఘాలుంటే కృష్ణా జిల్లాలో 213 సంఘాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలకు జూన్‌ నెలాఖరు వరకు గడువు ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశాలతో కమిటీ సభ్యులు అందరి నుంచి రాజీనామాలు తీసుకున్న అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.

ప్రత్యేక అధికారుల  నియామకానికి చర్యలు

ప్రస్తుత ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నా దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రత్యేక అధికారులను నియమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పీఏసీఎస్‌లలో ఉండే కార్యదర్శుల విధులకు ఇబ్బంది లేకుండా కేడీసీసీ బ్యాంకు పరిధిలోని ఉద్యోగులు, సహకార శాఖ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు కసరత్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల వారీగా  ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ఎంతమంది బాధ్యతలు కేటాయించాల్సి ఉంది. ఆయా శాఖల్లో నిర్దేశించిన అర్హతలు ఉన్న ఉద్యోగులు తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసిన సహకార శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించడం జరిగింది. ఖరీఫ్‌ పనులు కూడా ప్రారంభం కావడంతో రైతులకు రుణాల మంజూరు, ఎరువులు విక్రయాలు తదితరాలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన వారిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


త్రిసభ్య కమిటీలతో అనేక సమస్యలు

సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా వైకాపా ప్రభుత్వం త్రిసభ్య కమిటీల ద్వారా పాలన సాగించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రధానంగా ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో అవకతవకలకు పాల్పడడానికి అవకాశం ఏర్పడిందన్న విమర్శలు వినిపించాయి. ఈ కమిటీ కేవలం రాజకీయ పోస్టులా తయారయ్యింది. ప్రశ్నించేవారు లేకపోవడంతో వివిధ సంఘాల్లో అవకతవకలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి, కొన్నిచోట్ల ఛైర్మన్లతో కలిసి కార్యదర్శులు అక్రమాలకు పాల్పడితే ఇంకొన్నిచోట్ల కమిటీ సభ్యుల అవగాహన లోపాన్ని ఆసరాగా తీసుకుని కార్యదర్శులే సంఘ నగదును పక్కదారి పట్టించిన సంఘటనల కూడా ఉన్నాయి. అలాంటి వాటిపై ప్రజలు అందించిన ఫిర్యాదుల మేరకు సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నా కానీ ఇంతవరకు పక్కదారి పట్టిన నగదును పూర్తి స్థాయిలో రికవరీ చేయలేక పోయారు. ఇలా కేవలం వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా సహకార వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కొత్తగా ఎన్నికలు జరిగితే సంఘ అధ్యక్షుడితో పాటు 11 మంది డైరెక్లర్లు ఉంటారు. అందరికీ జవాబుదారీతనం ఉంటుంది. ఎట్టకేలకు ఆదిశగా అడుగులు పడడంపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వానికి నివేదించాం
- చంద్రశేఖరరెడ్డి, జిల్లా సహకార శాఖాధికారి 

జిల్లా వ్యాప్తంగా అన్ని సంఘాల త్రిసభ్య కమిటీల సభ్యుల నుంచి రాజీనామా పత్రాలు స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాం. ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని