logo

అన్న క్యాంటీన్లకు చంద్రోదయం!

అన్నార్తుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న వీటికి భారీస్థాయిలో జనాదరణ దక్కింది.

Published : 19 Jun 2024 04:57 IST

పాతవి పునరుద్ధరించాలని ప్రభుత్వ ఆదేశం  
రంగంలోకి దిగిన అధికారులు
ఈనాడు డిజిటల్‌ - అమరావతి 

ఇటీవల జగ్గయ్యపేటలో అన్న క్యాంటీన్‌ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

న్నార్తుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న వీటికి భారీస్థాయిలో జనాదరణ దక్కింది. పరిశుభ్ర వాతావరణంలో రుచికరమైన అల్పాహారం, భోజనం అతి తక్కువ ధరకే అందించడం వీటి ప్రత్యేకత. మరికొన్నిచోట్ల నిర్మించాలన్న ప్రతిపాదనలు సైతం వెల్లువెత్తాయి. 2019లో వైకాపా గద్దెనెక్కడంతో ఆ క్యాంటీన్లను పూర్తిగా మూయించేసి.. సామాన్యుల కడుపు మీద కొట్టింది. ఖాళీ అయిన భవనాలను కొన్నిచోట్ల వేరే అవసరాలకు కేటాయించగా.. మరికొన్నింటిని నిరుపయోగంగా వదిలేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన తెదేపా కూటమి ప్రభుత్వం.. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. 

2018లో తెదేపా ప్రభుత్వం చేసిందిదీ...

  • నిత్యం పేదలు, సామాన్యులు వివిధ పనుల నిమిత్తం పట్టణాలు, నగరాలకు వెళ్తుంటారు. అక్కడ భోజనం చేయాలంటే వారికి తలకుమించిన భారమయ్యేది. చాలామంది మంచినీళ్లు తాగి కడుపు నింపుకునేవారు.
  • ఈ అవస్థలను గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబునాయుడు 2018లో అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చారు.
  • ప్రభుత్వ స్థలాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 40 లక్షల చొప్పున వెచ్చించి ఉమ్మడి జిల్లాలో 18 క్యాంటీన్లను నిర్మించారు. విజయవాడ నగరంలో 11 ప్రాంతాల్లో, గుడివాడలో 2, జగ్గయ్యపేట, నందిగామ, ఉయ్యూరు, మచిలీపట్నం, నూజివీడులలో ఒక్కోటి చొప్పున నిర్మించారు. 
  • సామాన్యులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. అక్కడే వీటిని నిర్మించారు.
  • ఈ క్యాంటీన్లను 2018 జూన్‌ 11న ప్రారంభించారు.
  • ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనాలను వడ్డించేవారు. పూటకు రూ. 5 చొప్పున అతి తక్కువ ధర వసూలు చేసేవారు. అంటే రూ. 15తో మూడుపూటలా పౌష్టికాహారం లభించేది.

పక్క రాష్ట్రాన్ని చూసైనా కనువిప్పు కలగలేదు!

తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తర్వాత ఎన్నికల్లో డీఎంకే గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు కొన్నిచోట్ల వాటిని ధ్వంసం చేశారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెంటనే స్పందించి సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించి.. క్యాంటీన్లను కొనసాగించారు. మన రాష్ట్రంలో దీనికి భిన్నమైన పరిస్థితి. 2019లో వైకాపా సర్కారు గద్దెనెక్కడంతో అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసేసింది. 


పునరుద్ధరణకు సన్నాహాలు

విజయవాడ గులాబీతోట భవనానికి సచివాలయాల పేర్లు తొలగింపు

  • తాజాగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే అన్న క్యాంటీన్ల దస్త్రంపై సంతకం చేశారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే వాటిని పునరుద్ధరిస్తామన్న ఆయన హామీ మేరకు అధికారుల్లో కదలిక వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కొక్కటీ తెరిపిస్తూ.. వాటి పునరుద్ధరణ పనుల కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నారు.
  • ఇప్పటికే జగ్గయ్యపేటలో పాత అన్న క్యాంటీన్‌ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పరిశీలించారు. పునరుద్ధరణ పనులపై అధికారులకు సూచనలు చేశారు.
  • నందిగామలోని రైతుబజారు వద్ద ఉన్న క్యాంటీన్‌ను ఇటీవల మున్సిపల్‌ కమిషనర్‌ హేమమాలిని తెరిపించారు. సదుపాయాల కల్పనకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.
  • విజయవాడ నగరంలోని భవానీపురంలో ఉన్న క్యాంటీన్‌ పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే సుజనాచౌదరి అధికారులకు సూచనలు చేశారు. 

అన్న క్యాంటీన్‌లో మెనూ..

ఉదయం: అల్పాహారం
మధ్యాహ్నం, రాత్రి : అన్నం, పప్పు, కూర, పెరుగుతో భోజనం
వెల : రూ. 5 చొప్పున 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు