logo

కంచెలు తెంచావు.. కష్టంలో నిలిచావు..

రాజధాని రైతులు, జనసైనికుల అభిమానం ముందు ఎండ వేడిమి చిన్నబోయింది. రాజధానిలో అడుగుపెట్టిన జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు మండుటెండను సైతం లెక్కచేయక రాజధాని రైతులు పూలవర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికారు.

Published : 19 Jun 2024 05:08 IST

జయహో జనసేనాని

ఎమ్మెల్యే కొలికపూడితో ఐకాస నాయకుడు సుధాకర్‌

న్యూస్‌టుడే, తుళ్లూరు : రాజధాని రైతులు, జనసైనికుల అభిమానం ముందు ఎండ వేడిమి చిన్నబోయింది. రాజధానిలో అడుగుపెట్టిన జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు మండుటెండను సైతం లెక్కచేయక రాజధాని రైతులు పూలవర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికారు. రంగు రంగుల పూలతో రాజధాని రహదారులన్నింటిని అన్నదాతలు పూల బాటలుగా మార్చారు. జయహో జనసేనాని అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారి ప్రారంభంలో రాజధాని రైతులు పవన్‌ కల్యాణ్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. పవన్‌ కారు దిగి రైతులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని కృతజ్ఞతలు తెలిపారు. డప్పులు, డీజేలు, సినీ గీతాలతో నృత్యం చేస్తూ బైక్‌లు, కార్ల ర్యాలీలతో జనసైనికులు, అభిమానులు సందడి చేశారు. రాజధాని రహదారుల వెంట అన్నదాతలు బారులు తీరి నమస్కరించారు. పవన్‌ కల్యాణ్‌ శిరస్సు వంచి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కాన్వాయ్‌ వెంట వేగంగా ఒక యువకుడు పరుగు తీయడాన్ని గమనించి వాహనాన్ని ఆపి కరచాలనం చేశారు. సీడ్‌ యాక్సెస్‌ రహదారి మందడం మలుపు వద్ద రాజధాని గ్రామం ఐనవోలుకు చెందిన మహిళలు కాన్వాయ్‌ ముందు మోకాళ్ల మీద నిలుచొని నమస్కారం చేసి అభిమానాన్ని చాటారు. పవన్‌ మహిళలతో ఆప్యాయంగా కరచాలనం చేసి ముందుకు సాగారు. పవన్‌కల్యాణ్‌ కాన్వాయ్‌ సచివాలయం చేరుకొనే వరకు రాజధాని రైతులు, రైతుకూలీలు, మహిళలు, జనసైనికులు, అభిమానులు భారీ ర్యాలీగా ఆయన వెంట పరుగులు పెట్టారు. అభిమానుల సెల్ఫీలు, అభినందనలు, అభివాదాలతో పవన్‌ పర్యటన ఆసాంతం కోలాహలంగా సాగింది. కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అమరావతి ఐకాస నాయకులు పువ్వాడ సుధాకర్, జనసేన, తెదేపా, భాజపా కూటమి నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, యర్రగోపు నాగరాజు, రాజధాని రైతులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతులు బహూకరించిన నాగలి చేతబూని.. 


రాజధానికి ‘అన్నవరం’లా నిలిచారు
- ఆలూరి శ్రీదేవి, రాజధాని మహిళా రైతు, మందడం గ్రామం.

వైకాపా ఐదేళ్ల అరాచక పాలనకు చంద్రబాబుతో కలిసి పవన్‌కల్యాణ్‌ సింహస్వప్నమై నిలిచారు. ఎన్డీయే కూటమి ఘన విజయంతో ఏకైక రాజధానిగా అమరావతి సజీవంగా నిలిచేలా తోడ్పాటు అందించారు. రాజధాని మహిళలకు ‘అన్నవరం’గా అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతుంది.


రాష్ట్ర భవిష్యత్తుకు కొండంత అండ 
- మువ్వా సుజాత, రాజధాని మహిళా రైతు, అనంతవరం గ్రామం

అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని అడ్డకుంలు సృష్టించినా రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్‌కల్యాణ్‌ అండగా నిలిచారు. ఎన్డీయే కూటమితో వైకాపా పతనానికి నాంది పలికారు. వ్యతిరేక ఓటు చీలిపోకుండా వైకాపాను కూకటివేళ్లతో పెకిలించి వేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని