logo

విలువలకు పాతరేసి.. దాష్టీకానికి దారులేసి

ఉమ్మడి జిల్లాలో గత అయిదేళ్ల వైకాపా పాలనలో పోలీసు శాఖ ప్రజల్లో పలుచనైపోయింది. దీనికి కారణం కొంతమంది పోలీసు అధికారులు. ఒంటిపై వైకాపా జెండా కప్పుకోవడం తప్పించి.. ఆ పార్టీ కార్యకర్తలుగానే పని చేశారు.

Updated : 19 Jun 2024 05:56 IST

వైకాపా కార్యకర్తలుగా పని చేసిన పోలీసు అధికారులు
బాధితులపైనే ఎదురు కేసులు
ఐదేళ్లలో అరాచక పాలన
ఈనాడు - అమరావతి

 • గన్నవరం నియోజకవర్గ పరిధిలోని రంగన్నగూడెంలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా వైకాపా శ్రేణులు ఫ్లెక్సీలు పెట్టి తెదేపా శ్రేణులను రెచ్చగొట్టాయి. దీనిపై మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్వయంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సీఐ నరసింహమూర్తి విచారణ చేయలేదు. కేసూ నమోదు చేయలేదు. ఇదే అంశంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్వయంగా స్టేషన్‌కు వెళ్లి తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఫిర్యాదు చేయగానే కేసు నమోదైంది. ఇప్పటికీ సీఐ నరసింహమూర్తి వైకాపా అజెండాతోనే పని చేస్తున్నారు. 

 • గన్నవరం కేంద్రంలో మరో సీఐ... పేరు కనకారావు. వైకాపా బ్రాండ్‌ అంబాసిడర్‌ అని పేరు. దగ్గరుండి మరీ తెదేపా కార్యాలయంపై దాడి చేయించారు. ఈయన అండతో వైకాపా కార్యకర్తలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. రాళ్లు విసిరిన ఘటనలో సదరు సీఐకి దెబ్బ తగిలింది. అంతే.. తెదేపా నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టేశారు. అరెస్టులు చేసేదాకా నిద్రపోలేదు. తెలుగు మహిళా నాయకురాలి పడక గదిలోకి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే వెళ్లి.. గజదొంగల మాదిరిగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈయన ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో భద్రత అధికారిగా ఉన్నారు. 

మ్మడి జిల్లాలో గత అయిదేళ్ల వైకాపా పాలనలో పోలీసు శాఖ ప్రజల్లో పలుచనైపోయింది. దీనికి కారణం కొంతమంది పోలీసు అధికారులు. ఒంటిపై వైకాపా జెండా కప్పుకోవడం తప్పించి.. ఆ పార్టీ కార్యకర్తలుగానే పని చేశారు. నిర్వర్తించాల్సిన విధులను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఖాకీలకున్న గౌరవాన్ని మంటగలిపేశారు. వివిధ సంఘటనల్లో బాధితులైన తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. అవన్నీ బుట్టదాఖలయ్యాయి. మరీ గట్టిగా పట్టుబడితే పీటీ కేసులకే పరిమితం చేసి వదిలేసేవారు. అదే వైకాపా నాయకులు ఎలా చెబితే అలా కఠినమైన సెక్షన్ల కింద, బెయిల్‌కు వీల్లేని కేసులు పెట్టి వెంటాడి వేధించారు. ఏకంగా బాధితురాలైన ఎస్సీ మహిళపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసిన ఘనులు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తెదేపా నాయకులు, కార్యకర్తలపై మానసికంగా మాటలతో దాడులు చేయడమే కాదు.. భౌతికంగా హింసించడం, ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం చేశారు. నిరసనలు, ఆందోళనల్లో పాల్గొంటే లాఠీలతో చితకబాదడం, బూటుకాళ్లతో తన్నడం... ఇలా ఒకటేమిటి ప్రజల భద్రత కోసం ఉన్నామన్న మాటనే మరచి... అచ్చం వైకాపా మూకలుగా పని చేశారు. పై అధికారులు చెప్పారని ఇష్టానుసారం భౌతిక దాడులకు తెగబడ్డారు. గృహ నిర్బంధాల పేరుతో అరెస్టులు చేయడం.. స్టేషన్ల చుట్టూ తిప్పడం.. ముందస్తు అరెస్టులు చేసి ఊరూరూ తిప్పుతూ చిత్రహింసలకు గురి చేయడం వారికే చెల్లింది. ఈ ఘటనలన్నింటికీ పాల్పడ్డ పోలీసు అధికారులు ఇంకా ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్నారు. బదిలీ అయినా.. వెళ్లిన చోటా తమ అజెండా మార్చుకోవడం లేదు. నిజాయతీతో విధుల పట్ల అంకితభావంతో ఉన్న అధికారులను వీఆర్‌ పేరుతో ఖాళీగా కూర్చోబెట్టిన ఘనత నాటి వైకాపా పాలకులది.

గన్నవరం నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలింది... బందరు నియోజకవర్గంలో పోలీసులు, సీఐలు నాటి మంత్రి పేర్ని నాని ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో నాటి మంత్రి కొడాలి నానికి వంగివంగి దండాలు పెట్టారు. ఆయన మట్టి అక్రమ తవ్వకాలకు, కబ్జాలకు కాపలా కాశారు. చివరకు ఓ అమ్మాయిని గంజాయి బ్యాచ్‌ అత్యంత దారుణంగా వేధిస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయని ఘనత నాటి సీఐది. ఇంకా జిల్లాలోనే ఉన్న ఇలాంటి అధికారులు తెదేపా నేతలను ప్రసన్నం చేసుకునేందుకు రోజూ వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. 


తెదేపా వెంట నీడలా..!

 • డీఎస్పీ స్థాయి అధికారులు ఎన్నికల ప్రచారంలో వైకాపాకు మద్దతు ఇచ్చారు. ఎలా అంటే బహిరంగంగా ప్రచారం చేయడం ఒకటే తక్కువ. అంతకుమించి ఏం చేయాలో అంతా చేశారు. 
 • ఉత్తర మండల ఏసీపీ డీఎన్‌వీ ప్రసాద్‌.. నాటి ఎమ్మెల్యే వెలంపల్లి మాటలను శిరసా వహించారు. గులకరాయి కేసులో బొండా ఉమను ఇరికించేందుకు ప్రయత్నించారు. ఆయనను నీడలా వెంటాడారు. ఎన్నికల ప్రచారం చేయనీయకుండా వారం పది రోజులపాటు అడ్డుకున్నారు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామంటూ సంకేతాలు పంపి భయాందోళనలకు గురి చేశారు.
 • పశ్చిమ ఏసీపీ మురళీకృష్ణారెడ్డిదీ అదే తీరు. మసీదులో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఎమ్మెల్సీ రుహుల్లా అడ్డంగా దొరికిపోయారు. దీనిపై నున్న పోలీసులకు ఎన్నికల అధికారి ఫిర్యాదు చేస్తే.. కనీసం విచారణ కూడా చేయకుండా వదిలేశారు. ఇంతవరకు చర్యలే లేవు. 
 • నున్న సీఐ దుర్గాప్రసాద్‌ పక్కాగా వైకాపాకు అనుకూలంగా పని చేశారంటూ ఆరోపణలున్నాయి. 
 • సింగ్‌నగర్‌ సీఐ గురుప్రకాష్‌ తెదేపాకు వ్యతిరేకంగా పని చేశారు. వైకాపా కార్పొరేటర్‌కు అమితంగా గౌరవమిచ్చి.. తెదేపా నాయకులను చులకనగా చూసేవారు. ఎన్ని ఫిర్యాదులిచ్చినా బుట్టదాఖలే.
 • పటమట సీఐగా మూడేళ్లు పని చేసిన సురేష్‌రెడ్డి... చెన్నుపాటి గాంధీ, పట్టాభి ఇంటిపై దాడి కేసులను పూర్తిగా నీరుగార్చి వైకాపా పెద్దలు చెప్పినట్టు ఆడారు. హత్యాయత్నం కేసులను సాధారణ దాడి కేసుగా నమోదు చేసిన ఘనత ఆయనది. ప్రస్తుతం ఎస్బీలో ఉన్నారు.
 • కృష్ణలంకలో పని చేసిన సీఐ దుర్గారావు... ముస్లిం మహిళ మృతి కేసును నీరుగార్చారు. వైకాపా నాయకులు దాడి చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయకపోగా.. తెదేపా కార్యకర్తలను అరెస్టు చేశారు. 

ఒకరా ఇద్దరా..?

 • విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అధికారులు, కృష్ణా జిల్లా పరిధిలోని సీఐలు నాటి వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులను మచ్చిక చేసుకుని పోస్టింగులు తెచ్చుకున్నారు. ఎస్సైలకు సైతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు పచ్చజెండా ఊపితేనే పోస్టింగు. ఒక్కో పోస్టింగుకు రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు చేసిన అధికారులున్నారు. వీరు విధుల్లో చేరాక.. స్వామిభక్తిని చాటుకుంటూ అందినకాడికి దండుకున్నారు. 
 • కంచికచర్ల గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌ వైకాపా కార్యకర్తకంటే దారుణంగా వ్యవహరించారు. అక్రమ ఇసుక లారీల సమాచారం ఇస్తే.. ఫిర్యాదుదారులనే పోలీసుస్టేషన్‌లో నిర్బంధించిన ఘనుడు. నాటి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై దాడికి దిగడమే కాదు.. ఆమెపైనే ఎస్సీఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. 
 • నందిగామ సీఐ, వీరులపాడు ఎస్సైలు సైతం వైకాపా సేవల్లో తరించిపోయారు. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ చెప్పిందే వేదంగా పాటించారు. 
 • జగ్గయ్యపేటలో అధికారులంతా ఎమ్మెల్యేకంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేవారు. వీరంతా వైకాపాకు అనుకూలంగా పని చేశారు. ఇసుక లారీలను తెదేపా నాయకులు పట్టుకుని అప్పగిస్తే.. కేసుల్లేకుండా వదిలేసిన ఘనులు. మల్కాపురంలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న గ్రామ ప్రజలపైనే కేసులు పెడతామని బెదిరించి మరీ అక్రమాలను ప్రోత్సహించి, కమీషన్లను దండుకున్నారు. 
 • తిరువూరులో అధికారులు ఇప్పటికీ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తెదేపా నాయకులు ఫిర్యాదు చేస్తే పిటీ కేసులు పెట్టారు. అదే వైకాపా నాయకులిచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వైకాపా నేతలతో అంటకాగుతూ.. జూదం, కోడిపందేలను ఓ అధికారి ప్రోత్సహించారు. 
 • పెనమలూరు పోలీసుస్టేషన్‌లో మరీ దారుణం. అరాచకాలకు అడ్డాగా మారింది. అక్కడ సీఐలకు వైకాపా నేతలు ఎంత చెబితే అంత. ఇటీవల బోడే ప్రసాద్‌ పెనమలూరు సీఐపై ఫిర్యాదు చేశారు. జోగి రమేష్‌ అరాచకాలకు అండగా నిలిచారు. వారి పంపకాలకు రక్షణగా నిలిచారు. 
 • అవనిగడ్డలో నాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ స్వయంగా జనసేన కార్యకర్తలపై దాడి చేస్తే,.. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. రొయ్యూరులో ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే.. అక్రమ తవ్వకాలకే ఖాకీలు కాపలా వెళ్లారు. 

వీరు  మామూలోళ్లు కాదు..!

విజయవాడ నగర సీపీగా పని చేసిన కాంతిరాణా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా పని చేశారు. గులకరాయి కేసులో తెదేపా నాయకులను ఇరికించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తెదేపా నాయకుల ఫిర్యాదులను పట్టించుకునేవారు కాదు. నగరంలో విచ్చలవిడిగా మసాజ్‌ సెంటర్లు పెరిగిపోయినా.. గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు ఆగడాలు మితిమీరిపోయినా పట్టించుకోలేదు. తెదేపా నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడమే ఏకైక అజెండాగా పని చేశారు. 


కృష్ణా జిల్లా ఎస్పీలుగా పని చేసిన వారంతా వైకాపా అజెండానే అమలు చేశారు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వ్యక్తి జాషువా.  ఈయన మరింతగా రెచ్చిపోయి గన్నవరంలో క్యాసినోల నిర్వహణకు పరోక్షంగా అనుమతులిచ్చేశారు. కొల్లు రవీంద్రను అకారణంగా అరెస్టు చేసి ఎక్కడెక్కడికో తిప్పారు. తన తల్లికి మాతృ తర్పణం చేసేందుకు కూడా అనుమతివ్వలేదు. చివరకు ఆయన భార్య కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశామంటూ అడ్డంగా బొంకేశారు. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని బాధితుడే స్వయంగా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని