logo

జోగి.. ఇదేం యాగీ!

మా కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తి (భూమి) సర్వే నంబరు 88లో ఉండగా.. మండల సర్వేయర్‌ వచ్చి సదరు ఆస్తి సర్వే నంబరు 87లో ఉందని తెలుపగా.. దాని ఆధారంగా మేము కొనుగోలు చేసిన ఆస్తులను విక్రయించాం.

Updated : 20 Jun 2024 06:13 IST

సర్వే నంబరు అడ్డంగా మార్చేశారు..

అధికారం అండతోనే అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా 
ఇపుడేమో తెరమీదకు వింత వాదనలు 

మా కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తి (భూమి) సర్వే నంబరు 88లో ఉండగా.. మండల సర్వేయర్‌ వచ్చి సదరు ఆస్తి సర్వే నంబరు 87లో ఉందని తెలుపగా.. దాని ఆధారంగా మేము కొనుగోలు చేసిన ఆస్తులను విక్రయించాం. మా కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఆస్తులకు, అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తునకు ఏమీ సంబంధం లేదు. అనవసరంగా నా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
- వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ బుధవారం పత్రికలకు విడుదల చేసిన వివరణ ఇది. 


ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా మాజీ మంత్రి గారూ..?

 • ఒక సర్వే నంబరులో కొనుగోలు చేసిన ఆస్తి.. రిజిస్ట్రేషన్‌ తర్వాత మరో సర్వే నంబరులోకి ఎలా మారుతుంది?
 • మండల సర్వేయరు చెప్పారంటున్నారు కదా... సర్వే నంబరు 88లో ఉండాల్సిన 2,160 గజాల స్థలం సర్వే నంబరు 87లోకి వెంటనే ఎలా మారిపోయింది? 
 • దస్తావేజుల్లో స్వీయ సవరణ పేరుతో ఎలా మార్పు చేస్తారు?
 • లింకు డాక్యుమెంట్లను పరిశీలించాలి కదా.. వాటిల్లో కూడా సర్వే నంబరు మారిందా?
 • అసలు విజయవాడ గ్రామీణ తహసీల్దారు స్వాధీన పత్రం ఎలా జారీ చేశారు? ఈ విషయం ఆర్డీవో, సంయుక్త కలెక్టరు, కలెక్టరు దృష్టికి ఎందుకు వెళ్లలేదు? ప్రభుత్వంలో పరపతిని అడ్డం పెట్టుకుని కిందిస్థాయి రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారా?
 • సర్వే నంబరు 87లోని 2,160 గజాల స్థలాన్ని సీఐడీ జప్తు చేసిన విషయం, నిషేధిత జాబితాలో ఉన్న విషయం మీకు తెలియదా? 
 • ఈ విషయం ఆర్డీవో, సంయుక్త కలెక్టర్, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లకుండా ఎమ్మార్వో పరిష్కరించడం వెనుక మీ ఒత్తిడి పని చేయలేదా? 

ఆక్రమించిన భూములు ఇవే.. 

ఈనాడు, అమరావతి విజయవాడ గ్రామీణ పరిధిలోని అంబాపురంలో సీఐడీ జప్తు చేసిన అగ్రి గోల్డ్‌ సంస్థ భాగస్వాముల భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ అడ్డంగా బుకాయిస్తున్నారు. తన తప్పేమీ లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భూములను కబ్జా చేయడానికి వ్యూహాత్మకంగా పక్క సర్వే నంబరులోని స్థలాలను కొన్నట్టు చూపించి.. ఆనక వాటి సర్వే నంబరు మార్చేసి, అగ్రి భూముల చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. ఇపుడేమో అవసలు అగ్రిగోల్డ్‌ భూములే కాదంటూ వింతగా వాదిస్తున్నారు. ఆనాడు మంత్రి హోదాలో ఆయన అధికారులపై ఒత్తిడి పెట్టి ఆగమేఘాలమీద ఉత్తర్వులు తెచ్చుకుని, స్వాధీన పత్రం కూడా పొంది కబ్జా చేసిన ఉదంతంలో ఎవరెవరి పాత్ర ఉందో బయటపడాల్సి ఉంది. రిజిస్ట్రేషన్‌ అధికారుల నుంచి సర్వేయరు, మండల రెవెన్యూ అధికారులు అంతా కళ్లు మూసుకుని మరీ ఆ భూములకు రిజిస్ట్రేషన్‌ చేసి జోగి కుటుంబానికి అప్పగించినట్టు చాలా స్పష్టంగా తేటతెల్లమవుతోంది. ఈ వ్యవహారంపై మన్ను తిన్న పాముల్లా ఎవరూ నోరు మెదపడం లేదు. బాధితులు ఫిర్యాదు చేసినా.. కీలకమైన దస్త్రం బయటకు రాకుండా తొక్కిపెట్టేశారు. 

ఇదేం వాదన..!

 •  మా కుటుంబం 2023లో పత్రికా ప్రకటన ఇచ్చి న్యాయవాది ద్వారా దస్తావేజులను పరిశీలన చేయించాక ఆ భూములను కొనుగోలు చేశాం.
 • 1969లో బొమ్మా వెంకటచలమారెడ్డి కొనుగోలు చేయగా.. ఆయన నుంచి పోలవరపు మురళీమోహన్‌ 2001లో కొన్నారు. ఈయన 2014లో మహాలక్ష్మి ప్రొపర్టీస్‌కు విక్రయించారు. 2023లో మా కుటుంబం కొనుగోలు చేసింది.
 • మండల సర్వేయరు నుంచి సర్వే ధ్రువీకరణపత్రం తీసుకుని తహసీల్దారు ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆధారంగానే పడిగపాటి దుర్గాప్రసాద్‌రెడ్డి (వైకాపా కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి బంధువు) తదితరులకు విక్రయించాం. 

ఇదీ అసలు వాస్తవం

 •  విజయవాడ గ్రామీణ మండలం ఆర్‌ఎస్‌ఆర్‌ నెంబరు 88లో పట్టాదారులుగా కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి సుబ్బరాజు ఉన్నారు. ఇందులో 4 ఎకరాలను 2653 దస్తావేజు నంబరు ద్వారా 1969లో బొమ్ము వెంకటచలమారెడ్డికి విక్రయించారు. ఈయన ఒక ఎకరం స్థలాన్ని 4166 దస్తావేజు నంబరు ద్వారా 2001లో పోలవరపు మురళీమోహన్‌కు విక్రయించారు. ఈయన 2014లో 4166 దస్తావేజు ద్వారా మహాలక్ష్మి ప్రొపర్టీస్‌ (అడుసుమిల్లి మోహన్‌రామదాసు)కు 3,800 గజాల స్థలం విక్రయించారు.
 •  ఇందులో 1,086 గజాల స్థలాన్ని దస్తావేజు నంబరు 7592 ద్వారా జోగి వెంకటేశ్వరరావుకు, 1,074 గజాలను 7589, 7590, 7591 దస్తావేజుల ద్వారా జోగి రాజీవ్‌ (రమేష్‌ తనయుడు)కు 2022లో (రమేష్‌ మాత్రం 2023లో అని చెబుతున్నారు) విక్రయించారు. ఈ దస్తావేజులన్నింటిలోనూ సర్వే నంబరు 88గానే స్పష్టంగా ఉంది.
 • ఇక్కడి నుంచే జోగి కుటుంబం మాయోపాయాన్ని అమలు చేసింది. తమ దస్తావేజుల్లో సర్వే నంబరు తప్పుగా నమోదైందని, స్వీయ సవరణ పేరుతో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్‌ సర్వే నంబరు 87గా మార్చుకుని మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ వివరాలను 2674, 2675, 2676 దస్తావేజుల్లో నమోదు చేయించారు. లింకు డాక్యుమెంట్లలో మాత్రం సర్వే నంబరు 88గానే ఉంది.
 • అక్రమ తతంగాన్ని పూర్తి చేశాక సర్వే నంబరు 87తో ఆ భూమిని వైకాపా కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు.
 • అంబాపురం రీసర్వే నంబరు 87లో అల్లూరి కృష్ణమూర్తికి అక్కడి నుంచి అవ్వా వెంకటశేషునారాయణరావుకు విక్రయించినట్టు ఉంది. వెంకటశేషునారాయణరావు కుటుంబ సభ్యులు అగ్రిగోల్డ్‌ భాగస్వాములుగా ఉన్నారు. రీసర్వే నంబరు 87లో ఉన్న 2,293.05 గజాల స్థలాన్ని జీవో ఎంఎస్‌ నంబరు 117 (తేదీ 2018 ఆగస్టు 14), జీవో ఎంఎస్‌నం.133 (తేదీ 2019 అక్టోబరు 17) ప్రకారం హోంశాఖ జప్తు చేసింది.
 • జోగి రమేష్‌ తనయుడు కొనుగోలు చేసింది 2022లో.. విక్రయించింది.. 2023లో. అంటే అంతకు ముందే రీసర్వే నంబరు 87లోని భూమి సీఐడీ జప్తులో ఉంది. 

 మంత్రిగా పని చేసిన మీకు అవగాహన లేదా? 

1927లో భూముల సమగ్ర సర్వే చేశాక ఇంతవరకు ఆ స్థాయిలో సర్వే చేయలేదు. ఒక భూమికి సర్వే నంబరు కేటాయించాక అది ఎన్ని చేతులు మారినా.. ఎన్ని క్రయవిక్రయాలు జరిగినా.. ఆ నంబరు మాత్రం మారదు. ఒకవేళ పంపకాలు జరిగితే.. సర్వే నంబరుతో సబ్‌ డివిజన్‌ చేస్తారు. వీటిని అడంగళ్, పహణీల్లో నమోదు చేస్తారు. 
 

- ఈ విషయాలన్నీ గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బందికి సైతం తెలుసు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండేళ్లపాటు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేసిన జోగి రమేష్‌కు ఈ విషయాలేవీ తెలియవా..

పోలీసులూ తొక్కిపెట్టారు..!

సీఐడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ భూములు ఆక్రమిస్తున్నారని అవ్వా వెంకటశేషునారాయణరావు చేసిన ఫిర్యాదును విజయవాడ రెండో పట్టణ పోలీసులు పక్కన పడేశారు. గ్రామీణ తహసీల్దారు పంపిన నివేదికనూ చూడలేదు. ఆ భూములవైపే వెళ్లలేదు. సీఐడీ అధికారులూ పట్టించుకోలేదు. జప్తు చేసిన ఆస్తులను కాపాడాల్సింది ఎవరు? రెవెన్యూ, పోలీసు, సీఐడీల విభాగాల మధ్య సమన్వయ లేమి సుస్పష్టం. ఇప్పటికీ ఆ భూముల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. 

ఒత్తిడితోనే...

వాస్తవానికి ఒక సర్వే నంబరులో ఉన్న భూమి.. మరో సర్వే నంబరులో ఉందని తేల్చే అధికారం సీసీఎల్‌ఏకే ఉంది. ఇలా చేయాలంటే సంబంధిత దస్త్రం సీసీఎల్‌ఏకు వెళ్లాలి. సహేతుక కారణాలు ఆధారసహితంగా ఉంటేనే సర్వే నంబరును మార్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. అన్ని లింకు డాక్యుమెంట్లలో సర్వే నంబరు 88 అనే ఉండగా.. సవరణ ద్వారా 87గా జోగి కుటుంబం మార్చేయడానికి దిగువస్థాయి రెవెన్యూ సిబ్బంది సహకారం అందించారు. మండల సర్వేయరు సర్వే చేసి నివేదిక ఇచ్చారని, దీనికి వీఆర్వో నివేదిక జత చేశారంటూ వీటి ఆధారంగా తహసీల్దారు లక్ష్మి 2023లో మార్చి 1న 87 సర్వే నంబరులోని స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చంటూ స్వాధీన పత్రం ఇచ్చారు. దీని ఆధారంగా నిషేధిత జాబితాలో ఉన్న అగ్రిగోల్డ్‌ భూమిని జోగి రమేష్‌ కుటుంబం స్వాధీనం చేసుకుంది. దీనికి పోలీసులూ సహకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామ రెవెన్యూ అధికారి, మండల సర్వేయరు, తహసీల్దారుపై విపరీతమైన ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. అదే మండలానికి చెందిన మరో తహసీల్దారు జాహ్నవి అవి అగ్రిగోల్డ్‌ భూములేనని 2024 మార్చి 30న నివేదిక ఇవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని