logo

జోగి కుటుంబ సభ్యులపై కేసు ?

అగ్రిగోల్డ్‌ భూములను ఆక్రమించి, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు తెగనమ్మిన వైనంపై విజయవాడ పోలీసులు దృష్టి సారించారు.

Published : 20 Jun 2024 05:17 IST

ఈనాడు - అమరావతి: అగ్రిగోల్డ్‌ భూములను ఆక్రమించి, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు తెగనమ్మిన వైనంపై విజయవాడ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే విజయవాడ గ్రామీణ తహసీల్దార్‌ ఇచ్చిన నివేదికను క్షుణ్నంగా పరిశీలించారు. జోగి కుటుంబం అక్రమాలపై నేడో, రేపో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఈ దిశగా పోలీసులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలో పలువురి పాత్ర ఉండడంతో మొత్తం వ్యవహారాన్ని న్యాయసలహా కోసం నివేదించనున్నారు. రెండో పట్టణ పోలీసులు విజయవాడ గ్రామీణం అంబాపురంలోని వివాదాస్పద భూములను బుధవారం పరిశీలించి.. అన్ని దస్త్రాలను నగర సీపీ రామకృష్ణ పరిశీలించారు. సర్వే నంబరు 87, 88లో ఎంత విస్తీర్ణం ఎవరెవరి చేతులు మారిందో దృష్టి సారించారు. జోగి కుటుంబ సభ్యులు కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సాయంతో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. న్యాయ సలహా తీసుకుని.. ఆమేరకు ముందుకు సాగాలని పోలీసులు యోచిస్తున్నారు.   

ముందస్తు ప్రణాళికలో భాగంగానే..: సర్వే నంబరు 87లో అగ్రిగోల్డ్‌ భూములు ఉన్నాయని తెలిసే జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు.. దీనికి సమీపంలో సర్వే నంబరు 88లో భూములు తొలుత కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ భూములు భవిష్యత్తులో వేలం వేస్తే.. వాటిని చౌకగా కొట్టేసేందుకు ప్రణాళిక రచించినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ మంత్రి రమేష్‌ కుటుంబీకుల నుంచి అన్నీ తెలిసే చైతన్యరెడ్డి బంధువులు కొనుగోలు చేశారా? అనేది తేలాల్సి ఉంది. సర్వే నంబరు 88కు గతంలో హక్కుదారులు అయిన... మురళీమోహన్, మోహన్‌రామ్‌దాస్‌లను విచారిస్తే అసలు గుట్టు వెలుగులోకి వచ్చే వీలుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని