logo

ఆశలన్నీ మీపైనే బాబు...

సీఐడీ విచారణ పేరుతో అసైన్డ్‌ రైతులకు ఏళ్ల తరబడి కౌలు మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదు. మరోవైపు పనుల్లేక వారు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు

Published : 20 Jun 2024 05:25 IST

మరో ఐదేళ్లు కౌలు పొడిగించాలని కోరుతున్న రైతులు

ఈ ఏడాదితో ముగియనున్న చెల్లింపులు
నాటి జగన్‌ సర్కారు హయాంలో కక్ష సాధింపు చర్యలు
అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన నేడు 

ఈనాడు, అమరావతి: రాజధాని రైతుల త్యాగాలను గత వైకాపా ప్రభుత్వం ఎగతాళి చేసింది. అమరావతి నిర్మాణానికి తమ విలువైన భూములిచ్చినందుకు వారిని వెంటాడి వేధించి.. నరకం చూపించింది. కౌలు చెల్లింపు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మౌలిక వసతుల అభివృద్ధి... తదితర అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. తమకు చట్టపరంగా రావాల్సిన వార్షిక కౌలు కోసం తీవ్రంగా పోరాడినా జగన్‌ ప్రభుత్వం కనికరించలేదు. ఆందోళనలపై ఉక్కుపాదం మోపి అణచివేసింది. ఇన్నాళ్లకు జన సునామీలో జగన్‌ సర్కారు కొట్టుకుపోయింది. తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని రైతుల్లో కొత్త ఆశలు పురివిప్పుతున్నాయి. అమరావతి రూపశిల్పి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వారిలో ఎనలేని ధైర్యం వచ్చింది. తమకు రెండు విడతల బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం చెల్లిస్తుందన్న నమ్మకంతో కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇక మంచి రోజులు వచ్చాయన్న ఆనందం వారిలో తొణికిసలాడుతోంది. 

కక్షతో కౌలు నిలిపేసిన జగన్‌

రైతులతో అప్పటి తెదేపా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏటా కౌలు మొత్తాన్ని మే నెలలో జమ చేయాల్సి ఉంది. 2019 నుంచి వైకాపా ప్రభుత్వం సక్రమంగా ఇవ్వలేదు. గతేడాదైతే మే నెలలో కౌలు నిమిత్తం రూ. 240 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పేరుకు ఉత్తర్వులిచ్చి.. నిధులను విడుదల చేయలేదు. సీఆర్డీఏ అధికారులు బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లోకి అప్‌లోడ్‌ చేసి చేతులు దులిపేసుకున్నారు. రైతు సంఘం తరఫున కోర్టుకు వెళ్లినవారికి మాత్రమే కౌలు చెల్లించారు. మిగిలినవారికి జగన్‌ మొండిచేయి చూపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో కౌలు బిల్లులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. పెరిగిన ధరలతో అష్టకష్టాలు పడుతున్న తమపట్ల జగన్‌ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వివక్ష చూపించి వేధించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్ల వద్ద పెరిగిన చెట్లను జేసీబీతో తొలగిస్తూ..

సీఐడీ విచారణ పేరుతో అసైన్డ్‌ రైతులకు ఏళ్ల తరబడి కౌలు మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం ఇవ్వలేదు. మరోవైపు పనుల్లేక వారు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 2014-19 మధ్య జరిగిన అసైన్డ్‌ భూముల లావాదేవీలపై జగన్‌ సర్కారు సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ వంకతో 2021 నుంచి వారికి కౌలు నిలిపేసింది. నాటి భూ సమీకరణలో ఆరు కేటగిరీలకు చెందిన 3,139 మంది 2,689 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. విచారణ పేరుతో తతంగం నడిపిన వైకాపా సర్కారు 2,472 మందిని అర్హులుగా గుర్తించింది. వీరికీ కౌలు ఎగ్గొట్టింది. తాను అధికారంలోకి వస్తే పట్టా రైతులతో సమానంగా ప్యాకేజీ ఇస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్‌.. సీఎం అయ్యాక గాలికొదిలేశారు. ఏళ్ల తరబడి సీఐడీ దర్యాప్తు పేరుతో ఎస్సీ రైతుల జీవనాధారాన్ని దెబ్బకొట్టారు. 

సచివాలయ టవర్ల నిర్మాణాల పిల్లర్ల దుస్థితి ఇదీ.. 

ఆ నష్టాన్ని భర్తీ చేస్తే రైతులకు ఊరట

గత తెదేపా ప్రభుత్వ హయాంలో భూసమీకరణ చేసినప్పుడు.. రిటర్నబుల్‌ ప్లాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. జీవనాధారం కోల్పోతున్నందున పదేళ్లపాటు కౌలు ఇస్తామని ఆనాడు చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. వార్షిక కౌలు గడువు ఈ ఏడాదితో ముగుస్తుంది. క్షేత్రస్థాయిలో చూస్తే ఇప్పటివరకు రైతులకు పూర్తిస్థాయిలో ప్లాట్లను కేటాయించలేదు. ఇచ్చినవారిలో చాలామందికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయలేదు. గత ఐదేళ్లలో వైకాపా పాలనలో అమరావతి ప్రగతి కుంటుపడింది. ఈ నేపథ్యంలో మరో ఐదేళ్లపాటు కౌలు చెల్లింపును పొడిగించాలని రాజధాని రైతులు కోరుతున్నారు. వైకాపా చేసిన నష్టం నుంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

గతేడాది కౌలును వారం రోజుల్లో చెల్లిస్తామని ఇటీవల తనను కలిసిన రాజధాని రైతులకు పురపాలకశాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఇవ్వాల్సిన మొత్తం విడుదలకూ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలుకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపు కోసం సీఆర్డీఏ నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలను కోరింది. ఏటా కౌలు మొత్తాన్ని 10 శాతం పెంచేలా అప్పట్లోనే తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జరీబు భూములకు ఎకరాకు రూ. 95 వేలు, మెట్ట భూములకు ఎకరాకు రూ. 57 వేల చొప్పున మొత్తం రూ. 300 కోట్లు చెల్లించేందుకు సీఆర్డీఏ ప్రతిపాదనలు పంపింది. బడ్జెట్‌ ఆమోదం తరువాత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని