logo

దుర్గగుడి ఈవో, ఏఈవోల మధ్య గొడవ

ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో గురువారం హుండీ కానుకల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఈవో రామారావు, ఏఈవో సుధారాణి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది.

Published : 21 Jun 2024 03:41 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో గురువారం హుండీ కానుకల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఈవో రామారావు, ఏఈవో సుధారాణి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఉద్యోగులందరూ హుండీ ఆదాయం లెక్కిస్తున్న సమయంలో ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు పెద్దగా అరుచుకున్నట్లు సమాచారం. గత ఈవో భ్రమరాంబ బదిలీ అయిన సమయంలో ఆలయ ఆభరణాలను ప్రస్తుత ఈవో     రామారావుకు అప్పగించారు. అయితే ఆ సమయంలో రిజిస్టర్‌ ఆధారంగా అప్పజెప్పి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంలోనే తాజాగా ఈవో, ఏఈవోల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. వాస్తవంగా భ్రమరాంబ బదిలీ అయిన సమయంలో ఆభరణాలన్నింటినీ కొత్తగా వచ్చిన ఈవో సమక్షంలో లెక్కించి అప్పగించాల్సి ఉంది. కాని అలా జరక్కుండా..రిజిస్టర్‌ ద్వారానే అప్పగించడంతో అన్నీ సరిగా ఉన్నాయో..లేవో అనే అనుమానం ఏఈవో సుధారాణి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులకు తాను ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పడంతో ముందుగా ఆభరణాలన్నింటినీ లెక్కించి..ఆతరువాత ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని ఈవో అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెబుతున్నారు. ఆభరణాలు తిరిగి లెక్కించేందుకు దేవాదాయ శాఖ నుంచి అధికారిని పిలిపించిన తరువాత రిజిస్టర్‌ ఆధారంగా పరిశీలన చేద్దామని ఈవో రామారావు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే సుధారాణి మాత్రం ఉన్నతాధికారుల దృష్టికి కచ్చితంగా తీసుకెళతానని..గత ప్రభుత్వంలో తాము చెప్పేందుకు ప్రయత్నిస్తే తమపైనే తిరిగి కక్ష సాధింపులకు దిగేవారన్నారు. అందుకే తాము చెప్పలేకపోయామని.. ప్రస్తుతం ప్రభుత్వం మారినందున ఈవిషయాన్ని నేరుగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు, మంత్రులకు ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారని తెలిసింది. అయితే కానుకల లెక్కింపు సమయంలో ఇలా ప్రవర్తిస్తే దేవస్థానం పరువు పోతుందని, తొలుత పరిశీలన చేసి..తరువాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయమని ఈవో మరోసారి సూచించినట్లు చెబుతున్నారు. దీనిపైనే ఒకరిపై ఒకరు అరుచుకున్నట్లు సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని