logo

పీఎన్‌బీఎస్‌ చుట్టూ ప్రహరీ నిర్మాణం

విజయవాడలోని పీఎన్‌బీఎస్‌ చుట్టూ ప్రహరీపై అధికారులతో మాట్లాడి నిర్మిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ను గురువారం రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తనిఖీ చేశారు.

Published : 21 Jun 2024 03:44 IST

రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి 
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ బస్‌స్టేషన్‌ 

విజయవాడలోని పీఎన్‌బీఎస్‌ చుట్టూ ప్రహరీపై అధికారులతో మాట్లాడి నిర్మిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ను గురువారం రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తనిఖీ చేశారు. ముందుగా సిటీబస్‌ పోర్ట్‌ను పరిశీలించి.. అక్కడ ఉన్న ఆర్టీసీ తొలితరం బస్సు డెక్కన్‌క్వీన్‌ను ఎక్కి పరిశీలించారు. అనంతరం ప్లాట్‌ఫాంలను చూశారు. ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. సిటీ బస్సులను ఎక్కి బస్సుల కండిషన్‌ను పరిశీలించారు. అమరావతి బస్సుల్లో ప్రయాణించే వారితో అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే అంశంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. హామీని అమలు చేయాలని కోరారు. డొక్కు బస్సులను మార్చాలని, సంఖ్యను కూడా పెంచాలని ప్రయాణికులు మంత్రి దృష్టికి తెచ్చారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రయాణికులకు మంత్రి తెలిపారు. బస్టాండ్‌లోని డార్మెటరీలోకి వెళ్లిన మంత్రి అక్కడ సోఫాలు, మంచాలు మురికి పట్టి ఉండటాన్ని చూసి వెంటనే మార్చాలని ఆదేశించారు. ఆర్టీసీ కార్గోలో పార్సిళ్లను పరిశీలించి వాటిపై బార్‌కోడ్‌ ద్వారా వేగంగా డెలివరీ, బుకింగ్‌ చేసే సదుపాయాలను కల్పించాలన్నారు. 

సమస్యల నివేదిక.. ఆర్టీసీ ఒప్పంద పారిశుద్ధ్య సిబ్బంది తమకు గుత్తేదారు సక్రమంగా జీతాలు చెల్లించడంలేదని, తమ ఇంటి నుంచి బస్టాండ్‌కు వచ్చి విధులు నిర్వహించాలంటే బస్‌పాస్‌కు నెలకు రూ. 1,500 వరకు ఖర్చవుతోందని తెలిపారు. త్వరలో మహిళలకు ఉచితబస్సు సౌకర్యం కల్పిస్తామని తద్వారా నెలకు మీకు రూ. 1,500 మిగులుతాయన్నారు. అనంతరం సమాచార కేంద్రం పక్కన ఉన్న దుకాణం వద్దకు చేరుకుని తినుబండారాలను పరిశీలించి నాణ్యమైనవి అమ్ముతున్నారా? లేదా అని పరిశీలించారు. పప్పుచెక్క ప్యాకెట్‌ను కోనుగోలు చేసి తిని దుకాణదారునికి నగదు చెల్లించారు. ఒకటో నెంబరు ప్లాట్‌ఫాం వద్దనున్న మూత్రశాలను పరిశీలించిన మంత్రి అక్కడ సిబ్బందితో నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరైవల్‌ బ్లాక్‌లోని హోటల్‌ను పరిశీలించిన మంత్రి అక్కడ ఆహార నాణ్యతను పరిశీలించారు. గ్లౌజ్, చెప్పులు వేసుకోవాలని సిబ్బందికి సూచించారు. తనిఖీలో మంత్రి వెంట విజిలెన్స్‌ సెక్యూరిటీ ఏడీ శోభామంజరి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ గోపీనాథ్‌రెడ్డి, ఆర్‌ఎం ఎంవై దానం, డీసీటీఎం (ఓ అండ్‌ సీ) సుబ్బారెడ్డి, డీసీటీఎంలు జాన్‌ సుధాకర్, బషీర్‌ అహ్మద్‌ ఆర్టీసీ యూనియన్‌ కార్మికులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని