logo

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు.

Published : 21 Jun 2024 03:46 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న వివిధ సమస్యలపై ఎయిర్‌పోర్టు, రెవెన్యూ, సీఆర్‌డీఏ, పంచాయతీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు ఇతరశాఖల అధికారులతో జేసీ గీతాంజలిశర్మతో కలిసి కలెక్టర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో భాగంగా విమానాశ్రయం అభివృద్ధికి భూములిచ్చిన ప్రతిఒక్క రైతు, ఇళ్లు, లేఔట్‌లో ప్లాట్లు కోల్పోయిన బాధితులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి చెందిన దావాజీగూడెం, అల్లాపురం, రాజీవ్‌నగర్‌ నివాసితులకు చిన్నఅవుటపల్లిలో ఇప్పటికే స్థలాలు ఇచ్చామని..కొంతమందికి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన రూ.9లక్షల నగదు చెల్లించామన్నారు. మిగిలిన వారికి వెంటనే నగదు విడుదల చేయనున్నట్లు తెలిపారు. విమానాశ్రయ ప్రహరీ వెంట అనధికార కట్టడాలు, డ్రెయినేజీ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్లాట్లు కోల్పోయిన బాధితులకు అజ్జంపూడిలో ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. చిన్నఅవుటపల్లిలోని నిర్వాసితుల లేఔట్‌ వద్ద వసతుల కల్పనతో పాటు ఏలూరు కాలువపై వంతెన నిర్మించనున్నట్లు తెలిపారు. విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంతరెడ్డి, జనరల్‌ మేనేజర్‌ సివిల్‌ కే.రామాచారి, ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్‌ పవన్‌కుమార్, సీఆర్డీఏ తహసీల్దార్‌ పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని