logo

జోగి రమేష్‌ పేరు చెప్పి రూ.15 లక్షల టోకరా

మంత్రి జోగి రమేష్‌తో చెప్పించి గృహ నిర్మాణ శాఖలో సహాయ ఇంజినీరు ఉద్యోగం వేయిస్తానంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.15 లక్షలు స్వాహా చేసిన వైకాపా నాయకుడు మోర్ల మహీధర్‌పై కేసు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 21 Jun 2024 06:13 IST

ఉద్యోగం ఇప్పిస్తానంటూ వైకాపా నాయకుడి మోసం
కేసు నమోదు చేసిన పోలీసులు

పెనమలూరు, న్యూస్‌టుడే: మంత్రి జోగి రమేష్‌తో చెప్పించి గృహ నిర్మాణ శాఖలో సహాయ ఇంజినీరు ఉద్యోగం వేయిస్తానంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.15 లక్షలు స్వాహా చేసిన వైకాపా నాయకుడు మోర్ల మహీధర్‌పై కేసు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. ఉప్పాల అనిల్‌కుమార్‌ పెనమలూరు మండలం చోడవరం నివాసి కాగా.. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం  చేస్తుంటాడు. గత ఏడాది జూన్‌లో మచిలీపట్నంలో జరిగిన ఓ వైకాపా నేత సంస్మరణ సభకు హాజరయ్యాడు. అక్కడ పోరంకిలో నివసించే వైకాపా నాయకుడు మోర్ల మహీధర్‌.. అనిల్‌కుమార్‌కు పరిచయమయ్యాడు. ఇద్దరిదీ ఒకే కులం అంటూ మాటలు కలిపారు. ఎన్నాళ్లు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తావంటూ అంటూ అప్యాయత ఒలకబోశాడు. మంత్రి జోగి రమేష్‌ తనకు బాగా పరిచయస్థుడని, అతడి ద్వారా ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించానని, నీకు కూడా గృహ నిర్మాణ శాఖలో సహాయ ఇంజినీరు కొలువు వచ్చేలా చేస్తానని భరోసా ఇచ్చాడు. దీనికి రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలుపగా.. ఆ మాటలు నమ్మిన బాధితుడు అనిల్‌కుమార్‌ క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ రుణాల ద్వారా విడతల వారీగా మహిధర్‌ ఖాతాకు రూ.15 లక్షలు పంపాడు. మిగతా సొమ్ము కూడా త్వరలో పంపితే ఉద్యోగం చేతిలో ఉంటుందంటూ ఊదరగొట్టాడు. కొన్నాళ్ల తర్వాత నుంచి మహీధర్‌  ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అనిల్‌కుమార్‌ ఆరా తీయగా అతడు పెద్ద మోసగాడని తెలుసుకున్నాడు. అప్పట్నించి తన సొమ్ము ఇవ్వాలంటూ పలుసార్లు మహీధర్‌ను ఒత్తిడి చేయగా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు. ఇటీవల అనిల్‌కుమార్‌కు బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో మానసికాందోళనకు గురై నిందితుడిపై మరింత ఒత్తిడి పెచ్చాడు. తన వెనుక మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారంటూ మహీధర్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు అనిల్‌కుమార్‌ గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు మహీధర్‌పై మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని