logo

వైకాపా నేతలపై చర్యలు తీసుకోండి

వైకాపా నాయకులు, వార్డు ఇన్‌ఛార్జులు, గృహ సారథులు, కన్వీనర్లు మమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని.. తమను నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గుడివాడలోని 36 వార్డులకు చెందిన వాలంటీర్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 21 Jun 2024 03:51 IST

గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ వాలంటీర్లు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు, వార్డు ఇన్‌ఛార్జులు, గృహ సారథులు, కన్వీనర్లు మమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని.. తమను నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గుడివాడలోని 36 వార్డులకు చెందిన వాలంటీర్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. వాలంటీరు ఉద్యోగం ఇచ్చేదీ మేమే.. ఏప్రిల్, మే నెలల జీతాలు ఒకేసారి ఇచ్చేస్తామని, అధికారంలోకి రాకుంటే పెద్ద మొత్తంలో నగదు ఇస్తామని’’ కల్లబొల్లి మాటలు చె)ప్పి బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయనివారిపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరించడం, ఇంటికొచ్చి రాజీనామా చేసేవరకూ కదలకపోవడం చేశారని అన్నారు. వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడి రాజీనామా చేసి రెండు నెలల జీతం పోగొట్టుకున్నామని, ప్రస్తుతం ఉపాధి లేక రోడ్డున పడ్డామని వాపోయారు. తమ ఉద్యోగాలు పునరుద్ధరించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తమను నమ్మించి మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితోపాటు వైకాపా నాయకులు కనిపిస్తే నిలదీస్తామని, తమకు న్యాయం జరిగేవరకు ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో సుమారు 50 మంది మాజీ వాలంటీర్లున్నారు.


వైకాపా నాయకులపై కేసులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు తమను వేధించారని గుడివాడ పురపాలక సంఘంలోని 36 వార్డుల వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వైకాపా నాయకులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడంతో సెక్షన్‌ 447, 506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని