logo

జోగి కబ్జా నిజం!

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబం సాగించిన అగ్రి గోల్డ్‌ భూమి కబ్జా వ్యవహారంలో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది మెడకు ఉచ్చు బిగుస్తోంది. తొలుత వీరిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

Published : 21 Jun 2024 07:32 IST

కలెక్టరుకు తహసీల్దారు నివేదిక
ముగ్గురు రెవెన్యూ సిబ్బందిపై వేటుకు సిఫారసు
ఈనాడు - అమరావతి

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబం సాగించిన అగ్రి గోల్డ్‌ భూమి కబ్జా వ్యవహారంలో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది మెడకు ఉచ్చు బిగుస్తోంది. తొలుత వీరిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సీఐడీ (హోంశాఖ) జప్తు చేసిన భూములను సర్వే చేసి ప్రైవేటు భూమిగా ధ్రువీకరించడం, సర్వే నంబరు మార్చేసి స్వాధీన పత్రం జారీ చేయడంలో అక్రమాలు జరిగాయని విజయవాడ గ్రామీణ తహసీల్దారు జాహ్నవి.. జిల్లా కలెక్టరు ఎస్‌.ఢిల్లీరావుకు నివేదిక అందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మండల డిప్యూటీ తహసీల్దారు విజయ్‌కుమార్, మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్‌ దేదీప్యలపై సస్పెన్షన్‌ వేటు పడనుంది. గ్రామ వీఆర్వో శ్రీనివాస్‌ పాత్ర లేదని తహసీల్దారు చెబుతున్నారు. కానీ.. సర్వే నంబరు 88లో భూమి లేదని, సర్వే నంబరు 87లోనే ఉందని నివేదించిన తొలి వ్యక్తి వీఆర్వోనే. మొదట గ్రామ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి సిఫారసుతోనే సర్వే నంబరు మార్చేశారు. ఇంత గోల జరుగుతున్నా.. కొనుగోలు చేసిన వ్యక్తులు మాత్రం బయటకు రావడం లేదు. వీరికి వాస్తవంగా విక్రయించారా? లేక మాజీ మంత్రి బినామీలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తహసీల్దారు బాధ్యత? 

ఆ భూమిని జోగి కుటుంబానికి అక్రమంగా కట్టబెట్టేసిన విషయమై ప్రస్తుత తహసీల్దారు జాహ్నవి పోలీసులకు పంపిన నివేదికలో చర్యలకు సిఫారసు చేశారు. వాస్తవానికి 2023 మార్చిలో సర్వే చేసిన సమయంలో కూడా ఆమే తహసీల్దారుగా ఉన్నారు. ఆమెకు తెలియకుండా ఎఫ్‌ లైన్‌ నివేదిక, భూస్వాధీన ఉత్తర్వులు జారీ అయ్యాయని అంటున్నారు. దీంతోనే మండల డిప్యూటీ తహసీల్దారు, మండల సర్వేయరు, గ్రామ సర్వేయరుపై చర్యలకు సిఫారసు చేశారు. జాహ్నవికి ముందు తహసీల్దారుగా లక్ష్మి, అంతకుముందు శ్రీనివాసనాయక్‌ పని చేశారు. జాహ్నవి తహసీల్దారుగా ఉన్న సమయంలో ఎఫ్‌ఎల్‌ ఉత్తర్వులు 2023 మార్చి 1న జారీ అయ్యాయి. ఈ విషయం తనకు తెలియదని ఆమె అంటున్నారు. కానీ. గ్రామీణ మండలంలో పని చేసిన తహసీల్దార్లు అందరూ వైకాపా నాయకులతో అంటకాగినవారే. ఎన్‌జీటీ ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా మట్టిని అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇచ్చినవారే. ఈ భూమి వ్యవహారంలో ప్రస్తుత తహసీల్దారు బాధ్యత ఏమిటన్నది తేలాల్సి ఉంది. 

ముందుకు సాగని దర్యాప్తు!

గ్రామీణ తహసీల్దారు జాహ్నవి గత జనవరిలోనే ఆమె ఫిర్యాదు చేయగా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. సీఐడీ జప్తు చేసిన భూమినే కబ్జా చేశారని చెప్పినా వెంటనే పోలీసులు స్పందించకపోవడానికి కారణం జోగి రమేష్‌ ఒత్తిడేనని తెలుస్తోంది. నాటి కమిషనర్‌ నుంచి ఆదేశాలు రాకపోవడంతోనే కేసు నమోదు చేయకుండా పక్కన పడేశారని సమాచారం. తహసీల్దారు ఇచ్చిన నివేదిక కవర్‌ తెరిచి చూడలేదంటే ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రెండో పట్టణ సీఐ గణేష్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. అసలు అలాంటి ఫిర్యాదు అందలేదని బుకాయించడం గమనార్హం. చివరకు సీపీ రామకృష్ణ జోక్యంతో ఆ స్థలాన్ని పరిశీలించారు. జోగి రమేష్‌ తనయుడు రాజీవ్, ఆయన బాబాయ్‌ వెంకటేశ్వరరావులపై కేసు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు. ఆ భూమిని కొనుగోలు చేసిన కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి బంధువులపై కూడా కేసు పెడతారా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై న్యాయ సలహాలు తీసుకునేందుకు పోలీసులు వేచి చూస్తున్నట్టు తెలిసింది. 


అంత వేగంగానా...?

సాధారణంగా భూముల సర్వే కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే.. నెలల తరబడి నిరీక్షించాల్సిందే. రుసుములు చెల్లించినా సర్వేయర్ల కొరత పేరు చెప్పి కాలయాపన చేస్తుంటారు. లంచాలు ముడితే మాత్రం వేగంగా పనైపోతుంది. వివాదాస్పద భూముల సర్వేల్లో ఎకరానికి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు సర్వేయర్లు డిమాండ్‌ చేస్తున్నారు. విలువైన భూముల్లో ఇంకా ఎక్కువే వసూలు చేస్తున్నారు. అంబాపురంలో జోగి రమేష్‌ తనయుడు రాజీవ్, ఆయన బాబాయి జోగి వెంకటేశ్వరరావు సర్వే నంబరు 88లో కొనుగోలు చేసినట్టు చెబుతున్న భూమిని స్వీయ సవరణ పేరుతో సర్వే నంబరు 87లోకి మార్చేందుకు దరఖాస్తు చేసిన వెంటనే సర్వే చేసేశారు. సర్వే నెంబరు 88లో భూమి లేదని, 87లో ఉందని నివేదిక ఇచ్చారు. అప్పటికే ఈ భూమిని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులుగా గుర్తించి సీఐడీ జప్తు చేసిన విషయం సిబ్బందికి తెలియదా? తహసీల్దారు సైతం భూ స్వాధీన పత్రం జారీ చేయడం వెనుక నాటి మంత్రి జోగి రమేష్‌ తన అర్థ, అంగ, అధికార బలాన్ని ప్రయోగించినట్టు స్పష్టమవుతోంది. ఆ వెంటనే 2023లోనే భవానీపురం ప్రాంత కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి బంధువులకు ఆ భూమిని విక్రయించి, రిజిస్ట్రేషన్‌ చేసినట్టు చూపించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని