logo

రైతులకు రూ.లక్షల్లో కుచ్చు టోపీ

గుడివాడ రైతు బజారు ఎస్టేట్‌ అధికారి ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఎరగా చూపి రూ.లక్షల్లో వసూలు చేసి తమను నట్టేట ముంచారని పలువురు రైతులు శుక్రవారం గుడివాడ టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు.

Published : 22 Jun 2024 05:09 IST

ఆన్‌లైన్‌ వ్యాపారం పేరుతో రైతు బజారు ఈవో టోకరా

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ రైతు బజారు ఎస్టేట్‌ అధికారి ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ఎరగా చూపి రూ.లక్షల్లో వసూలు చేసి తమను నట్టేట ముంచారని పలువురు రైతులు శుక్రవారం గుడివాడ టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం.. మీరు సంపాదించిన సొమ్మును ఈఎస్‌పీఎన్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో పెట్టుబడి పెడితే జీవితాంతం లాభాలు పొందొచ్చని పట్టణంలోని రైతు బజారులో కూరగాయలు అమ్ముకునే రైతులకు ఈవో ఓగిరాల శ్రీకాంత్‌ నమ్మబలికారు. తనతోపాటు అతని స్నేహితులు శ్యామ్, ప్రదీప్‌ను తీసుకొచ్చి మీరు చెల్లించిన మొత్తం 20 నెలల్లో పూర్తిగా వెనక్కి వస్తుంది.. ఆ తర్వాత వచ్చిందంతా లాభమే అంటూ పలు పత్రాలతో చూపించి ఆశ కల్పించారు. దీంతో మద్దినేని నరసింహారావు, ముక్కపాటి ప్రతాప్, శివనాగరాజులకు వారు రూ.1.24 లక్షలు, రూ.3.46 లక్షలు, రూ.7.6 లక్షల స్కీములను చూపారు. దీంతో రైతులు తమ వద్ద గల సొమ్ముతోపాటు మరికొంత అప్పు చేసిమరీ 2021లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కొంత కాలం వారు కట్టిన సొమ్ములకు చెల్లించాల్సింది చెల్లించి, మధ్యలో ఆపేశారు. అదేమని అడిగితే వస్తాయని నమ్మబలికారు. గట్టిగా అడిగితే తమ వ్యాపారంపై ప్రభావం పడుతుందని ఆగారు. కానీ వారి డబ్బులు ఎప్పటికీ రాకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. వారిలో ప్రతాప్‌ మాత్రమే రూ.16.60 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా సుమారు 12 మందికిపైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముగ్గురు ఫిర్యాదు చేయగా టూటౌన్‌ సీఐ ఎం.నాగ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని