logo

జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న డయేరియా

జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పట్టణ శివారు సహా పలు గ్రామాల్లో డయేరియా లక్షణాలతో ఇద్దరు మృతి చెందడంతో పాటు పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Published : 22 Jun 2024 05:15 IST

నియోజకవర్గంలో పెరుగుతున్న బాధితులు
అప్రమత్తమైన అధికార యంత్రాంగం

ప్రభుత్వాసుపత్రిలో బాధితులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పట్టణ శివారు సహా పలు గ్రామాల్లో డయేరియా లక్షణాలతో ఇద్దరు మృతి చెందడంతో పాటు పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గడిచిన మూడు రోజుల్లో ప్రభుత్వాసుపత్రి సహా పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో నమోదవుతున్న వాంతులు, విరోచనాల కేసుల్లో సుమారు 30 మంది వరకూ ఇన్‌పేషెంట్లుగా చేరారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో ఇప్పటికే 50కి పైగా ఓపీ కేసుల్లో డయేరియా లక్షణాలున్న రోగులు ఉండగా.. ప్రస్తుతం ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో షేర్‌మహ్మద్‌పేట, గండ్రాయి, అనుమంచిపల్లి, దేచ్‌పాలెం, మక్కపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జయంతిపురం తదితర గ్రామాల వారున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఆసుపత్రుల్ని సందర్శించి విషయాన్ని డీఎంహెచ్‌ఓ సుహాసినికి తెలియజేయడంతో ఆమె అర్ధరాత్రి తర్వాత వచ్చి ఆసుపత్రిలో ఉన్న కేసులు, ఇతర వివరాలను సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చి వెళ్లారు. 

 ప్రభుత్వాసుత్రిలో రోగులను పరామర్శిస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, డీఎంహెచ్‌ఓ సుహాసిని

కలుషిత నీరు, ఆహార కాలుష్యం వల్లే 

నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి శుక్రవారం కూడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సీజన్‌ మారడంతో సరఫరా అయ్యే కలుషిత నీరు, ఆహార కాలుష్యం వల్ల వచ్చే కేసులే అధికంగా కనిపిస్తున్నాయని ప్రభుత్వ వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం మరోసారి జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్‌ఓ పరిస్థితి అదుపులో ఉందని, షేర్‌మహ్మద్‌పేట తదితర గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని , ప్రజలు, స్థానిక సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య తన ప్రమాణస్వీకారం అనంతరం విజయవాడలో చికిత్స పొందుతున్న జగ్గయ్యపేట ప్రాంత రోగుల్ని కలిసి పరామర్శించి  భరోసా ఇచ్చారు. జగ్గయ్యపేట పురపాలక సంఘం సహా ప్రభావిత పంచాయతీల అధికారులు నీళ్ల ట్యాంకుల్ని శుభ్రం చేయించడం, బ్లీచింగ్‌ చల్లించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు దండోరా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

ప్రత్యేక వైద్య శిబిరాలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట ప్రాంతంలో ప్రబలుతున్న డయేరియా నిర్మూలనకు అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు. మూడు రోజులుగా జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి సహా పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో పెరుగుతున్న వాంతులు, విరేచనాల కేసుల విషయమై ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కి తెలియజేయడంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డీఎంహెచ్‌ఓ సుహాసిని సాయంత్రం వరకూ జగ్గయ్యపేటలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు. సాయంత్రం కలెక్టర్‌ డిల్లీరావు స్వయంగా జగ్గయ్యపేటకు వచ్చి తాతయ్యతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం 12 కేసులు నమోదు కాగా.. వారిలో ముగ్గురిని విజయవాడకు పంపినట్లు తెలుసుకున్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉన్న కేసుల విషయంపైనా ఆయన ఆరా చేశారు. మూడు రోజులుగా నియోజకవర్గంలోని 12 గ్రామాల నుంచి నమోదవుతున్న కేసుల గురించి తాతయ్య అధికారులకు వివరించారు. ఇప్పటికే అవసరమైన చోట ప్రత్యేక శిబిరాలు పెట్టినట్లు వైద్యాధికారులు తెలిపారు. 

గ్రామీణ వైద్యులు ఇన్‌పేషెంట్లను చేర్చుకోవద్దు

గ్రామీణ వైద్యులు కేవలం ప్రాథమిక చికిత్స చేయడం తప్ప నర్సింగ్‌హోంల తరహాలో ఇన్‌పేషెంట్లను చేర్చుకొని వైద్యం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ ఢిల్లీరావు హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్‌ఎంపీలు తమ వద్దకు వచ్చే తీవ్రమైన రోగ లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వాసుపత్రికి పంపాలని సూచించారు. రోగలక్షణాలకు కారణమైన అంశాలను పరిశీలించారు. సమస్య తీవ్రంగా ఉన్న షేర్‌మహ్మద్‌పేట గ్రామానికి వెళ్లి అక్కడి నీటి సరఫరా వనరులను పరిశీలించారు. స్థానిక సీపీఎం నాయకులు అధికారులకు దీర్ఘకాలంగా ఉన్న నీటి కాలుష్యం సమస్యను వివరించారు. సమస్య పూర్తిగా సమసిపోయే వరకూ సంబంధిత శాఖల అధికారులు అందరూ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ తెలిపారు.

బాక్టీరియానా..  వైరసా?

ప్రస్తుతం డయేరియా ఒకే కారణంగా ప్రబలే అంటువ్యాధి కాదని డీఎంహెచ్‌ఓ సుహాసిని తెలిపారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను వాకబు చేయగా కలుషిత నీరు, కలుషిత ఆహారం, పానీపూరీల వంటి చిరుతిండ్ల వల్ల రోగ లక్షణాలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ఆహార, నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని, అది బాక్టీరియానా, వైరసా అనే విషయం తెలిస్తే మెరుగైన చర్యలకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని