logo

జీవన విధానంలో యోగా మిళితం కావాలి

ప్రజల జీవన విధానంలో యోగా తప్పనిసరిగా మిళితం కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.

Published : 22 Jun 2024 05:18 IST

మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర, వేదికపై ఎస్పీ అస్మి, కలెక్టర్‌ బాలాజీ 

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రజల జీవన విధానంలో యోగా తప్పనిసరిగా మిళితం కావాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ నయీమ్‌అస్మి, జిల్లా అధికారులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కోసం మన పూర్వీకులు అందించిన గొప్ప వరం యోగా అని పేర్కొన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. శరీరాన్ని, మనసును అసుసంధానం చేసే అద్భుత ప్రక్రియ అన్నారు. యోగాను విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందన్నారు. కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనశైలికి యోగాను మించిన ఉత్తమ మార్గం లేదన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించాలని కోరారు. ఎస్పీ నయీమ్‌అస్మి మాట్లాడుతూ ఆధునిక యుగంలో యోగా ప్రాముఖ్యం మరింత పెరిగిందన్న విషయాన్ని గుర్తించి..దానిని ఆరోగ్య సాధనంగా మలచుకోవాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు, ఏఎస్పీలు జి.వెంకటేశ్వరరావు, ఎస్‌వీడీ ప్రసాద్, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, చీఫ్‌ కోచ్‌ ఝూన్సీ, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కల్పన, పలువురు జిల్లా, డివిజన్‌ అధికారులతో పాటు పలువురు యోగసాధకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముదిగొండ శాస్త్రి వాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో పాల్గొన్నవారికి, యోగ శిక్షకులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని