logo

ప్రభుత్వం మారింది.. పద్ధతులు మారాలి

ప్రభుత్వం మారింది. ప్రజా సమస్యలపై సత్వరం స్పందించి పరిష్కరించే పాలన వచ్చిందని అధికార యంత్రాంగం మర్చిపోవద్దు.

Published : 24 Jun 2024 04:20 IST

ప్రజారోగ్యం విషయంలో తప్పుల్ని ఉపేక్షించం
వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ హెచ్చరిక

మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్, వేదికపైఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ‘ప్రభుత్వం మారింది. ప్రజా సమస్యలపై సత్వరం స్పందించి పరిష్కరించే పాలన వచ్చిందని అధికార యంత్రాంగం మర్చిపోవద్దు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చే ప్రజారోగ్యం విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు’.. అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా ప్రబలి పలువురు మృతి చెందగా.. కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో స్వయంగా పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. నాలుగు రోజుల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సిబ్బందిని అభినందిస్తూనే.. ముందుగా జాగ్రత్త పడితే ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదని, ఇకనైనా ఆ పంథాను వీడాలని సూచించారు. స్థానిక సంస్థల వైఫల్యాలు కూడా తన పరిశీలనలో కనిపించాయని, వైద్యారోగ్య సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యనిస్తున్న నేపథ్యంలో ఏయే అవసరాలు ఉన్నాయో అడిగి సమకూర్చుకోవాలని సూచించారు. వర్షాల సీజన్‌ మొదలైన నేపథ్యంలో రోగాలు ప్రబలే పరిస్థితులను ముందుగానే పసిగట్టి రాకుండా ఆపడంలోనే మన విజయం ఉందన్నారు. శ్రీరాంతాతయ్య మాట్లాడుతూ మంత్రి వెంటనే స్పందించడంతో రాష్ట్ర యంత్రాంగం అంతా దృష్టి సారించి నాలుగు రోజుల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగరని పేర్కొన్నారు.

  • షేర్‌మహ్మద్‌పేటలో తాగునీటి వనరుగా ఉన్న బావిలోకి మురుగు చేరుతోందని, మక్కపేటలో కలుషిత నీరు కారణమని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు గుర్తించి అరికట్టాలన్నారు.
  • వైద్యాధికారి అనిల్‌కుమార్, మాజీ వైస్‌ ఛైర్మన్‌ కుమార్‌రాజా, వార్డు నాయకుడు సిమసర్తి రామారావు తదితరులు మాట్లాడుతూ నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు అధిగమించకపోతే అనేక సమస్యలు పునరావృతం అవుతాయని తెలిపారు. సమావేశంలో జేసీ సంపత్‌కుమార్, డీఎంహెచ్‌వో సుహాసిని, డీసీహెచ్‌ఎస్‌ బీసీఎన్‌ నాయక్, ఆర్డీవోలు రవీంద్రరావు, మాధవి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ ఛైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని