logo

జగన్‌‘కోట’ రహస్యం..!

తానో పేదల ప్రతినిధినంటూ.. పెత్తందారులతో యుద్ధం చేస్తున్నానంటూ.. వేదికలపై బాకాలూదుకున్న గత ముఖ్యమంత్రి జగన్‌ బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రుషికొండపై.. వందల కోట్లతో తాను నివాసం ఉండేందుకు ఓ పెద్ద ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌..

Updated : 24 Jun 2024 07:50 IST

రూ.110 కోట్ల స్థలాల్లో వైకాపా ప్యాలెస్‌లు
ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా కట్టడాలు
మచిలీపట్నంలో 90 శాతం పూర్తయిన భవనం
విజయవాడ నగరపాలక స్థలంలో భారీ నిర్మాణం

బందరులో పూర్తయిన నిర్మాణం..

ఈనాడు, అమరావతి విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: తానో పేదల ప్రతినిధినంటూ.. పెత్తందారులతో యుద్ధం చేస్తున్నానంటూ.. వేదికలపై బాకాలూదుకున్న గత ముఖ్యమంత్రి జగన్‌ బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రుషికొండపై.. వందల కోట్లతో తాను నివాసం ఉండేందుకు ఓ పెద్ద ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. అదే మాదిరిగా తన పార్టీకి చెందిన కార్యాలయాలన్నీ ఉండాలని.. తన అనుచర గణానికి ఐదేళ్ల కిందట గద్దెనెక్కినప్పుడు హుకుం జారీ చేశారు. ప్రతిచోటా వైకాపా కార్యాలయాల పేరుతో ప్యాలెస్‌ల నిర్మాణానికి పథక రచన చేశారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయాన్ని రూ.60కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో మచిలీపట్నం నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు పూర్తి చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా వైకాపా కార్యాలయాన్ని విజయవాడలోని రూ.50కోట్లకు పైగా విలువ చేసే నగరపాలక సంస్థ స్థలంలో కనీసం ప్లాన్‌ అప్రూవల్‌ కూడా లేకుండా నిర్మాణం చేపడుతున్నారు.

మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లోని రూ.60కోట్లకు పైగా విలువైన రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైకాపా కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో.. ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి.వాటిని కాదని దౌర్జన్యంగా కార్యాలయం కట్టుకుంటున్నారు. మచిలీపట్నంలో అంతా తానై చక్రం తిప్పిన వైకాపా మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కన్ను పడగానే.. ఈ స్థలాన్ని కబ్జా చేశారు. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఓ భారీ ప్యాలెస్‌ను వైకాపా జిల్లా కార్యాలయం కోసం కట్టేశారు. నిర్మాణం పూర్తయిపోయి ప్రస్తుతం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కానీ.. అసలు ఆ భవనానికి నిర్మాణ అనుమతులను ఇవ్వకుండానే కట్టేయడం గమనార్హం. ప్రజోపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించే సర్కారు స్థలాన్ని ఎలా ఆక్రమించుకుంటారంటూ మచిలీపట్నంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు చేపట్టినా వారిని అధికారంతో అణచివేసి మరీ దర్జాగా పార్టీ కార్యాలయాన్ని కట్టుకున్నారు.

పేర్ని నాని కన్నుపడిన వెంటనే పాగా..

మచిలీపట్నం జిల్లా కోర్టుకు సమీపంలో ఆర్‌ఎస్‌ నెం.371/ఎ1లో ఆరు ఎకరాలకు పైగా గతంలో పోలీసుశాఖ అవసరాల కోసం వినియోగించిన స్థలం ఖాళీగా ఉంది. వైకాపా కార్యాలయం నిర్మాణం కోసం భూమిని చూడాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించిన వెంటనే.. మాజీ మంత్రి పేర్ని నాని కన్ను రూ.కోట్ల విలువైన ఈ ఆరు ఎకరాలపై పడింది. దానిలో కొంత స్థలంలో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టాలనే ప్రతిపాదనలకు సంబంధించిన దస్త్రం నగరపాలక సంస్థ అధికారుల వద్ద ఉంది. కానీ ఆ దస్త్రానికి అనుమతి ఇవ్వకుండా పేర్ని నాని ఆపించేశారు. ఆరు ఎకరాల్లో రెండెకరాలు తమకు పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టి.. ఆమోదించారు. ఆ తర్వాత భూమి కేటాయింపు అనుమతులను మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో పాలకవర్గం 2022 మే 13న ఆమోదిస్తూ తీర్మానం చేశారు. పోలీసు విభాగానికి సంబంధించిన స్థలం కావడంతో వారి నుంచి కూడా రాత్రికి రాత్రి నోఅబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ జారీ చేయించారు. ఆ వెంటనే ఆగమేఘాలపై భవన నిర్మాణ పనులు ఆరంభించి చకచకా కట్టుకుంటూ వెళ్లిపోయారు. కనీసం ఈ భవనానికి ప్లాన్‌ అప్రూవల్‌ ముడ నుంచి రావాలనే విషయం కూడా పట్టించుకోకుండా అక్రమంగా కట్టేసుకున్నారు. ఈ విషయంపై ముడ వీసీ పి.వి.రమణను ‘ఈనాడు’ వివరణ కోరగా వైకాపా కార్యాలయ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటివరకూ తాము ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లైసెన్స్‌ ప్లానర్‌ నుంచి భవన నిర్మాణానికి సంబంధించిన అప్రూవల్‌ ఇవ్వాలని కోరుతూ శుక్రవారం (2024 జూన్‌ 21)న తమ కార్యాలయానికి దస్త్రం వచ్చిందని, ప్రస్తుతం దానిని పరిశీస్తున్నట్టు తెలిపారు. భవనం మొత్తం అక్రమంగా కట్టేసుకుని ఇప్పుడు ప్లాన్‌ అప్రూవల్‌ కోసం ముడకు దరఖాస్తు చేయడం వైకాపాకే చెల్లింది.

నగరం నడిబొడ్డున అక్రమంగా..

మచిలీపట్నం నగరం నడిబొడ్డున అక్రమంగా కట్టిన వైకాపా జిల్లా కార్యాలయాన్ని చూడగానే అదేదో భారీ రాజసౌధం అని అనిపిస్తుంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత ఖరీదైన రెండు ఎకరాల స్థలాన్ని తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా లీజుకు తీసుకున్నారు. ఏడాదికి ఎకరాకు కేవలం రూ.వెయ్యి లీజు చొప్పున రెండెకరాలకు రూ.2వేలు చెల్లించేలా నగరపాలక సంస్థ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. ఏకంగా 33 ఏళ్లకు కలిపి ఏడాదికి రూ.2వేల చొప్పున రూ.66వేలను చెల్లించి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. నిబంధనల ప్రకారం నగరంలో 1000చ.గ. విస్తీర్ణం దాటిన స్థలంలో భవన నిర్మాణాల కోసం మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడ) అప్రూవల్‌ తీసుకోవాలి. కానీ ఇప్పటివరకూ ఈ భవనానికి సంబంధించిన ప్లాన్‌కు ముడ అనుమతులు ఇవ్వలేదు. అసలు ముడ అనుమతి లేకుండా దర్జాగా చట్టవిరుద్ధంగా ఇలా భారీ భవనం ఎలా నిర్మించారనేది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే పార్టీ కార్యాలయ భవనాన్ని సర్వహంగులతో నిర్మించేశారు.

విజయవాడలో ఏ అనుమతీ తీసుకోకుండా..

విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే విద్యాధరపురంలోని సితారా సెంటర్‌కు సమీపంలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే 1.01ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వైకాపా కార్యాలయాన్ని కట్టుకుంటున్నారు. వెలంపల్లి కన్నుపడిన వెంటనే ఆ స్థలాన్ని వైకాపాకు 33 ఏళ్లకు, ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున లీజు చెల్లించేలా క్యాబినెట్‌లో ఆగమేఘాల మీద ఆమోద ముద్ర వేయించారు. ఆ వెంటనే కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏ ఒక్క శాఖ అనుమతి లేకుండానే అక్రమ నిర్మాణం మొదలు పెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా, రూపాయి కూడా నగరపాలక సంస్థకు చెల్లించకుండా నిర్మాణం ఆరంభించారు. పార్టీ కార్యాలయ భవనం పేరిట సాగుతున్న ఈ నిర్మాణ ప్లాను తొలుత కార్పొరేషన్‌ ద్వారా సీఆర్‌డీఏ, టౌన్‌అండ్‌ కంట్రీప్లానింగ్, సీడీఎంఏ అనుమతి పొందాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి పంపించి మిగిలిన శాఖల అనుమతి తీసుకున్న తర్వాత నిర్దేశించిన రుసుం చెల్లించాకే నిర్మాణం ఆరంభించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని