logo

కోలుకుంటున్న జగ్గయ్యపేట

గడిచిన ఐదు రోజులుగా జగ్గయ్యపేట ప్రాంతాన్ని కుదిపేసిన అతిసార వ్యాధి ఆదివారం నాటికి అదుపులోకి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కొత్తగా వచ్చే రోగుల సంఖ్య తగ్గింది. డిశ్ఛార్జి కేసులు పెరగడం, కొత్తగా మృతులెవరూ లేకపోవడంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Published : 24 Jun 2024 05:11 IST

 పెరుగుతున్న డిశ్ఛార్జి కేసులు
ఆస్పత్రిలో 34 మంది బాధితులు 

జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో డయేరియాతో  చికిత్స పొందుతున్న చిన్నారులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: గడిచిన ఐదు రోజులుగా జగ్గయ్యపేట ప్రాంతాన్ని కుదిపేసిన అతిసార వ్యాధి ఆదివారం నాటికి అదుపులోకి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కొత్తగా వచ్చే రోగుల సంఖ్య తగ్గింది. డిశ్ఛార్జి కేసులు పెరగడం, కొత్తగా మృతులెవరూ లేకపోవడంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం స్వయంగా మంత్రి పరిశీలన, సమీక్ష జరిపారు. గత బుధవారం నుంచి మొదలైన అతిసార లక్షణాల రోగులు మొదట ఆర్‌ఎంపీల వద్ద, తర్వాత ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరడంతో ప్రభుత్వానికి సమాచారం లేకపోయింది. ప్రయివేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీల నుంచి విజయవాడ వెళ్లిన కేసుల్లో మృతులు ఉండడంతో ఉలిక్కిపడ్డ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వాసుపత్రిలో గురువారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం వరకూ జగ్గయ్యపేట పట్టణంలో ఇద్దరు, నియోజకవర్గంలో నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు హెచ్‌ఐవీ రోగులుగా, మరో ఇద్దరు హృద్రోగులుగా తాము గుర్తించామని, అధికారికంగా ఇద్దరే మృతులు నమోదయ్యారని వైద్యాధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం వరకూ మొత్తం రోగుల సంఖ్య 49 కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 28గా ఉంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 13 మంది కొత్తగా వచ్చి చేరగా 10 మంది డిశ్ఛార్జి అయి వెళ్లారు. సోమవారం మరో 11 మంది డిశ్ఛార్జికి సిద్ధంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డీఎంహెచ్‌ఓ సుహాసిని అయిదు రోజులుగా జగ్గయ్యపేటలోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. డీసీహెచ్‌ఓ సహా వైద్యాధికారుల బృందంతో పాటు విజయవాడ నుంచి అదనపు వైద్యులు సేవలు అందిస్తున్నారు. జగ్గయ్యపేట సీహెచ్‌సీలో మహిళలకు, పిల్లలకు ప్రత్యేక వార్డులు నిర్వహిస్తున్నారు. చిల్లకల్లు, షేర్‌మహ్మద్‌పేట, మక్కపేటల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని