logo

అమరావతి గెలిచింది.. అమ్మ మొక్కు తీరింది

ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమించిన రాజధాని రైతుల కోరిక తీరింది. ఏకైక రాజధానిగా అమరావతి ప్రగతికి బాటలు పడుతుండడంతో రైతులు, మహిళలు తమ మొక్కు తీర్చుకున్నారు. నాలుగున్నరేళ్ల కిందట అమ్మవారికి ముడుపులు చెల్లించేందుకు విజయవాడ బయలుదేరిన రైతులను తీవ్ర ఆంక్షలతో అడ్డుకున్నారు.

Published : 24 Jun 2024 05:21 IST

తుళ్లూరు నుంచి ఇంద్రకీలాద్రికి పాదయాత్ర

అమ్మ కొండ ఎక్కుతున్న మహిళలు

ఈనాడు, అమరావతి న్యూస్‌టుడే, తుళ్లూరు, ఇంద్రకీలాద్రి: ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమించిన రాజధాని రైతుల కోరిక తీరింది. ఏకైక రాజధానిగా అమరావతి ప్రగతికి బాటలు పడుతుండడంతో రైతులు, మహిళలు తమ మొక్కు తీర్చుకున్నారు. నాలుగున్నరేళ్ల కిందట అమ్మవారికి ముడుపులు చెల్లించేందుకు విజయవాడ బయలుదేరిన రైతులను తీవ్ర ఆంక్షలతో అడ్డుకున్నారు. అప్పట్లో పాదయాత్రగా బయలుదేరిన వారిని పోలీసులు చావబాదారు. ఖాకీలు సాగించిన దమనకాండ అమరావతి ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. రాష్ట్రం మొత్తం అమరావతిపై దృష్టి సారించేలా చేసింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల్లో స్పందన వచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గీతం రాష్ట్ర ప్రజలను కదిలించింది. రాష్ట్రాన్ని, రాజధానిని కాపాడుకోవాలనే స్ఫూర్తిని ప్రజల్లో రగిలించింది. అప్పట్లో ఆగిన పాదయత్రను తిరిగి ఆదివారం కొనసాగించారు. తుళ్లూరు నుంచి రాయపూడి సీడ్‌యాక్సెస్, మంతెన సత్యనారాయణ ఆశ్రమం, కరకట్ట, సీఎం చంద్రబాబు ఇంటి మీదుగా సీతానగరం, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం, ప్రకాశం బ్యారేజీ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీనికి వాతావరణం కూడా సహకరించింది. 24 కి.మీ దూరాన్ని ఉక్కు సంకల్పంతో పూర్తి చేశారు. కాలినడకన తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి బయలుదేరిన మహిళలు ఎర్రచీరలు, ఆకుపచ్చ కండువాలను ధరించి సారె, కుంకుమ, పూలు, పొంగళ్లతో బయలుదేరారు. తెల్లవారుజామున 5గంటలకు మొదలైన పాదయాత్ర ఇంద్రకీలాద్రికి 11 గంటలకు చేరింది. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

సీడ్‌ యాక్సెస్‌ రహదారిలో నడిచి వస్తూ..

తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ రైతుల పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్నారు. ప్రకాశంబ్యారేజీ వద్దకు వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అమ్మవారి ప్రతిమను పట్టుకుని రైతులతో యాత్రలో పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. రూ.50వేలతో కొనుగోలు చేసిన చీరను అమ్మవారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

రైతులతో పాటు కలిసి దుర్గమ్మ గుడికి వస్తున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌

వైకాపాను ప్రజలు ఈడ్చికొట్టారు

కొమ్మినేని వరలక్ష్మి, రాజధాని మహిళా రైతు

అమరావతిని కాపాడమ్మా అంటూ కనకదుర్గమ్మను వేడుకొనేందుకు పాదయాత్రగా వెళుతున్న మహిళలను వైకాపా ప్రభుత్వం పోలీసులతో రక్తం కారేలా కొట్టించింది. పాపం పండింది. ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈడ్చి కొట్టారు. ఆనాడు కొంతమంది పోలీసులు కూడా వైకాపా నాయకుల్లా మారి అమరావతి రైతులపై విరుచుకుపడ్డారు. మహిళ అని చూడకుండా నాపై 24 కేసులు పెట్టారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రానికి మంచి రోజులు రావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నాం.

వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో.. 

నాడు ఆగింది.. నేడు పూర్తి చేశాం

పువ్వాడ సుధాకర్, అమరావతి ఐకాస కన్వీనర్‌

ఏకైక రాజధానిగా అమరావతిని కాపాడుకోవడానికి మహిళలు దుర్గమ్మ చెంతకు పాదయాత్రగా వెళుతుంటే వైకాపా ప్రభుత్వం నాడు క్రూరంగా వ్యవహరించింది. ముళ్ల కంచెలు వేసి లాఠీలతో రక్తమోడేలా కొట్టారు. అన్యాయంగా పాదయాత్రను ఆపేశారు. నారీమణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలుపెరగక అనుక్షణం ఉద్యమించారు. ప్రజలు వైకాపాకు చరమ గీతం పాడి పాతాళానికి తొక్కారు. ఆనాడు ఆగిన పాదయాత్రను నేడు పూర్తి చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని