logo

అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు పారక 4,500 ఎకరాలకుపైగా వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. పర్యవేక్షణ, నిర్వహణ లేక పంట కాలువల గట్లు కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురై, నీటి నియంత్రికలు శిథిలమయ్యాయని కపిలేశ్వరపురం ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

Published : 24 Jun 2024 05:32 IST

వేలాది ఎకరాల్లో సాగుకు గ్రహణం

శిథిలమైన కేఎన్‌ఛానల్‌ నియంత్రిక గోడలు

న్యూస్‌టుడే, మంటాడ(పమిడిముక్కల): అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరు పారక 4,500 ఎకరాలకుపైగా వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. పర్యవేక్షణ, నిర్వహణ లేక పంట కాలువల గట్లు కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురై, నీటి నియంత్రికలు శిథిలమయ్యాయని కపిలేశ్వరపురం ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. జలవనరుల శాఖ కంకిపాడు సెక్షన్‌లోని ఉయ్యూరు, పుల్లేరు కాలువ నుంచి పలు మండలాల భూములకు కపిలేశ్వరపురం కొత్త కాలువ (కేఎన్‌ ఛానల్‌), కపిలేశ్వరపురం ట్యాంక్‌ ఛానల్‌ (కేటీ ఛానల్‌) ద్వారా సాగునీరు పంపిణీ అవుతోంది. ఈ రెండు కాలువలు ఏళ్ల తరబడి నిర్వహణ లేక అస్తవ్యస్తంగా తయారై తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూడికతో నిండిన కేటీ ఛానల్‌

ఈ ఛానల్‌ కూడా ఉయ్యూరు బస్టాండు సమీంలో పుల్లేరు కాలువ నుంచి ప్రారంభమై ఉయ్యూరు మీదుగా కపిలేశ్వరపురం నుంచి వేల్పూరు వరకు వేలాది ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తోంది. ఏళ్లతరబడి నిర్వహణ లేక వివిధ వ్యర్థాలు, గుర్రపు డెక్క, తూటుకాడతో పేరుకుపోయి సాగునీరు సక్రమంగా పారుదల లేక కపిలేశ్వరపురం దిగువ గ్రామాల్లో సాగుజాప్యం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలుషిత వ్యర్థాలతో సాగునీటి కాలువ

సాగు ఖర్చులు పెరిగాయి

ఆకుమళ్లకు, పైరుకు సాగునీరు రాకపోవడంతో బోర్ల ద్వారా సాగు చేసుకుంటున్నాం. కొంతమంది చమురు ఇంజిన్లతో బోర్ల నుంచి నీటిని తోడుకుంటున్నారు. దీంతో ఖర్చులు పెరిగాయి. సాగు కూడా జాప్యం కావడంతో దిగుబడులు తగ్గి నష్టాలపాలవుతున్నాం.

మండపాక కాకాని, రైతు

 పాడైన జల నియంత్రిక

తక్షణం మరమ్మతులు చేపట్టాలి

సకాలంలో సాగునీరు అందక రైతులు విద్యుత్తు, చమురు ఇంజిన్లపై ఆధారపడి ఆర్థికంగా దెబ్బతింటున్నారు. ఇప్పటికైనా జలవనరులశాఖ అధికారులు స్పందించి రెండు కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి. కేఎన్‌ఛానల్‌కు సంబంధించిన పుల్లేరులోని నియంత్రికను వెంటనే బాగు చేయాలి. కాలువ గట్టుపై గల ఆక్రమణల్ని తొలగించారు.

కొల్లిపర వెంకటేశ్వరరావు, రైతు

ఆక్రమణలతో కుంచించుకుపోయి

పుల్లేరు కాలువపై కేఎన్‌ ఛానల్‌ 7 కి.మీ. నిడివితో గరికపర్రు, పెనమకూరు, వీరంకి, కపిలేశ్వరపురం తదితర గ్రామాల భూములకు సాగునీరు అందిస్తోంది. నిర్వహణ లేక ఈ ఛానల్‌కు ఉయ్యూరు సీడీసీ కార్యాలయం వద్ద గల ప్రధాన తూము, నియంత్రిక కొన్నేళ్ల కిందటే ధ్వంసమైంది. జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఉయ్యూరు పరిధిలోనే కిలోమీటరుకుపైగా ఇరువైపులా గట్లు అంచుతోసహా ఆక్రమణలకు గురై పక్కా కట్టడాలు వెలిశాయి. ఫలితంగా ఇరువైపులా గృహాల నుంచి వచ్చే మురుగునీరు, చెట్ల కొమ్మలు, వ్యర్ధాలతో ఈ కాలువ నిండిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు

పరిసరాల్లోని పశువులకొట్టాలు, మరుగుదొడ్ల వ్యర్థాలు ఈ కాలువలోనే వదులుతున్నారు. కాలువలోకి దిగేందుకు కూడా అవకాశం లేకుండా ప్రహరీలు నిర్మించారు. పూడిక తీసేందుకు రైతులు ప్రయత్నిస్తే తమ కట్టడాలకు ఇబ్బంది కలుగుతుందని ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.

లంక పూర్ణమహేంద్రచౌదరి, రైతు, కపిలేశ్వరపురం

నాలుగేళ్లుగా ఏ పనులూ చేయలేకపోయాం

నిధులు లేక నాలుగేళ్లుగా ఏ పనులూ చేపట్టలేకపోయాం. నిధులు మంజూరు కాగానే అధికారుల ఉత్తర్వుల మేరకు సాగు నీటి సరఫరాకు అవసరమైన పనులన్నీ చేపట్టి పూర్తి చేస్తాం. 

వీరాంజనేయులు, జలవనరుల శాఖ కంకిపాడు సెక్షన్‌ ఏఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని