logo

న్యాయమే గెలిచింది.. బ్రదర్‌!

ఎన్టీఆర్‌ మానసపుత్రికకు పూర్వ వైభవం వచ్చింది. విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్‌ పేరును పెడుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Updated : 25 Jun 2024 09:29 IST

ఆరోగ్య వర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్‌ పేరు
విద్యార్థి, ఉద్యోగ సంఘాల హర్షాతిరేకం
జగన్‌ చేసిన పనితో భ్రష్టుపట్టిన విశ్వవిద్యాలయం
రూ.400 కోట్ల నిధులనూ మళ్లించి తీసుకెళ్లిపోయారు

ఈనాడు, అమరావతి - విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ మానసపుత్రికకు పూర్వ వైభవం వచ్చింది. విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్‌ పేరును పెడుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ రెండేళ్ల కిందట కక్ష గట్టినట్టుగా ఎన్టీఆర్‌ పేరును తొలగించి.. తన తండ్రి వైఎస్‌ పేరు పెడుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీనిపై అప్పట్లోనూ విశ్వవిద్యాలయం విద్యార్థులు, సిబ్బంది సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా.. జగన్‌ తన పంథాను ఏమాత్రం వీడకుండా.. ఎన్టీఆర్‌ పేరును మార్చేశారు. గతంలో ఎన్నడూ ఇలా మహనీయుల పేర్లను తొలగించి.. కొత్తవి పెట్టుకునే సంస్కృతే లేదని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మళ్లీ ఎన్టీఆర్‌ పేరును విశ్వవిద్యాలయానికి పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించడం శుభపరిణామం అని అన్ని వర్గాలూ కొనియాడుతున్నాయి.

దేశంలోనే తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని  1986 నవంబరు ఒకటో తేదీన విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఏర్పాటు చేశారు. వైద్యరంగానికి చెందిన 26 మెడికల్, డెంటల్, ఆయుర్వేద, హోమియో, నర్సింగ్‌ కళాశాలలను ఒకే గూటి కిందకు తీసుకొచ్చారు. యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా ఆయన నామకరణం చేశారు. తర్వాత కొన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మార్చారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి.. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పేరు పెట్టారు. ఆ తర్వాత వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ పేరు ముందు డాక్టర్‌ను జోడించారు. అలాంటిది 2022లో ఎన్టీఆర్‌ పేరును పూర్తిగా వైకాపా ప్రభుత్వం తొలగించడం గమనార్హం.

జగన్‌ దెబ్బకు విద్యార్థులకు అవస్థలు..

ఎన్టీఆర్‌ పేరును మార్చడం వల్ల.. జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల్లో ఇక్కడి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలామంది విద్యార్థులకు 2022కు ముందు వచ్చిన డిగ్రీ పట్టా డాక్టర్‌ ఎన్టీఆర్‌ పేరుతో ఉండగా, ఆ తర్వాత వచ్చిన పీజీ పట్టా వైఎస్‌ పేరుతో ఉండడంతో విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఎన్నో అభ్యంతరాలు పెట్టాయి. అలాగే విశ్వవిద్యాలయంలో ఉంచిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కూడా తొలగించడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ చర్యను విరమించుకున్నారు. కానీ.. విశ్వవిద్యాలయం ఎదుట వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తృప్తి పడ్డారు. 

రాష్ట్రంలో వైద్య విద్య పురోగతి..

ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో 400కు పైగా కళాశాలలకు అనుమతులు ఇచ్చి రాష్ట్రంలో వైద్య విద్య పురోగతికి ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం చేసిన కృషి అమోఘం. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినా డాక్టర్‌ ఎన్టీఆర్‌ పేరుతోనే విశ్వవిద్యాలయం డాక్టర్‌ పట్టాలను జారీ చేస్తోంది. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు. పేరు మార్చడంతో పాటు.. విశ్వవిద్యాలయం ఖాతాలో ఉన్న రూ.400 కోట్లను మళ్లించి తీసుకెళ్లిపోయారు. ఉద్యోగులు రోజుల తరబడి పోరాటం చేసినా.. ఫలితం లేకపోయింది. ఈ దెబ్బకు విశ్వవిద్యాలయం ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని