logo

జీవో 2430ను రద్దు చేయాలి : ఐజేయూ

మీడియాను బెదిరించేందుకు గతంలో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 2430ను వెంటనే రద్దు చేయాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 26 Jun 2024 04:06 IST

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే : మీడియాను బెదిరించేందుకు గతంలో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 2430ను వెంటనే రద్దు చేయాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం గాంధీనగర్‌లోని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాల్‌లో నిర్వహించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వర్కింగ్‌ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోగా.. వివిధ రూపాల్లో ప్రభుత్వ వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉందనే దానితో నిమిత్తం లేకుండా.. భావ ప్రకటనా స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలను కచ్చితంగా వ్యతిరేకించాలని స్పష్టం చేశారు.  పూతలపట్టు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్‌ పాత్రికేయుడు, ఏపీయూడబ్ల్యూజే నాయకుడు డాక్టర్‌ మురళీమోహన్‌ను నాయకులు ఘనంగా సత్కరించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని మురళీమోహన్‌ హామీ ఇచ్చారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌ మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితుల్లోనూ జర్నలిస్టుల సమస్యలపై యూనియన్‌ పోరాడిందని గుర్తు చేశారు. ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్‌కుమార్‌లు మాట్లాడుతూ.. శాసన సభ కవరేజీ చేయకుండా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని నూతన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు. సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివలు మాట్లాడుతూ.. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు రాయితీ కొనసాగించాలని కోరారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని