logo

పట్టణ ప్రణాళికాధికారులపై వేటు

నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించడం, క్షేత్రస్థాయి పరిశీలనలో పూర్తి నిర్లక్ష్యం, విధుల్లో అశ్రద్ధ వంటి వివిధ కారణాలతో ముగ్గురు ప్రణాళికా విభాగం అధికారులపై నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు.

Published : 26 Jun 2024 04:09 IST

నిబంధనల ఉల్లంఘనే కారణం

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించడం, క్షేత్రస్థాయి పరిశీలనలో పూర్తి నిర్లక్ష్యం, విధుల్లో అశ్రద్ధ వంటి వివిధ కారణాలతో ముగ్గురు ప్రణాళికా విభాగం అధికారులపై నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో అవినీతికి పాల్పడడం, ప్లానుకు భిన్నంగా నిర్మాణాలు చేస్తున్నా..బాధ్యులకు నోటీసులు జారీ చేయకపోవడం, అనుమతి లేకుండా నిర్మించే కట్టడాల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తదితర అంశాలపై ముగ్గురిపై వేటు వేస్తూ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు వీరు అనుసరిస్తున్న వైఖరి కారణంగా అక్రమ భవన నిర్మాణదారులు నగరపాలక సంస్థపై కేసులు నమోదు చేయడం, నోటీసులు అందుకున్న తర్వాత ఎక్స్‌పార్టీ ఆర్డర్లు పొందడానికి కారణమైనందున వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

అభియోగాలు ఇలా..!

  • అనధికారిక నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన కారణంగా టౌన్‌ప్లానింగ్‌ కార్యదర్శి పరికెల రామును విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. 
  • అనధికారిక అదనపు అంతస్తులపై తగిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయిన కారణంగా టౌన్‌ప్లానింగ్‌ అధికారి(ఇన్‌ఛార్జి టిపిబివో-2) కె.శ్రీనివాస్‌ను మాతృసంస్థకు సరెండర్‌ చేశారు. 
  • తన పరిధిలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీగా అనధికారిక అంతస్తులు, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా..వాటిని గుర్తించడంలో విఫలం కావడంతోపాటు నిర్లక్ష్యం చూపుతున్నారన్న కారణంగా డిప్యూటీ సిటీ ప్లానర్‌(ఏసీపీ-2 ఇన్‌ఛార్జి) వై.బి.ఆర్‌.చంద్రబోస్‌కు షోకాజ్‌ నోటీసు జారీచేశారు.

పట్టణ ప్రణాళికాధికారులు ఎవరైనా ఇకపై అవినీతికి పాల్పడినా, అక్రమ కట్టడాలను ప్రోత్సహించినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని