logo

వసూళ్లు సరే.. మౌలిక వసతులేవీ?

నాగాయలంక వారపు సంత మార్కెట్‌ వివిధ సమస్యలతో కునారిల్లుతోంది. శని, ఆదివారాల్లో సంత నిర్వహించేందుకు పంచాయతీ వారు షెడ్లు, ప్లాట్‌ఫాంలు, గదులు నిర్మించారు.

Published : 11 Jul 2024 03:11 IST

సమస్యలతో కునారిల్లుతున్న నాగాయలంక వారపు సంత
న్యూస్‌టుడే, నాగాయలంక

నాగాయలంక వారపు సంత మార్కెట్‌ వివిధ సమస్యలతో కునారిల్లుతోంది. శని, ఆదివారాల్లో సంత నిర్వహించేందుకు పంచాయతీ వారు షెడ్లు, ప్లాట్‌ఫాంలు, గదులు నిర్మించారు. దుకాణదారుల నుంచి ఆశీలు వసూలు చేసేందుకు ఏటా వేలం పాటలు నిర్వహించి గుత్తేదారులకు అప్పగిస్తారు. 2024 సంవత్సరానికిగాను రూ.7.30 లక్షలకు గుత్తేదారు పాట దక్కించుకున్నారు. అయితే పంచాయతీ ప్రకటించిన ధరలకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారని.. ఆశీల రూపంలో ఆదాయం సమకూరుతున్నా మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని దుకాణదారులు ఆరోపిస్తున్నారు.

  • కూరగాయల విక్రయాల కోసం ఒక షెడ్డు, రెండు ప్లాట్‌ఫాంలు నిర్మించారు. పర్యవేక్షణ, నిర్వహణ లేక వాటి చుట్టూ పిచ్చి చెట్లు మొలిచాయి. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి.
  • ఎండు చేపలు, రొయ్యల ఉత్పత్తులు నిల్వ చేసేందుకు మార్కెట్లో గదులు ఎర్పాటు చేసి గదికి నెలకు రూ.800 వసూలు చేస్తున్నారు. వర్షం కురిస్తే గదుల్లోకి నీరు చేరి ఉత్పత్తులు పాడవుతున్నాయి. పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.
  • మత్స్య ఉత్పత్తుల విక్రయాలు, ఎండబెట్టుకోవడానికి రెండు షెడ్లు నిర్మించారు. వాటిలో ఒకదానికి స్తంభాలు పాడైపోయి ఇనుప చువ్వలు బయటపడి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి.
  • ప్రజల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల వద్దకు వెళ్లేందుకు సదుపాయం లేక అపరిశుభ్రంగా మారాయి. 
  • వారపు సంత పల్లంగా ఉండడంతో కొద్దిపాటి వర్షానికే నీరు చేరి చెరువును తలపిస్తోంది. అధికారులు సంత మార్కెట్‌ను అభివృద్ధి చేసి అక్కడే మాంసం, చేపల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
  • ఈ అసౌకర్యాలపై నాగాయలంక పంచాయతీ కార్యదర్శి పవన్‌కుమార్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా మౌలిక వసతుల కల్పనపై దృషి సారిస్తామన్నారు. 

గదులు తక్కువ ధరకు అద్దెకివ్వాలి

- కొల్లు వీరవేణి, దుకాణదారు

ఎండు చేపల ఉత్పత్తులకు ఏర్పాటు చేసిన గదులు చిన్నవిగా ఉన్నాయి. పైకప్పు పెచ్చులూడిపోతూ ప్రమాదకరంగా మారాయి. అద్దె మాత్రం నెలకు రూ.800 వసూలు చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేసి తక్కువ ధరకు అద్దెకివ్వాలి.


వసతులు మెరుగుపరచండి

- లంకె నాంచారమ్మ 

సంత మార్కెట్లో తాగేందుకు, వాడుకునేందుకు నీరు లేక ఇబ్బందిగా ఉంటోంది. మరుగుదొడ్లలోకి వెళ్లలేని దుస్థితి. చిన్నపాటి వర్షానికే ప్రాంగణం నీట మునుగుతోంది. మౌలిక వసతులు మెరుగు పరచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని