logo

కూటమి గళం.. ప్రజలకు ఫలం..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నగర ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు జరుగుతున్నాయి. బుధవారం నాటి కౌన్సిల్‌ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థలో వైకాపా పాలకపక్ష వైఖరిలో మార్పు ఇందుకు నిదర్శనం.

Updated : 11 Jul 2024 05:13 IST

చెత్త పన్ను రద్దుకు తీర్మానం  
ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపు ఉపసంహరణ
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నగర ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు జరుగుతున్నాయి. బుధవారం నాటి కౌన్సిల్‌ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థలో వైకాపా పాలకపక్ష వైఖరిలో మార్పు ఇందుకు నిదర్శనం. నాడు విపక్షాల నిరసనలను తోసిపుచ్చిన వైకాపా పాలకపక్షం నేడు చేసేదేమీ లేని పరిస్థితుల్లో చెత్త పన్ను రద్దు, ఆస్తి విలువల ఆధారిత పన్ను విధింపు ఉపసంహరణ వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి బంతిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి నెట్టేసింది. సభలో విపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తూనే, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ వారి తప్పులను అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేసింది. పలు సందర్భాల్లో అధికార వైకాపా పక్షం వైఖరిని తెదేపా గట్టిగానే తిప్పికొట్టింది. 

నాడు గొంతెత్తితే గెంటేసి..

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా నగరవాసులపై దాదాపు రూ.45 కోట్ల చెత్తపన్ను భారం మోపింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిన ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫలితంగా భవన యజమానులపై రూ.30కోట్ల అదనపు భారం, ఏటా 15 శాతం చొప్పున వడ్డిస్తూ వచ్చింది. భారాల ప్రతిపాదనలపై తెదేపా, సీపీఎం పక్షాలు అనేకసార్లు గత కౌన్సిల్‌ సమావేశాల్లో గొంతెత్తినా, ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా, రద్దుకు ససేమిరా అంటూ వారిని కౌన్సిల్‌ నుంచి బయటకు పంపి కట్టడి చేసింది. ప్రభుత్వం మారిపోవడంతో వాటి రద్దు ప్రతిపాదనలకు పాలకపక్షం తక్షణమే ఆమోదం తెలిపింది. ఇక కీలక, ముఖ్య తీర్మానాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టింది. 

నేడు గత్యంతరం లేక ఆమోదించి..

నగరంలోని గృహ, వాణిజ్య కేంద్రాల నుంచి వసూలు చేస్తున్న చెత్తపన్ను(యూజర్‌ ఛార్జీలు)లను ఉపసంహరించాలంటూ సీపీఎం,  తెదేపా సభ్యులు విడిగా కౌన్సిల్లో ప్రతిపాదన తెచ్చారు. ఆ ప్రతిపాదనలను పాలకపక్షం వెంటనే ఆమోదించింది. ఇక అద్దెవిలువ ఆధారిత ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియ అమలులో ఉండగా, వైకాపా అధికారంలోకి వచ్చాక నివాస భవనాలపై 0.13 శాతం ఆస్తిపన్ను పెంపుదల చేసింది. నివాసేతర భవనాలపై 0.30 శాతం  పెంచగా, అదే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం విపక్షాలు ప్రవేశపెట్టిన ఆయా ప్రతిపాదిత అంశాలను కౌన్సిల్‌ ఆమోదించింది.

అధికారులపైకి తప్పులు నెట్టేస్తూ..

సభలో సభ్యుల ప్రతిపాదనలపై కౌన్సిల్లో చర్చకు అనుమతిస్తూనే, ప్రశ్నలకు సమాధానాలు ఇప్పిస్తూనే, పాలకుల అలక్ష్యాన్ని మాత్రం అధికారులపై నెట్టివేసే యత్నం పాలకపక్షం చేసింది. అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రెయినేజి పనులపై తెదేపా సభ్యుడు సభలో ప్రశ్నించారు. ఇప్పటి వరకు పనులు సక్రమంగా కొనసాగించలేకపోయిన పాలకులు, ఆయా పనులు పూర్తికాకపోవడానికి కారణాలు అధికారులే అన్నట్లు వారిపై విమర్శలు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను వసూళ్లలో అధికార పక్షం పూర్తిగా విఫలం కాగా, ఆ తప్పును అధికారులపై నెట్టివేశారు. పార్కింగ్‌ స్థలాల లీజును తమ సొంత వారికి కట్టబెట్టేసిన పాలకులు కరెన్సీ కట్టలు దండుకున్నారు. పలు పార్కింగ్‌ ప్రాంతాల్లో నిర్ధారిత ఫీజుకు మించి అత్యధికంగా వసూలు చేస్తున్నారంటూ తెదేపా పక్షం కౌన్సిల్లో ఆరోపణలు చేయగా, కప్పిపుచ్చుకునేందుకు మేయర్‌ యత్నించారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో ఆక్రమణలు వచ్చి చేరుతున్నాయని, వాటిని తొలగించాలని ప్రణాళికాధికారులకు చెప్పినా, వినడం లేదంటూ వారిపై మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగానే పార్కింగ్‌ ప్రాంతాలను పాడుకున్న గుత్తేదార్లు మధ్యలోనే వదిలేసి పోతున్నారంటూ వారిని ఆమె వెనుకేసుకొచ్చారు. 

అభివృద్ధిని విస్మరించడంపై ధ్వజం

నగరంలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదంటూ తెదేపా, సీపీఎం పక్షాలు వాదనకు దిగాయి. 2014 నుంచి 2024 వరకు జరిగిన పనుల వ్యత్యాసాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని, రూ.కోట్ల పనులు చేశామంటూ మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్ల వ్యయంతో రహదార్లకు మరమ్మతులు చేశామంటూ చెప్పుకొచ్చారు.

బడ్జెట్‌ మేరకు పనులు చేయరేం?

కార్పొరేటర్ల బడ్జెట్‌ నుంచి పనులు చేయడం లేదంటూ విపక్షాలు ఆరోపించగా, ఇకపై కార్పొరేటర్ల బడ్జెట్‌ నుంచి పనులు ముందుగా చేయాలని, ఆపై మిగిలిన పనులు చేపట్టాలంటూ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని మేయర్‌ తప్పుబట్టారు. వారిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. 

కలుషితనీటి సరఫరా వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ పలువురు సభ్యులు సభ దృష్టికి తేగా, అధికారుల వైఖరిపై మేయర్‌ అసహనం వ్యక్తం చేశారు. నీటి సరఫరా విభాగంలో తక్కువ మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు ఆరోపణలు రాగా, అధికారులనే బాధ్యులను చేసి ఆమె తప్పించుకునే యత్నం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని