logo

మాదకద్రవ్యాల నిరోధమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో ‘యాంటీ నార్కోటిక్‌ సెల్‌’ ఏర్పాటు చేశారు.

Published : 11 Jul 2024 03:19 IST

ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్‌ సెల్‌ ఏర్పాటు
మూడు జోన్లగా విభజన
విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో ‘యాంటీ నార్కోటిక్‌ సెల్‌’ ఏర్పాటు చేశారు. 100 రోజుల యాక్షన్‌ పార్ట్‌లో భాగంగా పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ పర్యవేక్షణలో ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇది పనిచేస్తుంది. ఇందులో ఇంటెలిజెన్స్‌ వింగ్, ఆపరేషన్స్‌ వింగ్, డేటా ఎనాలసిస్‌ వింగ్, అవేర్‌నెస్‌ క్రియేషన్‌ వింగ్‌లు ఉంటాయి. 

ఒక ఏసీపీ, ఇద్దరు సీఐలతో...

ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా ఒక ఏసీపీ, ఇద్దరు సీఐలు, అయిదుగురు ఎస్సైలు ఇతర సిబ్బందితో నార్కోటిక్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఏసీపీ బి.పార్థసారథి, సీఐలు ఐ.వి.నాగేంద్రకుమార్, రమేష్‌కుమార్‌లు పర్యవేక్షిస్తారు. ఒక ఎస్సై కొంత మంది సిబ్బందితో తూర్పు, పశ్చిమ, రూరల్‌ జోన్లుగా మూడు సబ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వారి వారి పరిధిలో తిరుగుతూ పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తారు.

సునిశిత నిఘా, మెరుపు దాడులతో కట్టడి

ఈ నార్కోటిక్‌ సెల్‌ ప్రధానంగా మత్తు పదార్థాల రవాణా, క్రయ విక్రయాలపై గట్టి నిఘా ఉంచుతుంది. ప్రధానంగా గంజాయి, మాదకద్రవ్యాలు రవాణాపై నిఘా ఉంచటం ఇంటెలిజెన్స్‌ వింగ్‌ పని. ఏయే ప్రాంతాల నుంచి రవాణా అవుతుంది? ఎవరు రవాణా చేస్తున్నారు. ఈ ముఠాల వెనుక ఎవరెవరు ఉన్నారు? రవాణా, విక్రయం, కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. గతంలో మాదకద్రవ్యాల కేసుల్లో ఉన్న వారిపై నిఘా ఉంచుతుంది. తప్పించుకు తిరుగుతున్న వారిని అరెస్టు చేస్తుంది. వారిపై నార్కోటిక్‌ షీట్లు తెరుస్తుంది. సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తుంది. వారి నుంచి ఆ సమాచారం ఆపరేషన్స్‌ వింగ్‌కు చేరుతుంది. వారు ఆకస్మిక దాడులు చేసి మాదకద్రవ్య రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతారు. ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని ఎవరిరైనా ప్రలోభపెడితే కఠినచర్యలు తీసుకుంటారు. ఇలా గత నెలలో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో 20 కేసుల్లో 70 మందిని అరెస్టు చేసి చేశారు. వారి నుంచి 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

కౌన్సెలింగ్, అవగాహనా కార్యక్రమాలు

మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారికి సైకాలజిస్ట్‌ల పర్యవేక్షణలో కౌన్సెలింగ్‌ ఇస్తారు. దీన్ని అవేర్‌నెస్‌ క్రియేషన్‌ వింగ్‌ పర్యవేక్షిస్తుంది. బాధితులను డీ అడిక్షన్, రిహేబిలిటేషన్‌ సెంటర్లలో చేర్పిస్తుంది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది.


సమాచారం అందించండి..

మీ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా.. విక్రయం, రవాణా, సేవించడం తదితర సమాచారం తమకు అందించాలని పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ ప్రజలను కోరారు. టోల్‌ఫ్రీ నంబరు 9121162475, మెయిల్‌ ఐడీ antinarcoticcell@vza.appolice.gov.in కు వివరాలు పంపొచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఎన్టీఆర్‌ జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రజలంతా సహకరించాలని సీపీ కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని