logo

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

ఓ వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా చెరువులో పడి ఉన్న సంఘటన మర్రిపాలెంలో కలకలం రేపింది. బంగారం, ఆస్తి కోసం ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Published : 11 Jul 2024 03:21 IST

బంగారం కోసమే హత్య చేసుంటారని గ్రామస్థుల ఆరోపణ

నాగాయలంక, న్యూస్‌టుడే: ఓ వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా చెరువులో పడి ఉన్న సంఘటన మర్రిపాలెంలో కలకలం రేపింది. బంగారం, ఆస్తి కోసం ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుకు వెళ్లే తోవలో రక్తం మరకలు ఉండడం.. ఆమె శరీరంపై బంగారు నగలు లేకపోవడం, గాయాలు ఉండడంతో ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బండ్రెడ్డి మోహినీ స్వరాజ్యలక్ష్మి(70) ఒంటరిగా జీవిస్తోంది. బుధవారం ఆమె ఇంటి సమీపంలోని చెరువులో శవమై కనిపించింది. చెరువులో జారి పడిపోయి ఉంటుందని గ్రామస్థులు తొలుత భావించారు. మృత దేహాన్ని బయటకు తీసి ఇంటివద్దకు చేర్చే క్రమంలో ఆమె మెడలోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద రక్తం మరకలు కనిపించడంతో బంగారం కోసం ఎవరో హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అవనిగడ్డ డీఎస్పీ పి.మురళీధర్, సీఐ త్రినాథ్, ఎస్సై రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ, సీఐ మాట్లాడుతూ స్వరాజ్యలక్ష్మి శరీరంపై గాయాలున్నాయని, బంగారం కనిపించడం లేదని గ్రామస్థులంటున్నారని చెప్పారు. ఆమె సహాయకురాలు గ్రామంలో లేదని.. ఆమె వచ్చిన తరువాత బంగారం గురించి తెలుస్తుందన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని